Sunday, August 24, 2025

సోషల్ మీడియా రెండు వైపులా పదునైన కత్తి: బిజెపి చీఫ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః సోషల్ మీడియా రెండు వైపులా పదునైన కత్తి వంటిది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పార్టీ నాయకులను, శ్రేణులను అప్రమత్తం చేశారు. నగర శివారులోని బైరామల్‌గుడా వద్ద ఓ ఫంక్షన్ హాలులో ఆదివారం ఐటి, సోషల్ మీడియా వర్క్ షాప్‌ను బిజెపి ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఎన్. రాంచందర్ రావు ప్రసంగిస్తూ సోషల్ మీడియా రెండు వైపులా కత్తి వంటిదని అన్నారు. దానిని ఎవరైతే సానుకూలంగా వాడితే వారికి అది శక్తివంతమైన ఆయుధంగా ఉంటుందని తెలిపారు. లేనిపక్షంలో నష్టం కలిగిస్తుందన్నారు. ఎవరైనా తమ పార్టీపై వ్యతిరేక వార్తలు సృష్టించడం, కార్యకర్తల్లో విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. పార్టీ చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు. ఇటీవల కొందరు యూట్యూబ్ వీడియోలలో తప్పుదారి పట్టించే విధంగా థంబ్ నైల్స్, మిస్ ఇన్ఫర్మేషన్ వార్తలను పంపిస్తున్నారని, వాటిని పార్టీ కార్యకర్తలు విశ్వసించకూడదని ఆయన సూచించారు.

సోషల్ మీడియా వారియర్లు పార్టీ కార్యక్రమాలను, పార్టీ సిద్ధాంతాలను, ప్రధాని నరేంద్ర మోడి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతి గురించి ప్రజల్లోకి తీసుకెళ్ళడం పార్టీ సోషల్ మీడియా వారియర్స్ ప్రధాన కర్తవ్యంగా పెట్టుకోవాలని ఆయన సూచించారు. అప్పుడే మన సందేశం ప్రతి ఇంటికీ చేరుతుందని, మన బలం పెరుగుతుందని రాంచందర్ రావు అన్నారు.

బిజెపిని బద్నాం చేసే కుట్రః ప్రేమ్ శుక్లా
పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రేమ్ శుక్లా ప్రసంగిస్తూ ఒబిసి రిజర్వేషన్ల పేరుతో బిజెపిని బద్నాం చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. ఒబిసి వర్గానికి చెందిన నరేంద్ర మోడి ప్రధాని కావడాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్ ప్రజల్లోకి తీసుకెళ్ళాలని అన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికల్లో తెలంగాణకు చెందిన బిసి నాయకుడు డాక్టర్ కె. లక్ష్మణ్‌ను రిటర్నింగ్ అధికారిగా నియమించడం బిసిల పట్ల బిజెపి ఇచ్చిన గౌరవానికి నిదర్శనం కాదా? అని ఆయన ప్రశ్నించారు. దేశం వేగంగా అభివృద్ధి దిశగా పయనిస్తుంటే తెలంగాణ మాత్రం అప్పులు, నిధుల ఎగవేతలతో ఆర్థికంగా దివాళా తీసిందని ఆయన దుయ్యబట్టారు. స్థానిక సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర పథకాలు, అభివృద్ధి పనులపై పూర్తి అవగాహనతో ఉండాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. పత్రికలు న్యూస్ ఛానళ్ళు, సోషల్ మీడియాను కార్యకర్తలు నిశితంగా గమనిస్తుండాలని ప్రేమ్ శుక్లా సూచించారు. ఒబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ప్రసంగిస్తూ తెలంగాణలో బిజెపి బలపడడాన్ని దేశ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారని తెలిపారు. అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బిజెపి నిలబడిందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆయన చెప్పారు. తెలంగాణలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News