స్థానికత నిబంధనపై కోర్టుకెక్కిన రెండు ఏజెన్సీలు
హైకోర్టుకు వేసవి సెలవుల తర్వాతే బెంచ్ మీదికి రానున్న కేసు
మన తెలంగాణ / హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త టెక్నాలజీ అనుసంధానం చేస్తూ కోటి రేషన్ కార్డులన్నింటిని ఎటిఎం తరహా స్మార్ట్(చిప్) కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలన్న ప్రభుత్వ సంకల్పం మరింత జాప్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేసే చర్యల్లో స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై గత కొన్ని నెలలుగా ఎంతో కసరత్తు చేసింది. ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా పలు రాష్ట్రాల్లో అమలు అవుతున్న తీరుతెన్నులను పరిశీలించింది. దాంతో వాటి కన్నా తెలంగాణ రాష్ట్రంలోనే మెరుగైన పరిస్థితులు ఉన్నాయన్న అభిప్రాయానికి వచ్చారు. దాంతో పటిష్టమైన నిబంధనలతో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల తయారీ ఏజెన్సీల ఖరారుకు ప్రభుత్వం టెండర్లను పిలిచింది.
ఇక్కడే ఆఫీసు ఉండాలి
పౌరసరఫరాల శాఖ ఇచ్చిన టెండర్ లో స్మార్ట్ కార్డు క్వాలిటీ నిబంధనలు నిర్దేశించారు. అంతే కాకుండా ప్రభుత్వ పర్యవేక్షణకు వీలుగా టెండర్‌లో పాల్గొనే సంస్థలకు తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన కార్యాలయం లేదా బ్రాంచ్ ఉండాలన్న నిబంధనను ప్రభుత్వం విధించింది. గతంలో అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఏదైన న్యాయపరమైన వివాదాలకు తలెత్తినప్పుడు సదరు ఏజెన్సీ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం స్పష్టంగా ఆ నిబంధనను పెట్టింది.
రాష్ట్రంలో రేషన్ కార్డులు 90.42 లక్షలు
రాష్ట్రంలో ప్రస్తుతం రేషన్ కార్డులు 90.42 లక్షలు ఉన్నాయి. వీటి ద్వారా 285.98 లక్షల మంది లబ్దిపొందుతున్నారు. ఇంకా అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్దంగా ఉండడంతో పేదలు కొత్త రేషన్ కార్డుల కోసం ధరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈ విధంగా ప్రజా పాలన కార్యక్రమంలో, మీ సేవ కేంద్రాల వద్ద కొత్త రేషన్ కార్డుల కోసం ఎక్కువ సంఖ్యలో ధరఖాస్తులు అందుతున్నాయి.
కొత్తగా 15లక్షల ధరఖాస్తులు
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15లక్షల మేరకు కొత్త రేషన్ కార్డుల కోసం అర్హులైన పేదలు ధరఖాస్తులు చేసుకున్నారు. వారంతా ప్రజాపాలన గ్రామసభలలో, మీ సేవ కేంద్రాల్లో ధరఖాస్తు చేసుకున్నారు. ప్రజాపాలన గ్రామసభల్లో 19,34,464 ధరఖాస్తులు అందాయి. వాటిలో 1,97.450 ధరఖాస్తులను అధికారులు పరిశీలించారు. ఇంకా 17,37,014 ధరఖాస్తులను పరిశీలన దశలో ఉన్నాయి. రాష్ట్రంలోని మీ సేవ కేంద్రాల్లో 12,56,719 ధరఖాస్తులు రేషన్ కార్డుల కోసం వచ్చాయి. వాటిల్లో 7,71,053 ధరఖాస్తులను పరిశీలించారు. ఇంకా 4,85,666 ధరఖాస్తులను పరిశీలన దశలో ఉన్నాయి.