Sunday, June 15, 2025

రాష్ట్రంలో కాంగ్రెస్, బిజెపి చీకటి స్నేహం: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో కాంగ్రెస్, బిజెపి పార్టీల చీకటి స్నేహం కొనసాగుతుందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ముల్లుగుచ్చితే.. బిజెపి నేతలకు నొప్పిలేస్తుందని, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తే బిజెపి నేతలు స్పందించారని పేర్కొన్నారు. ఎపి జలదోపిడీ విషయంలో బిజెపి నేతలు, కాంగ్రెస్ నేతలు నోరెత్తడం లేదని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రాజెక్టులలో జరుగుతున్న నష్టాల మీద కేంద్ర ప్రభుత్వం స్పందించదు, ఎలాంటి కమీషన్లు వేయదు అని, బిజెపి నేతలు, ప్రజా ప్రతినిధులు స్పందించరు అని చెప్పారు. శ్రీశైలం సొరంగం కూలినా, సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలినా, వట్టెం పంప్ హౌస్ మునిగినా కేంద్రం ఎందుకు కమీషన్లు పంపడం లేదని ప్రశ్నించారు.

వీటి మీద కమీషన్లు వేయమని బిజెపి నేతలు ఎందుకు డిమాండ్ చేయరు..? అని నిలదీశారు. తెలంగాణ భవన్‌లో శనివారం బిఆర్‌ఎస్ నేతలు దేవీప్రసాద్, కిశోర్‌గౌడ్‌లతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ, దేశంలో కాంగ్రెస్, బిజెపి పార్టీలు బద్ద శత్రువులు అని, రాష్ట్రంలో వారు కలిసి ప్రయాణం చేస్తున్నారు అనడానికి వంద ఉదాహరణలు ఉన్నాయని అన్నారు. తెలంగాణలో విఫలమైన ప్రాజెక్టుల మీద బిజెపి నేతలు ఎందుకు స్పందించరు..? అని అడిగారు. కాళేశ్వరం మీద చూపిన అత్యుత్సాహం బిజెపి ప్రభుత్వం మిగతా వాటి మీద ఎందుకు చూపదు..? అని ప్రశ్నించారు. కేంద్రమంత్రి బండి సంజయ్ ఆంధ్రా పర్యటనలో తెలంగాణ కంటే పది రెట్ల నిధుల వరద పారించాం అని చెప్పుకోవడం సిగ్గు చేటు అని పేర్కొన్నారు.

తెలంగాణలో ఒక ప్రాజెక్టుకు పది రూపాయలు తీసుకురాకున్నా ఆంధ్రాకు పంపిస్తున్నాం అని చెప్పడం ఆత్మాభిమానాన్ని చంపుకోవడమే అని, బండి సంజయ్ భేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాల నుండి ప్రజల ఆలోచనలను మరలించేందుకు కమీషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం కమిషన్ విషయంలో నివేదిక తుది దశకు వచ్చిందని, సిఎంగా ఉండి కమిషన్ పనిచేస్తున్నప్పుడు దాని విషయం బయట మాట్లాడడం అనైతికం అని పేర్కొన్నారు. నిజంగా ఆధారాలు ఉంటే కమిషన్‌కు అందజేయాలని, కానీ సిఎం బహిరంగంగా ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News