మరో నాలుగైదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు(మాన్సూన్) కేరళను తాకనున్నాయి. సాధారణంగా జూన్ 1 కు వచ్చే రుతుపవనాలు ఈసారి కాస్త ముందుగానే వచ్చేస్తున్నాయని భారత వాతావరణ శాఖ(ఐఎండి) మంగళవారం తెలిపింది. వాతావరణ శాఖ ఇదివరలో రుతుపవనాలు మే 27కల్లా రాగలవంది. ఒకవేళ అనుకున్నట్లుగా రుతుపవనాలు వస్తే ఇదివరలో 2009లో వచ్చినట్లుగా ముందే వచ్చేసినట్లే. అప్పట్లో మే 23నే రుతుపవనాలు వచ్చేసాయని ఐఎండి మంగళవారం మధ్యాహ్నం తెలిపింది. ‘నాలుగైదు రోజుల్లో కేరళకు రుతుపవనాలు వచ్చే పరిస్థితులయితే చాలా అనుకూలంగా ఉన్నాయి’ అని ఐఎండి స్పష్టం చేసింది. సాధారణ పరిస్థితుల్లో నైరుతి రుతుపవనాలు జూన్ 1 కల్లా కేరళను తాకి, జులై 8కల్లా యావత్ దేశానికి విస్తరిస్తుంటుంది.
ఆ తర్వాత సెప్టెంబర్ 17కల్లా తగ్గు ముఖం పడుతుంటుంది. అక్టోబర్ 15కల్లా పూర్తిగా విరమిస్తుంది. గత ఏడాది మే 30 కల్లా మన్సూన్ దక్షిణ భారతాన్ని తాకింది. ఇక 2023లో జూన్ 8న, 2022లో మే 29న, 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న, 2019లో జూన్ 8న, 2018లో మే 29న తాకింది. ఈ ఏడాది వర్షం తక్కువ పడేందుకు కారణమయ్యే ఎల్‌నినో పరిస్థితులకు తావే లేదని కూడా వాతావరణ శాఖ స్పష్టం చేసింది. 2025లో సాధారణం కంటే ఎక్కువే వర్షాలు పడొచ్చని తెలిపింది. మన వ్యవసాయ రంగానికి రుతుపవనాలు చాలా అవసరం. దేశంలో 42.3 శాతం జనం వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. దేశపు జిడిపిలో వ్యవసాయమే 18.2 శాతం వాటా కలిగి ఉంది. త్రాగు నీరు, విద్యుత్తు ఉత్పత్తికి కూడా వర్షమే ముఖ్యం.