లక్షల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సినిమా తరహాలో సొంత అత్తను హత్య చేయించిన అల్లుడి ఘటన సిద్దిపేట జిల్లా, తొగుట మండలం, పెద్దమసాన్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీస్ కమిషనర్ బి. అనురాధ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దమసాన్‌పల్లికి చెందిన తాళ్ళ వెంకటేష్ ఈనెల 7న తన అత్తమ్మ అయిన సిద్దిపేటకు చెందిన తాటికొండ రామవ్వను, గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో చనిపోయిందని తొగుట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ రవి కాంత్ రావు కేసు నమోదు చేసి, సిబ్బందితో రెండు టీమ్స్ ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసు దర్యాప్తులో భాగంగా సిసి కెమెరాలు, సాంకేతిక టెక్నాలజీ ఉపయోగించి తాళ్ల వెంకటేష్‌ను తమదైనశైలిలో విచారించగా ఇన్సూరెన్స్ డబ్బులు లక్షల రూపాయల్లో వస్తాయనే ఆశతో తానే తన అత్త హత్యకు కారణమయ్యానని తెలిపాడు.
తన స్నేహితుడైన కరుణాకర్‌కు పౌల్ట్రీ ఫార్మ్ ఏర్పాటు కోసం 1,30,000- వేల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. ఈ సంవత్సరం మార్చి నెలలో వికలాంగులైన తన అత్తమ్మ తాటికొండ రామమ్మ (50) పేరుపై పోస్టాఫీస్‌లో సంవత్సరానికి రూ.755 కట్టి రూ.15 లక్షల ఇన్సూరెన్సు, ఎస్‌బిఐ శాఖలో సంవత్సరానికి రూ.2,000 కట్టి నలభై లక్షల యాక్సిడెంట్ పాలసీ ఇన్సూరెన్స్‌తోపాటు రైతు బీమాకు సంబంధించి రూ.5,౦౦,౦౦౦ లక్షలు వస్తాయని చెప్పి కరుణాకర్ తండ్రి పేరు మీద ఉన్న 28 గుంటల భూమిని కూడా తన అత్తమ్మ పేరుపై చేయించాడు. ఏదైనా వాహనంతో తన అత్తమ్మను గుద్దిన సందర్భంలో ఆమె ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించిందని నమ్మించి ఇన్సూరెన్స్ డబ్బులు మొత్తం తీసుకుందామని ఒక పథకం ప్రకారం వేశాడు. ఇది తన ఒక్కడి వల్ల ఇది కాదని భావించి ఒకరోజు తాళ్ల కరుణాకర్ దగ్గరకి వెళ్లి ఈ విషయం చెప్పి,
తన అత్తమ్మని కారుతో గుద్ది చంపితే తనకు ఇవ్వవలసిన రూ.1,30,000 అవసరం లేదని, ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాక వాటిని సమానంగా పంచుకుందామని చెప్పగానే కరుణాకర్ ఒప్పుకున్నాడని తెలిపాడు. ఈనెల 7వ తేదీన 09:30 గంటలకు కరుణాకర్‌కు వాట్సాప్ కాల్ చేసి , తన అత్తమ్మను పెద్ధమాసన్ పల్లికి తీసుకొని వస్తానని, ఆమెను చంపడానికి వెహికల్ తీసుకొని తుక్కాపూర్‌కి రమ్మని చెప్పాడు. సిద్దిపేటలో కార్ ఓన్ డ్రైవింగ్ ఇచ్చేవారి దగ్గరకు వెళ్లి థార్ వెహికల్‌ను రోజుకు రూ.2,500 కిరాయి మాట్లాడుకొన్నాడు. దాని నెంబర్ కనిపించకుండా టిఆర్ నెంబర్ గల స్టిక్కర్ అతికించారు. తన భూమి వద్ద రోడ్డుపైన ద్విచక్ర వాహనాన్ని ఆపి, తన అత్తమ్మను దానిపై కూర్చుండబెట్టి తను పొలంలోకి వెళ్లాడు. వెంటనే కరుణాకర్ థార్ వెహికల్ నడుపుకుంటూ అక్కడ రోడ్డు మీద కూర్చున్న వృద్ధురాలిని గుద్ది అక్కడ నుంచి వేగంగా వెళ్ళిపోయాడు.
ఖమ్మంపల్లి రోడ్డు వద్ద కారు ఆపి వాట్సాప్ కాల్‌లో తాళ్ల వెంకటేష్‌కు ఫోన్ చేసి మీ అత్తమ్మను గుద్ది చంపినట్లు తెలిపాడు. అక్కడే కారు నెంబరు ప్లేట్‌కు అంటించిన టిఆర్ స్టిక్కర్ తీసి పారేసి సిద్దిపేటకు వెళ్లి తాను అద్దెకు తెచ్చిన వారికి కారు అప్పగించాడు. శనివారం సిఐ లతీఫ్ ఆధ్వర్యంలో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కీలకమైన ఈ కేసును గజ్వేల్ ఏసిపి నరసింహులు ఆధ్వర్యంలో ఛేదించిన తొగుట సిఐ లతీఫ్, ఎస్‌ఐ రవికాంత్ రావు, పోలీస్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించి రివార్డులు అందజేశారు.