పదిమందికి తీవ్రగాయాలు.. నలుగురి పరిస్థితి ఆందోళనకరం
క్వారీ యాజమాన్యం భద్రతా చర్యలు చేపట్టలేదని అధికారుల ప్రాథమిక నిర్ధారణ
ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు జరపాలి
అధికారులను ఆదేశించిన సిఎం చంద్రబాబు
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపిలోని బాపట్ల జిల్లా బల్లికురవలో ఆదివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గ్రానైట్ క్వారీలో బండరాళ్లు మీద పడడంతో ఆరుగురు కార్మికులు దుర్మరణం చెందారు.ఇప్పటివరకు నాలుగు మృతదేహాలు వెలికితీశారు. బండరాళ్ల కింద చిక్కుకున్న మరో ఇద్దరి మృతదేహాలను బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో క్వారీలో 16 మంది కార్మి కులు పనిచేస్తున్నారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో 10 మంది కార్మికులను మెరుగైన వైద్యం నిమిత్తం నరసరావుపేట ఆసుపత్రికి తరలి ంచారు. వారిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. క్వారీ యాజమాన్యం భద్రతా చర్యలు చేపట్టలేదని అధికా రులు ప్రాథమికంగా నిర్ధారించారు. పదహారు మంది కార్మికులు క్వారీలో పని చేస్తుండగా అకస్మాత్తుగా బండరాళ్లు కిందపడ్డాయని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. దీంతో ఆరుగురు కార్మికులు రాళ్ల కింద పడి నలిగిపోయారని వివరించారు. చనిపోయిన వారంతా ఒడిశాకు చెందిన వారని అధికారులు తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఈ సంఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు అధికారుల నుండి వివరణా త్మక నివే దికను కోరారు. గాయపడిన వారికి నాణ్యమైన వైద్య సంరక్షణ అందించాలని ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు జరపాలన్నారు. క్వారీ కూలి ప్రాణనష్టం తనను తీవ్రంగా కలచివేస్తుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ‘ప్రభుత్వం మృతుల కుటుం బాలకు అండగా నిలుస్తుంది‘ అని ఆయన తన సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మంత్రులు అనగాని సత్య ప్రసాద్, గొట్టిపాటి రవి కుమార్ ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. బాధితులకు ఉత్తమ వైద్య సంరక్షణ అందించాలని అధికారులను కోరారు. కలెక్టర్ మురళి సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. రక్షణ, సహాయ చర్యలను పర్యవేక్షించాలని ఉమ్మడి, డివిజన్ స్థాయి అధికారులను ఆదేశించారు.