సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరమైన పోస్టులను నిరోధించేందుకు మార్గదర్శకాలను తీసుకువచ్చే ఆలోచన చేస్తున్నామని సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించడం స్వాగతించదగిన పరిణామం. హిందూ దేవతలను కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఓ వ్యక్తికి సంబంధించిన కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు భావ వ్యక్తీకరణ, స్వేచ్ఛ విలువను పౌరులు తెలుసుకోవడంతోపాటు స్వీయ నియంత్రణ పాటించవలసిన అవసరాన్ని నొక్కి చెప్పింది. సామాజిక మాధ్యమాల్లో విద్వేషపూరిత ప్రసంగాలను, వ్యాఖ్యలను వ్యాప్తి చేయకుండా సంయమనం పాటించవలసిన అవసరాన్ని బాధ్యత గల ప్రతి పౌరుడూ గ్రహించాలని హితవు చెప్పింది.
అయితే వ్యక్తులే కాదు, బాధ్యతతో మెలగవలసిన రాజకీయ నాయకులు సైతం ప్రత్యర్థులపై తమ అక్కసు వెలిగక్కేందుకు సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగించుకుంటూ ఉండటమే ఇక్కడ విచారించదగిన అంశం. ఒకప్పుడు భావ వ్యక్తీకరణకు వార్తా పత్రికలు, న్యూస్ ఛానళ్లు మాత్రమే ప్రధాన వేదికలుగా ఉండేవి. కొత్త సహస్రాబ్ది ఆరంభంలో సాంకేతిక రంగంలో వచ్చిన విప్లవం కారణంగా ట్విటర్, ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల విస్తృతి పెరిగింది. ఆకట్టుకునే దృశ్యాలతో, భావోద్రేకాలు రేకెత్తించే విధంగా చేసే వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు, ప్రసంగాలతో ఇవి నిరక్షరాస్యులను సైతం ఇట్టే ఆకట్టుకుంటూ, గ్రామీణ ప్రాంతాలకు సైతం వడివడిగా విస్తరించాయి.
ఒక్క భారతదేశంలోనే దాదాపు 70 కోట్ల మంది సామాజిక మాధ్యమాలను వాడుతున్నారంటే, ఇవి సమాజంలో ఎంతగా వేళ్లూనుకుపోయాయో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు తమ వృత్తిగత, వ్యక్తిగత అవసరాలకోసం రోజుకు సగటున 144 నిమిషాలు (దాదాపు రెండున్నర గంటలు) సామాజిక మాధ్యమాల్లోనే గడుపుతున్నట్లు అంచనా. ఆరంభంలో వీటికి ముకుతాడు వేసేందుకు పటుతరమైన చట్టాలు ఉండేవి కావు. దరిమిలా, సామాజిక మాధ్యమాలు సమాజానికి చేస్తున్న చేటును గమనించిన ప్రభుత్వాలు మేల్కొని, కొన్ని చట్టాలు చేయకపోలేదు. ఐటి చట్టంలో 66, 67, 69 వంటి సెక్షన్లతోపాటు పలు సైబర్ చట్టాలకూ రూపకల్పన జరిగింది. అసభ్యకరమైన వీడియోలు లేదా సమాచారాన్ని పోస్టు చేస్తే మూడేళ్ల జైలు శిక్ష విధించవచ్చునంటూ సెక్షన్ 294ను రాజ్యాంగంలో చేర్చారు.
అయితే పటుతరమైన చట్టాలు చేస్తే చాలదు, వాటిని అమలు పరిచే వ్యవస్థలు కూడా అంతే బలంగా ఉండాలి. అలా లేనప్పుడు ఏం జరుగుతుందో చెప్పడానికి మన దేశమే ఒక ఉదాహరణ. సైబర్ చట్టాల అమలుకు ప్రత్యేకంగా సైబర్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నా, అవి సంఖ్యాపరంగా అల్పమే. వీటిని సిబ్బందితోనూ, సాంకేతిక పరిజ్ఞానంతోనూ పరిపుష్టం చేయవలసిన బాధ్యతను పాలకులు విస్మరిస్తున్నారు. ఫలితంగా, సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న నేరాలు, ఘోరాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఇక సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు సృష్టించి పోస్టు చేస్తున్న అసభ్యకరమైన వీడియోలు యువత భవితకు పెనుశాపంగా పరిణమిస్తున్నాయి.
పదహారేళ్లలోపు పిల్లలను సామాజిక మాధ్యమాల వినియోగానికి దూరంగా ఉంచే ప్రక్రియ ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాల్లో ఇప్పటికే ప్రారంభమైనా, ఈ విషయంలో మన పాలకులు ఇప్పటికీ మీనమేషాలు లెక్కిస్తూ ఉండటం విచారకరం.సామాజిక మాధ్యమాలను కట్టడి చేసేందుకు సెన్సార్ బోర్డు ఉండాలని, ఒక ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని మేధావి వర్గాలనుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నా, ఆ దిశగా ఇప్పటివరకూ తీసుకున్న చర్యలు శూన్యం. సామాజిక మాధ్యమాల్లో పెరిగిపోతున్న విద్వేషపూరిత, అసభ్యకర వ్యాఖ్యల ధోరణిపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. గత నెలలోనూ ఒక కేసు విచారణ సందర్భంగా.. ఇలాంటి కేసులలో త్వరగా బెయిల్ రాదనే భయం ఉండాలని, లేదంటే ఎవరికీ రక్షణ లేకుండా పోతుందని హెచ్చరించింది.
తాజా ఉదంతంలోనూ సామాజిక మాధ్యమాల విశృంఖలతకు ముకుతాడువేసే క్రమంలో సలహాలు, సూచనలు ఇవ్వవలసిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఈ నేపథ్యంలో ఇకనైనా పాలకులు మేలుకుని, సామాజిక మాధ్యమాల కట్టడికి తీసుకోవలసిన చర్యలపై దృష్టి సారించవలసిన అవసరం ఎంతైనా ఉంది. విద్వేషపూరిత ప్రసంగాలు, వ్యాఖ్యానాల విషయంలో రాజకీయ నేతలు కూడా బాధ్యత గుర్తెరిగి ప్రవర్తిస్తే సమాజానికి శ్రేయస్కరం. సర్వోన్నత న్యాయస్థానం చెప్పినట్లు ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటిస్తే భావితరాలు పెడదోవ పట్టకుండా కాపాడినవారవుతారు.