హైదరాబాద్: చంద్రాయణగుట్టలో సిమ్ బాక్స్ ఏర్పాటు చేసి ఇంటర్నేషనల్ కాల్స్ ను లోకల్ కాల్స్‌గా మార్చుతూ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. టిజి సైబర్ సెక్యూరిటీ బ్యూరో, టెలికమ్యూనికేషన్ శాఖ సంయుక్త ఆపరేషన్ చేయడంతో సిమ్ బాక్స్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ముగ్గురు నిందితులు హిదాయతుల్లా, ఆమద్ ఖాన్, షోయబ్ లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఒక సిమ్ బాక్స్, దాదాపు 200 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. టిజిసిఎస్ బి నిందితుల విచారణలో షాకింగ్ విషయాలు బట్టబయలయ్యాయి. హాంకాంగ్‌కు చెందిన వెనీసా అనే మహిళ మార్గదర్శకత్వంలో నిందితులు ఈ రాకెట్ నడిపారు.
Also Read: గ్రూప్-1 పోస్టులు అమ్ముకుంటారా?
యుకె నంబర్ల ద్వారా సోషల్ మీడియా, ఇంటర్నెట్ ట్రాఫిక్ నడిపేందుకు హిదాయతుల్లాకు వెనీసా సూచనలు చేశారు. పిఒఎస్ ఏజెంట్ల ద్వారా అక్రమంగా సేకరించిన సిమ్ కార్డులను ఈ రాకెట్లో వినియోగించారు. కార్మికుల ఆధార్ వివరాలతో మోసపూరితంగా దాదాపు 500 సిమ్ కార్డులను వినియోగించారు. సిమ్ బాక్స్‌ల ద్వారా ఇంటర్నేషనల్ కాల్స్ ను లోకల్ కాల్స్‌గా మార్చి ప్రజలను నిందితులు మోసం చేసినట్టు గుర్తించారు. విదేశీ నంబర్లతో అపరిచితుల కమ్యూనికేషన్‌కు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు.