దుబాయి: టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్, హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ ప్రతిష్ఠాత్మకమైన ఐసిసి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును అందుకున్నాడు. ఆగస్టులో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో, చివరి టెస్టు మ్యాచ్‌లో అసాధారణ బౌలింగ్‌ను కనబరిచిన సిరాజ్ ఏకంగా 9 వికెట్లు పడగొట్టాడు. తీవ్ర ఒత్తిడిలోనూ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అతని ప్రతిభకు గుర్తింపుగా ఆగస్టు నెలకు సంబంధించి ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డును దక్కించుకున్నాడు.
న్యూజిలాండ్ బౌలర్ మ్యాట్ హెన్రీ, విండీస్ ఫాస్ట్ బౌలర్ జేడెన్ సీల్స్‌ను వెనక్కి నెట్టి సిరాజ్ ఈ అవార్డును అందుకోవడం విశేషం. ప్రతిష్ఠాత్మకమైన ఐసిసి అవార్డు లభించడంపై సిరాజ్ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ పురస్కారం తన కెరీర్‌లోనే ప్రత్యేకమైందన్నాడు. తాను ఆడిన అత్యుత్తమ సిరీస్‌లలో సచిన్‌అండర్సన్ ట్రోఫీ ఒకటని పేర్కొన్నాడు. రానున్న రోజుల్లో మరింత మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఈఅవార్డు దోహదం చేస్తుందనే నమ్మకాన్ని సిరాజ్ వ్యక్తం చేశాడు.