రాష్ట్ర ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లటి కబురు తెలియజేసింది. మరో రెండు రోజుల్లో కేరళను నైరుతి రుతుపవనాలు తాకనున్నాయని ఐఎండి తెలిపింది. ఈ నేపథ్యంలో ఐఎండి కీలక హెచ్చరికలు జారీ చేసింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయు గుండంగా బలపడే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరిస్తొంది. ఈ వాయుగుండంతో తీరం వెంబడి విస్తృత వర్షపాతానికి దారితీసే అవకాశం ఉందని, అరేబియా సముద్రంలోనే కాకుండా ఈనెల 27వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తొంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతూ శుక్రవారం సాయంత్రానికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు
అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం నేపథ్యంలో రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, కోమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్, నల్గొండ,
సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లతో ఈదురు గాలులు, మెరుపులు, ఉరుములతో ఈ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.