బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పలు రికార్డులను బద్దలు కొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో గిల్ 269 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత కెప్టెన్‌గా గిల్ నిలిచాడు. గతంలో2019లో విరాట్ కోహ్లి సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 254 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు భారత కెప్టెన్ సాధించిన అత్యధిక స్కోరుగా ఉండేది. ఈ మ్యాచ్‌లో గిల్ ఈ రికార్డును తిరగరాశాడు. 269 పరుగులు చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు.
అంతేగాక ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక పరుగులు సాధించిన కెప్టెన్‌లలో గిల్ మూడో స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా ఆటగాడు బాబ్ సింప్సన్ 311 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. సౌతాఫ్రికా ఆటగాడు 277 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. ఇక ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి భారత కెప్టెన్‌గా గిల్ రికార్డు నెలకొల్పాడు. సేనా దేశాల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆసియా కెప్టెన్‌గా గిల్ నిలిచాడు. అంతేగాక సేనా దేశాల్లో 250 పరుగుల మార్క్‌ను తాకిన తొలి భారత బ్యాటర్‌గా గిల్ అరుదైన రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. ఇలా ఎడ్జ్‌బాస్టన్ మ్యాచ్‌లో గిల్ పలు రికార్డులను నెలకొల్పి సంచలనం సృష్టించాడు.