ఉద్యోగాలు ఇప్పిస్తానని.. కోరిన చోటకు బదిలీలు కల్పిస్తానని.. మెడికల్ అన్‌ఫిట్ చేయించి వారసులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి బాధితుల నుంచి రూ.లక్షల్లో దండుకొని కొత్త దందాకు తెరలేపిన సింగరేణి ఎంవి డ్రైవర్‌ను ఎసిబి అధికారులు ఎట్టకేలకు పట్టుకున్నారు. సింగరేణి మెయిన్ ఆస్పత్రిలో డ్రైవర్‌గా పనిచేస్తున్న అన్నబోయిన రాజేశ్వరరావు రూ.50 లక్షలు వసూళ్లకు పాల్పడినట్లు బాధితులు ఎసిబికి ఫిర్యాదు చేశారు. సదరు డ్రైవర్‌తో పాటు మరో బృందం ఏర్పడి ఈ అక్రమ వసూళ్లకు తెరలేపినట్లు తెలుస్తోంది. ఈ ముఠాలో ప్రధానంగా గతంలో సంస్థ ఉద్యోగిగా ఉంటూ అనేక అవకతవకలకు పాల్పడి డిస్మిస్‌కు గురైన ఓ ఉద్యోగి పాత్ర వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
అవినీతి ఆరోపణలతో ఉద్యోగం పోగొట్టుకున్న ఆయన ప్రస్తుతానికి న్యాయవాదిగా అవతారమెత్తి మరిన్ని అక్రమ పనులకు పూనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే సింగరేణి సంస్థలో కొందరు ఉద్యోగులను అనుచరులుగా పెట్టుకొని అక్రమాలకు తెరలేపినట్లు పలువురు ఎసిబికి ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఎసిబి డిఎస్‌పి రమేష్ తన సిబ్బందితో మంగళవారం ఉదయం రాజేశ్వరరావును అతని ఇంట్లోనే అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం బయటికి రాగానే మరింతమంది బాధితులు పెరిగే అవకాశం ఉందని, ఈ కేసుతో సంబంధం ఉన్న అధికారులు ఎవరైనా సరే వారందరిపై చర్యలు ఉంటాయని తెలిపారు.