బెంగళూరు: అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న జెడిఎస్ ఎంపి ప్రజ్వల్ రేవణ్ణను (Prajwal Revanna) శుక్రవారం బెంగళూరు ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం దోషిగా తేల్చేసింది. శనివారం ఆయనకు శిక్షను ఖరారు చేయనుంది. పని మనిషిపై లైంగిక దాడి చేసిన కేసులో కోర్టు ప్రజ్వల్‌కు శిక్ష పడనుంది. 2021లో కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో హాసన్‌లోని గన్నికాడ ఫామ్‌హౌజ్‌లో తనపై ప్రజ్వల్ అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాక ఆ ఘటనను ప్రజ్వల్ తన మొబైల్‌లో చిత్రీకరించాడని ఆరోపించింది.
ప్రజ్వల్ (Prajwal Revanna) తల్లిదండ్రులు తనను అపహరించి బెదిరించారని కూడా ఆమె పేర్కొంది. ఈ కేసులో ముమ్మరంగా దర్యాప్తు చేపట్టిన సిట్.. ఫోరెన్సిక్ నివేదికలు లీకైన వీడియోలను ధృవీకరించడంతో గత ఏడాది మే 31న జర్మనీ నుంచి స్వదేశానికి వచ్చిన ప్రజ్వల్‌ను అరెస్ట్ చేసింది. గత 14 నెలలుగా ప్రజ్వల్ జ్యుడీషియల్ రిమాండ్‌లోనే ఉన్నారు. ప్రజ్వల్ మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, మాజీ మంత్రి హెడి రేవణ్ణ కుమారుడు.