విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. (Kingdom) గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే, వెంకటేష్ ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజ న్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ జూలై 31వ తేదీన విడుదలైన ‘కింగ్‌డమ్’ చిత్రం.. ప్రేక్షకులను మెప్పు పొందుతూ భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో సత్యదేవ్, మీడియాతో మాట్లాడుతూ.. ‘దర్శకుడు గౌతమ్ నాకు కింగ్‌డమ్ కథ చెప్పగానే ఎలాంటి లెక్కలు వేసుకోకుం డా వెంటనే ఈ సినిమా చేస్తున్నానని చెప్పాను.
అంత నచ్చింది నాకు ఈ కథ. నా నమ్మకం నిజమై, ఇప్పుడు సినిమాకి ఇంతటి ఆదరణ లభిస్తుండటం సంతోషంగా ఉంది. ఎప్పుడైనా యాక్షన్ సీన్ ప్రేక్షకులకు కనెక్ట్ (Action scene connects audience) అవ్వాలంటే దాని వెనుక బలమైన ఎమోషన్ ఉండాలని నేను నమ్ముతాము. ఇందులో అలాంటి ఎమోషన్ ఉంది కాబట్టే.. నా యాక్షన్ సీన్స్‌కి అంత మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాలో విజయ్‌కి, నాకు ఎంతో పేరు వచ్చిందో వెంకటేష్‌కి కూడా అంత పేరు వచ్చింది. అద్భుతంగా నటించాడు. షూటింగ్ సమయంలోనే బాగా నటిస్తున్నాడని మేమందరం అనుకున్నాం. ఇప్పుడు ప్రేక్షకులు కూడా అదే మాట చెప్తున్నారు. ఒక కొత్త నటుడికి ఇంత పేరు రావడం మామూలు విషయం కాదు. ఇక విజయ్ గొప్ప నటుడు. సన్నివేశాన్ని కానీ, సంభాషణలను కానీ అతను అర్థం చేసుకొని నటించే తీరు నన్ను ఆశ్చర్యపరిచింది.
నాగవంశీ గట్స్ ఉన్న ప్రొడ్యూసర్. ఒక కథను నమ్మి సినిమా చేద్దాం అనుకున్నారంటే.. ఎక్కడా వెనకడుగు వేయరు, ఏ విషయంలోనూ రాజీపడరు. పరిశ్రమలో వంశీ తనకంటూ ప్రత్యేక పంథాను సృష్టించుకున్నారు కాబట్టే.. సితార ఎంటర్టైన్మెంట్స్ ఇంత పెద్ద నిర్మాణ సంస్థగా ఎదిగింది. సినిమాలో శివ పాత్రను గౌతమ్ అద్భుతంగా మలిచారు. ఆ పాత్రలో ఎన్నో లేయర్లు ఉన్నాయి. ప్రేక్షకులు ఆ పాత్రలో ఉన్న ఎమోషన్‌కి కనెక్ట్ అయ్యి ప్రయాణిస్తున్నారు. గౌతమ్ అంత అందమైన రచన వల్లే.. నా పాత్రకు ఇంత పేరు వచ్చింది. ఇక ప్రస్తుతం నేను అరేబియన్ కడలి అనే సిరీస్ చేశాను. అమెజాన్ ప్రైమ్‌లో ఆగస్టు 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ‘ఫుల్ బాటిల్’ అనే సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోంది. వెంకటేష్ మహా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. ‘ఆరంభం’ ఫేమ్ అజయ్ నాగ్‌తోనూ ఓ చిత్రం చేస్తున్నాను. వీటితో పాటు మరో రెండు సినిమాలు ఉన్నాయి’ అని తెలిపారు.