Sunday, July 13, 2025

జనాభా పెరుగుదలకు ఏదీ ముకుతాడు?

- Advertisement -
- Advertisement -

ప్రపంచ జనాభా 2025లో 8.2 బిలియన్లను దాటడంతో వనరులు, పర్యావరణం, సామాజిక, -ఆర్థిక స్థిరత్వంపై మానవ విస్తరణ ప్రభావం ఇంతకు ముందెన్నడూ లేనంతగా స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రతి సంవత్సరం జులై మాసంలో జరుపుకునే ప్రపంచ జనాభా దినోత్సవం, ఈ సవాళ్లను గుర్తు చేస్తూ, విధాన నిర్ణేతలు, ప్రభుత్వాలు, వ్యక్తులు స్థిరమైన అభివృద్ధి, లింగ సమానత్వం, అవసరమైన ఆరోగ్య సంరక్షణ సేవలను పొందే దిశగా కృషి చేయాలని కోరుతోంది. ప్రపంచ జనాభా చారిత్రాత్మక గరిష్ట స్థాయికి చేరుకుంది. 2025 నాటికి 8.2 బిలియన్లను అధిగమించింది. ఈ సంఖ్య సుమారు 71 మిలియన్ల మంది వార్షిక పెరుగుదలను ప్రతిబింబిస్తుంది. ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే 0.89% వృద్ధి రేటును సూచిస్తుంది.

గత దశాబ్దాల కంటే ఈ వృద్ధి నెమ్మదిగా ఉన్నప్పటికీ, ప్రపంచం ఇప్పటికీ పట్టణీకరణ, వనరుల వినియోగం, పర్యావరణ ప్రభావం, ఆర్థిక అసమానతలకు (economic inequality) సంబంధించిన సవాళ్లను ఎదుర్కొంటోంది. నానాటికీ పెరుగుతున్న జనాభా, దాని ద్వారా తలెత్తే దుష్పరిణామాలను ప్రజలకు వివరించేందుకు, జనాభా పెరుగుదల సమస్యలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగించేందుకు ఏటా జులై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహిస్తున్నారు. 1987 జులై 11వ తేదీన ప్రపంచ జనాభా ఐదు బిలియన్లకు చేరుకున్న (డే ఆఫ్ ఫైవ్ బిలియన్)రోజున పురస్కరించుకొని జనాభా పెరుగుదల గురించి ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అలా క్లిష్టమైనటువంటి జనాభా సమస్యలపై దృష్టిని ఆకర్షించడానికి ఐక్యరాజ్యసమితి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని 1989లో ప్రారంభించింది.

అప్పటినుండి ఇప్పటివరకు ప్రతి సంవత్సరం జూలై 11వ తేదీన జనాభా దినోత్సవం నిర్వహించుకోవడం జరుగుతున్నది. జనాభా పెరుగుదల కేవలం సంఖ్యల గురించి కాదు. ఇది మానవహక్కులు, లింగ సమానత్వం, ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత, వాతావరణ స్థితిస్థాపకత, ప్రపంచ వనరుల బాధ్యతాయుతమైన ఉపయోగం గురించి కూడా. ఆర్థిక వృద్ధిని పర్యావరణ పరిరక్షణ, మానవ శ్రేయస్సుతో సమతుల్యం చేసే వినూత్న పరిష్కారాలను కనుగొనడానికి ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు, మేధావులు, పరిశోధకులు, సంఘాలు కలిసి పనిచేయాలి. అంతేకాకుండా జనాభా ధోరణులను స్థిరీకరించడంలో మహిళా సాధికారత, పునరుత్పత్తి హక్కులు కీలకపాత్ర పోషిస్తాయి.

అధిక సాంద్రత కలిగిన జనాభాను నిర్వహించడానికి సాంకేతిక పురోగతి, స్మార్ట్ అర్బన్ ప్లానింగ్ కూడా చాలా అవసరం. లేకపోతే అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇప్పటికే జనాభాకు సరిపడా ఆహారం దొరకక ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. దీన్ని అందరూ కూడా దృష్టిలో ఉంచుకోవాలి. వచ్చే ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని పిల్లల్ని కనాలి, వారికి మంచి విద్యను అందించడమే కాకుండా, పౌష్టిక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని కూడా అందించాలి. 2025 ప్రపంచ జనాభా దినోత్సవం థీమ్‌ను చూసినట్లయితే భవిష్యత్తు కోసం ఒక దార్శనిక దృష్టి అనే నినాదంతో ప్రతి వ్యక్తికీ ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండి, వారి హక్కులు గౌరవించబడి, స్థిరమైన అభివృద్ధి సాధించబడుతుంది.

అలాగే కుటుంబ నియంత్రణ, లింగ సమానత్వం, పేదరికం, తల్లి ఆరోగ్యం, మానవ హక్కులు వంటి వివిధ జనాభా సమస్యలపై ప్రజల అవగాహన పెంచడం ప్రపంచ జనాభా దినోత్సవం లక్ష్యం. జనాభా పెరుగుదల ఎక్కువైతే అంటే ఆహారం, నీరు, గృహనిర్మాణం, శక్తి, ఆరోగ్య సంరక్షణ, రవాణా, మరిన్నింటికి డిమాండ్ పెరుగుతుంది. వాటి వినియోగం అంతా పర్యావరణ క్షీణతకు, ఘర్షణలను పెంచడానికి, మహమ్మారి వంటి పెద్ద ఎత్తున విపత్తుల ప్రమాదాన్ని పెంచుతుంది. జనాభాను నియంత్రించడానికి జనాభా పెరుగుదల వల్ల కలిగే సమస్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి.

విద్య, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణం, ఆర్థిక వ్యవస్థపై జనాభా పెరుగుదల ప్రభావం గురించి వివరించాలి. జనాభా నియంత్రణకు సంబంధించిన బిల్లులను రూపొందించి, వాటిని అమలు చేయాలి. అయితే, బిల్లులు రూపొందించేటప్పుడు, ప్రజల హక్కులు, మతపరమైన, సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ప్రభుత్వం కూడా ఈ ప్రాథమిక సమస్య అయిన జనాభా గురించి ఆలోచించడం లేదు. 20వ శతాబ్దం మొదట ప్రపంచ జనాభా 160 కోట్లు. ఈ రోజు ఒక శతాబ్దం తరువాత మనం 720 కోట్ల జనాభా. 2050 నాటికి 960 కోట్ల జనాభా అవ్వవచ్చని అంచనా వేస్తున్నారు. ఇది కేవలం బాధ్యత రహితమైన పునరుత్పత్తి.

భారతదేశంలో 1947 సంవత్సరంలో మన జనాభా 33 కోట్లు. ఇవ్వాళ 120 కోట్లు, ఎన్ని చెట్లు పెంచినా, ఎన్ని చట్టాలు చేసినా, ఎటువంటి సాంకేతికతను తెచ్చినా జనాభా నియంత్రణ లేనిదే పరిష్కారం లేదు. జనాభా నియంత్రణ చేయకుండా, పర్యావరణ, భూమి లేదా నీరు పరిరక్షణ గురించి మాట్లాడడం వల్ల ఏమీ జరగదు. ప్రస్తుత సైన్స్ సాంకేతికత ప్రతి మనిషినీ అతిగా క్రియాశీలకంగా మార్చింది. మానవుని క్రియాశీలతను ఆపలేం, అలా చేస్తే మానవాళి ఆకాంక్షలకు అడ్డుకట్ట వేసినట్లు అవుతుంది. మనం కేవలం జనాభా నియంత్రించడం మాత్రమే చేయగలం. అందరి సమష్టి కృషితోనే ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించి జనాభా పెరుగుదలను అరికట్టవచ్చు.

  • డా. మోటె చిరంజీవి, 99491 94327
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News