‘కొండనాలుకకు మందు వేస్తే.. ఉన్న నాలుక ఊడిపోయింది’ అన్న చందంగా ప్రస్తుతం రైతుల పరిస్థితి తయారైంది. రాష్ట్ర ప్రభుత్వం నకిలీ పురుగుమందుల విక్రయాలను అరికట్టేందుకు ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా వ్యవసాయ శాఖ అధికారుల అండదండలతో ఫర్టిలైజర్ షాపుల యజమానుల తీరు మాత్రం మారడం లేదు. ఫరిలైజర్ షాపుల యజమానులు తమ స్వలాభాల కోసం నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులను విక్రయిస్తూ రైతులను నిండా ముంచుతున్నారు. వ్యాపారులను నమ్మి వారిచ్చిన నకిలీ విత్తనాలు, పురుగుమందులను తీసుకెళ్లిన రైతులు తీరా పంట నష్టం జరిగాక ఏంచేయాలో తెలియన దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. ఇదే పరిస్థితి నిజామాబాద్ జిల్లా, కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో పలువురు రైతులకు ఎదురైంది. వివరాల్లోకి వెళ్తే..మండల కేంద్రంలోని జే.భూమేశ్వర్ ఫరిలైజర్ షాపులో కమ్మర్‌పల్లి, మోర్తాడ్, జగిత్యాల జిల్లా,
ఇబ్రహీంపట్నం మండలాలకు చెందిన పలువురు రైతులు సోయా పంటలో గడ్డిని చంపేందుకు మందులను కొనుగోలు చేశారు. తీసుకెళ్లి గడ్డి మందును సోయా పంటలో పిచికారీ చేశారు. అయితే, ఆ మందులకు గడ్డి చనిపోలేదు… సరికదా..సోయా పంటే ఎండిపోయింది. ఎండిన పంటను చూసి తల్లడిల్లిన కమ్మర్‌పల్లి మండలంలోని ఉప్లూర్ గ్రామ రైతులు వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదిస్తే గడ్డి మందు విక్రయించిన షాపు యజమానిని అడగాలని ఉచిత సలహా ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. దీంతో అయోమయంలో పడిపోయిన రైతులు గడ్డి మందు విక్రయించిన షాపు యజమానిని నిలదీశారు. ఫర్టిలైజర్ షాపు యజమాని రైతులనే దబాయించాడు. తాను ఇచ్చింది నాణ్యమైన కంపెనీ గడ్డ్డి మందులే అని, మీరే సరిగా పిచికారి చేయలేదని ఎదురు సమాధానం ఇచ్చాడు. షాపు యజమాని సమాధానంతో ఖంగుతిన్న రైతులు ‘నువ్వు అమ్మిన మందును నువ్వు చెప్పినట్లే పిచికారీ చేశాం’ అని గట్టిగా నిలదీసి ఆందోళనకు దిగారు.
షాపు యజమాని జే.భూయేశ్వర్ ఉప్లూర్ గ్రామంలో సుమారు 40 నుండి 50 మంది రైతులకు సంబంధించి 100 ఎకరాల వరకు గడ్డి మందు పిచికారీ చేయడం వల్ల సోయా పంట ఎండిపోయినట్లు ఎఇఒ సర్వే చేసి నిర్ధారించారు. దీంతో ఒక్కో ఎకరానికి రూ.11 వేల 300 ఇస్తానని మధ్యవర్తుల సమక్షంలో బేరం కుదుర్చుకున్నాడు. కష్టాన్ని చెప్పుకున్న స్పందించని అధికారుల వైఖరితో విసిగిపోయిన రైతులు షాపు యజమాని ఇస్తానన్న కాడికి తీసుకునేందుకు సమ్మతించారు. ఈ విషయాన్ని అంతా బయటకు పోనియకుండా లోలోపలే వ్యవసాయ శాఖ అధికారుల అండదండలతో షాపు యజమాని రైతులకు డబ్బులు అప్పజెప్పి చేతులు దులుపేసుకున్నాడు. ఇతర గ్రామాల రైతుల ఆందోళన.. నకిలీ గడ్డిమందు పిచికారీ మూలంగానే తమ సోయా పంట ఎండిపోయిందని తెలుసుకున్న పలు మండలాల రైతులు శనివారం ఫర్టిలైజర్ షాపు ముందు ఆందోళనకు దిగారు.
నకిలీ గడ్డి మందు పిచికారీ వల్ల పంట నష్టపోయిన కమ్మర్‌పల్లి మండలం, చౌట్‌పల్లి, హసకోత్తూర్, మోర్డా మండలం, ఓడ్యాట్, సుంకెట్, జగీత్యాల జిల్లా, ఇబ్రహింపట్నం, డబ్బ గ్రామాల రైతులు కమ్మర్‌పల్లికి తరలివచ్చారు. జే.భూమేశ్వర్ ఫరిలైజర్ షాపు ముందు షాపు యజమాని విక్రయించిన గడ్డి మందు డబ్బాలతో ఆందోళనకు దిగారు. ఒకపక్క రైతులు ఆందోళన చేస్తుండగానే, తనకు భోజనం టైం అవుతుందని మూడు గంటలకు రావాలని చెప్పి వెళ్లిపోయాడు.