సింగరేణి ప్రాంత నిరుద్యోగ యువతకు వివిధ ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం రామగుండం 1 ఏరియా గోదావరిఖని లో వచ్చే ఆదివారం (మే 18) న సింగరేణి ఆధ్వర్యంలో మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు సింగరేణి ఛైర్మన్ మరియు ఎండీ ఎన్. బలరామ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మెగా జాబ్ మేళాలో హైదరాబాద్ ప్రాంతానికి చెందిన సుమారు 100 ప్రైవేటు సంస్థల లో వివిధ విభాగాల్లో 3 వేల ఖాళీలు భర్తీ కోసం ఎంపిక జరుగుతుందన్నారు . నిరుద్యోగ యువత హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేయడం వ్యయ ప్రయాసలతో కూడుకుని ఉంటోందని, ఈ నేపథ్యంలో పలు కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి స్థానికంగా ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దీనిని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఇటువంటి జాబ్ మేళాలు ఇకపై ఇతర ఏరియాలలో కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు. సింగరేణి సంస్థ లో ఉద్యోగ నియామకాలతో పాటు, నిరుద్యోగ యువత అందరికీ ఏదో ఒక ఉపాధి, ఉద్యోగం కల్పించడం కోసం ఈ తరహా కార్యక్రమాలను సింగరేణి సంస్థ స్వచ్ఛందంగా చేపడుతుందని, ఈ అవకాశాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సింగరేణి సంస్థ సింగరేణి ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఇప్పటికే మందమర్రి, రామగుండం-1, భూపాలపల్లి ఏరియాలలో ప్రారంభించామని ఇతర ఏరియాల్లో కూడా త్వరలో ప్రారంభిస్తున్నామన్నారు. యువతలో నైపుణ్యాలు పెంచడమే కాకుండా వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు వీలుగా జాబ్ మేళాలను కూడా ఏర్పాటు చేయిస్తున్నట్లు వివరించారు.