ఈసారి దేశం లోకి నైరుతి రుతుపవనాలు అంచనాల కంటే ముందే ప్రవేశించనున్నాయి. సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు కేరళ లోకి ప్రవేశించడం ద్వారా దేశమంతటా వర్షాలు మొదలవుతాయి. జులై 8 నాటికి ఇవి దేశమంతా విస్తరిస్తాయి. మళ్లీ వాయవ్య భారతం నుంచి సెప్టెంబరు 17తో రుతుపవనాల ఉపసంహరణ మొదలై అక్టోబర్ 15 నాటికి ముగుస్తుంది. ప్రస్తుతం ఇవి జూన్ 1 కంటే ముందుగా మే 27న కేరళను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ శనివారం ప్రకటించింది. గత ఏడాది మే 30న నైరుతి పవనాలు రాగా, 2023 జూన్ 8న, 2022 మే 29న దేశం లోకి ప్రవేశించాయి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈసారి నాలుగు నెలల్లో
వర్షపాతం సాధారణం కన్నా ఎక్కువగానే ఉంటుందని ఎర్త్‌సైన్సెస్ శాఖ కార్యదర్శి ఎం. రవిచంద్రన్ తెలిపారు. భారత ఉపఖండంలో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే ఎల్‌నినో పరిస్థితుల అవకాశాన్ని సైతం వాతావరణ శాఖ తోసిపుచ్చింది. మన దేశంలో 52 శాతం నికర సాగు భూమికి ఇప్పటికీ వర్షపాతమే ప్రధాన ఆధారం. దేశం మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో ఈ సాగు భూమి నుంచి ఏకంగా 40 శాతం దిగుబడి వస్తుంది. అందుకే భారత ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో నైరుతి రుతు పవనాలు కీలక పాత్ర పోషిస్తాయి. దేశ వ్యాప్తంగా తాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి కీలకమైన జలాశయాలను తిరిగి నింపడానికి దేశ జీడీపికి 18.2 శాతం తోడ్పాటుకు ఇది ఎంతో ముఖ్యం.