నరేంద్ర మోడీ 2014లో ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో దక్షిణాసియా దేశాల అధినేతలను ఆహ్వానించడం ద్వారా తన విదేశాంగ విధానంలో దక్షిణాసియాకు ప్రధాన ప్రాధాన్యత ఇస్తున్న సంకేతాన్ని ఇచ్చారు. ఆ తర్వాత పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తల్లి జన్మదినానికి నాటకీయంగా హాజరవడం ద్వారా చెప్పుకోదగిన చొరవ చూపుతున్న సంకేతం ఇచ్చారు. అయితే ఆ తర్వాత గత పదేళ్లలో దాదాపు అన్ని దక్షిణాసియా దేశాలు భారత్‌కు దూరంగా జరుగుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. వ్యూహాత్మకంగా వాటితో చైనా సంబంధాలను మెరుగుపరుచుకోగలుగుతుంది. ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని గర్వంగా చెప్పుకుంటున్న భారత్ అంతర్జాతీయ రాజకీయ వేదికపై నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలని కోరుకుంటోంది.
‘భారతదేశం సాంకేతిక పరిజ్ఞానం( India technology powerhouse) వివిధ అంశాలలో ప్రపంచ నాయకుడిగా ఎదుగుతోంది. అది అంతరిక్షం, కృత్రిమ మేధస్సు, డిజిటల్ ఆవిష్కరణ, గ్రీన్ టెక్నాలజీ, మరిన్ని కావచ్చు’ అని ప్రధాని మోడీ గత నెలలో ఎక్స్‌లో పేర్కొన్నారు. అయితే అంతర్జాతీయంగా, దౌత్యపరంగా భారత్ ఎదుర్కొంటున్న సవాళ్ళను అటుంచితే పొరుగువారితో సంబంధాలు మాత్రం ఆందోళనకరంగా ఉన్నాయని మరచిపోలేము. ఆర్థిక అస్థిరత, రాజకీయ దుర్బలత్వం ఎదుర్కొంటున్న దక్షిణాసియా దేశాలను ప్రభావితం చేయగల స్థితిలో భారత్ ఉన్నప్పటికీ పరిణామాలు భిన్నంగా మారుతున్నాయి. తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుండి అఫ్ఘానిస్తాన్ జనాభాలో సగానికి పైగా దారిద్య్రరేఖకు దిగువకు పడిపోయారు.
సైనిక పాలనలో రాజకీయ అస్థిరతతో మయన్మార్ పోరాడుతోంది.పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ బెయిలౌట్‌ల కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధిని ఆశ్రయించాయి. మరోవంక, చైనా ఆర్థిక, వ్యూహాత్మక భాగస్వామ్యాలను పెంచుకోవడం ద్వారా దక్షిణాసియా అంతటా తన ప్రభావాన్ని విస్తరిస్తోంది. చైనా ప్రాబల్యం ఈ ప్రాంతంలో పెరగడానికి భారత్ నిర్లక్ష్యపూరిత విదేశాంగ విధానమే కొంతవరకు సహకరించినట్లు దౌత్యనిపుణులు భావిస్తున్నారు. ప్రాంతీయ సంఘీభావానికి మాటలలో ఆసక్తి కనబరుస్తూ వస్తున్నప్పటికీ, భారతదేశ విదేశాంగ విధానం ప్రధానంగా దక్షిణాసియా కంటే అమెరికా, ఐరోపా, తూర్పు ఐరోపా వైపు దృష్టి సారించిందని స్పష్టం చేస్తున్నారు. అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, భారతదేశం, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంకలతో కూడిన ప్రాంతీయ కూటమి అయిన దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం (సార్క్) భారత్ అనాసక్తి కారణంగానే మూతపడిన్నట్లు గుర్తు చేస్తున్నారు.సార్క్‌ను పునరుద్ధరించాలని అన్ని దేశాలు కోరుకొంటున్నా భారత్ నిరాసక్తత కారణంగానే ఇపుడు సాధ్యపడటం లేదు.
దానితో చైనా, పాకిస్తాన్ కలిసి దేనికి పోటీగా అంటారో ప్రాంతీయ కూటమి ఏర్పాటుకు ప్రయత్నించడం గమనార్హం. అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వాన్ని భారత్ అధికారికంగా ఇంకా గుర్తించకపోయినప్పటికీ పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆ దాడిని ఖండించిన ఏకైక దేశం ఈ ప్రాంతంలో అదే కావడం తెలిసిందే. అందుకు కృతజ్ఞతగా భారత్ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మొదటిసారిగా ఆ దేశం విదేశాంగ మంత్రికి ఫోన్ చేసి మాట్లాడారు. పాకిస్తాన్‌తో ఆ దేశం ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడగలవని భావిస్తున్న తరుణంలో చైనా, అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్ కలిసి ఉమ్మడి ప్రకటన చేశాయి. భారతదేశం తరచుగా ప్రాంతీయ సమస్యలపై ఏకపక్ష విధానాన్ని అవలంబిస్తూ ఉండడం కూడా ఏకాకిగా మిగలడానికి ఓ కారణం అని విదేశీ నిపుణులు చెబతున్నారు.
2014లో సార్క్ ఉపగ్రహ ప్రయోగాన్ని ఉటంకిస్తూ ప్రధాని మోడీ ‘ప్రాంతీయ సంప్రదింపులను దాటవేసారు’ అని విమర్శలు చెలరేగుతున్నాయి. భారత్ ‘ఏకపక్ష విధానాలు’ పాకిస్తాన్‌ను మరింత దూరంగా నెట్టివేయడంతోపాటు నేపాల్, శ్రీలంక వంటి దేశాలతో సైతం దూరం పెంచుతున్నాయనే అభిప్రాయం బలపడుతున్నది. వాటిని చైనా వైపు మొగ్గే విధంగా చేస్తున్నాయి. బంగ్లాదేశ్ విశ్వసనీయమైన మిత్రదేశం అయినప్పటికీ ఆ దేశంలో అధికారంలో ఉన్న షేక్ హసీనా, ఆమె పార్టీతో మినహా ఇతర రాజకీయ పార్టీలు, వర్గాలతో ఎటువంటి సంబంధాలు ఏర్పాటు చేసుకోకపోవడంతో అక్కడ రాజకీయ సంక్షోభం నెలకొన్న సమయంలో దాదాపు నిస్సహాయంగా మిగలాల్సి వచ్చింది. అంతటి రాజకీయ సంక్షోభం వైపు ఆ దేశం వెడుతుంటే మన నిఘా, దౌత్యవర్గాలు ప్రభుత్వానికి ఎటువంటి సంకేతం ఇవ్వలేకపోవడంతో దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం. వ్యూహాత్మకంగా తన ప్రపంచీకరణ అభిలాషలను చైనా ప్రాంతీయకరించడం, అందుకు విరుద్ధంగా భారత్ తన ప్రాంతీయ ప్రయోజనాలను ప్రపంచీకరణ కావించడం జరుగుతున్నది.
ప్రపంచ బ్యాంకు ప్రకారం, దక్షిణాసియా ఇప్పుడు ప్రపంచంలో ఆర్థికంగా అతి తక్కువ సమగ్ర ప్రాంతంగా, విస్తృతంగా పరిగణించబడుతున్నది. ఈ ప్రాంతంలో మొత్తం వాణిజ్యంలో అంతర్ -ప్రాంతీయ వాణిజ్యం కేవలం 5 శాతం మాత్రమే. దీనికి విరుద్ధంగా, అంతర్గత ఐరోపా యూనియన్ వాణిజ్యం దాదాపు 60 శాతం వద్ద ఉంది. అంతర్జాతీయ వ్యవహారాలలో దక్షిణాసియా ప్రాధాన్యత కుంచించుకు పోవడం నేరుగా భారత్ ప్రాబల్యంపై పడుతుంది. దక్షిణాసియాలో భారతదేశం వెలుపల 500 మిలియన్ల మంది ప్రజల బలమైన మార్కెట్ ఉందని మరచిపోతున్నాం. వస్త్రాలు, ఔషధాలు, ఇంధనం, సేవల రంగాలలో ఈ ప్రాంతానికి చెప్పుకోదగిన సామర్ధ్యం ఉంది. ఈ ప్రాంతంలో వాణిజ్యం ద్వారా విశేషంగా ప్రయోజనం పొందే అవకాశాలు ఉన్నప్పటికీ రాజకీయ అంశాలు అవరోధంగా మారుతున్నాయి.
భారతదేశం తన సరిహద్దుల వెంబడి సన్నిహిత సంబంధాలను పెంపొందించుకోవడం ఆర్థికంగా పరిపుష్టి అయ్యేందుకు మరింతగా దోహదపడుతుందని మరచిపోలేం. ‘భారతదేశం తన పొరుగు ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తే, అది చైనా వంటి ఇతరులను పొరుగు ప్రాంతంలోకి ప్రవేశించడానికి అనుమతిస్తుంది. అది భారతదేశ జాతీయ భద్రతను రాజీ చేస్తుంది’ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దౌత్యపరమైన వైరుధ్యాల తరువాత పాకిస్తాన్‌తో భారతదేశ వాణిజ్యం కుప్పకూలింది. స్థిరత్వాన్ని పెంపొందించే ఆర్థిక సంబంధాలను ఇరువైపులా కోల్పోయింది. బంగ్లాదేశ్ ఓడరేవులు, శ్రీలంక విమానాశ్రయాలు, పాకిస్తాన్ మోటార్ వేలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా చైనా ఇప్పటికే దక్షిణాసియాలో విశేషంగా ప్రయోజనాలు పొందుతున్నది. కారణాలు ఏవైనప్పటికీ పొరుగుదేశాల విశ్వాసం పొందే విధంగా భారత్ దౌత్యవిధానాలు ఉండటం లేదని విమర్శలు తరచూ చెలరేగుతున్నాయి.
‘దక్షిణాసియాలోని మిగిలిన ప్రాంతాలు లొంగిపోవాలని అది కోరుకుంటుంది’ అని శ్రీలంకకు చెందిన ఓ ఆర్థికవేత్త దారుణమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘భారతదేశం ప్రపంచ వేదికపై బాగా రాణించాలంటే, ఒకరిపై ఒకరు సార్వభౌమ సంబంధాన్ని అంగీకరించడం ద్వారా దాని పొరుగువారితో శాంతిని నెలకొల్పాలి’ అంటూ హితవు చెప్పారు. గతంలో, స్వల్పకాలిక భౌగోళిక, రాజకీయ ప్రయోజనాల కోసం భారతదేశం దీర్ఘకాలిక ప్రాంతీయ సహకారాన్ని త్యాగం చేసింది.ఇరాన్- పాకిస్తాన్- భారత్ గ్యాస్ పైప్‌లైన్‌ను ఉదాహరణగా పేర్కొనవచ్చు. అమెరికా ఒత్తిడి కారణంగా మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హయాంలో దీనిని రద్దు చేశారు. ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చి ఉంటే గ్యాస్ ప్రవహిస్తూ ఆర్థికంగా ప్రయోజనం పొందటమే కాకుండా దౌత్య సంబంధాలతోపాటు ఈ ప్రాంతంలో శాంతి నెలకొనేందుకు కొంతమేరకు దోహదపడేదని పరిశీలకులు భావిస్తున్నారు.
భారతదేశం దృష్టి దక్షిణాసియాకు అవతలి వైపు ఇండో- పసిఫిక్ వైపు మళ్లింది. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారతదేశంతో కూడిన క్వాడ్ కూటమిలో చేరడం ద్వారా పశ్చిమ దేశాలతో స్నేహంకోసం ప్రాధాన్యత ఇచ్చాం. అయితే, భారతదేశం స్థిరంగా ఉండాలంటే, దాని సరిహద్దులు స్థిరంగా ఉండాలి. క్వాడ్ పరోక్షంగా చైనా వ్యతిరేక సైనిక కూటమిగా మారడంతో చైనాతో సంబంధాలలో ప్రతిష్టంభనకు, ముఖ్యంగా గాల్వన్ లోయలో ఘర్షణలకు దారితీసింది. రాజీవ్ గాంధీ చైనాతో సరిహద్దు ఒప్పందం చేసుకున్న తర్వాత సరిహద్దుల్లో కాల్పులు జరగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.మరోవంక, తూర్పు ఆసియా దేశాలతో భారత్ సంబంధాల కారణంగానే బంగ్లాదేశ్, మయాన్మార్‌లలో అస్థిర రాజకీయ పరిస్థితులలో భారత్‌పట్ల అనుమానంగా చూస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
ఐరాస భద్రత మండలిలో వీటో అధికారం పొందడంతోపాటు భారత్ వ్యక్తం చేస్తున్న అంతర్జాతీయ ఆకాంక్షలతో ప్రాంతీయంగా కొంత ప్రాబల్యాన్ని కోల్పోతున్నామా? అనే అనుమానం ఈ సందర్భంగా కలుగుతుంది. అంతర్జాతీయంగా, రాజకీయంగా నాయకత్వం లభించాలి అన్నప్పటికీ ప్రాంతీయంగా విశ్వసనీయత పెంపొందించుకోవడం అవసరం కాగలదు. ప్రాంతీయంగా గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో అంతర్జాతీయంగా ఆశించిన విధంగా గుర్తింపు, ప్రాధాన్యత పొందలేమని గ్రహించాలి. పొరుగు దేశాల సహకారం లేకుండానే బలమైన ఆర్థిక శక్తిగా ఎదగగలిగిన సామర్థ్యం భారత్‌కు ఉన్నప్పటికీ పొరుగువారితో సయోధ్య పెంపొందించుకోవడం ద్వారా మరింత బలమైన ఆర్థిక, రాజకీయ శక్తిగా గుర్తింపు పొందగలమని గుర్తించాలి.
- చలసాని నరేంద్ర
98495 69050