Thursday, September 18, 2025

జమ్మూ కాశ్మీర్‌కు అతి త్వరలో రాష్ట్ర హోదా పునరుద్ధరణ

- Advertisement -
- Advertisement -
  • సిఎం ఒమర్ అబ్దుల్లా ఆశాభావం
  • అందుకు సమయం ఆసన్నమైంది

శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర ప్రతిపత్తి పునరుద్ధరణ అతి త్వరలో జరుగుతుందని తాను ఆశిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మంగళవారం తెలియజేశారు. పుల్వామా జిల్లాలో ఒక వంతెనను ప్రారంభించిన అనంతరం ఒమర్ అబ్దుల్లా విలేకరులతో మాట్లాడారు. ‘తగిన సమయం ఆసన్నమైందని భావిస్తున్నాం, అసెంబ్లీ ఎన్నికల దరిమిలా ఆరు మాసాలు గడిచాయి. (కేంద్ర హోమ్ శాఖ మంత్రి) అమిత్ షా ఇక్కడికి వచ్చారు, ఆయనతో నేను విడిగా భేటీ అయ్యాను, సంతృప్తికరంగా సాగింది& జెకెకు త్వరలో రాష్ట్ర హోదా లభిస్తుందని ఇప్పటికీ ఆశిస్తున్నాను’ అని ఒమర్ చెప్పారు. వక్ఫ్ సవరణ చట్టంపై చర్చను అధికార పార్టీ అడ్డుకుందన్న ప్రతిపక్షాల ఆరోపణపై సిఎం స్పందిస్తూ, బిల్లును పార్లమెంట్ ఆమోదించినందున వాయిదా తీర్మానాన్ని అనుమతించజాలమని స్పష్టం చేశారు. ‘చివరి రోజు స్పీకర్ సర్వ స్పష్టం చేశారు. సభ్యులు వాయిదా తీర్మానాన్నిన తీసుకురావడం బహుశా పొరపాటు అయి ఉంటుంది. జెకె ప్రభుత్వ పనులపై చర్చకు మాత్రమే వాయిదా తీర్మానాన్ని తీసుకురావాలి, ప్రభుత్వం స్పందించవలసి ఉంటుంది. వక్ఫ్ బిల్లును మేము తీసుకురానందున ఆ వాయిదా తీర్మానాన్ని ఆమోదించి ఉంటే మేము ఎలా స్పందించి ఉండేవారం చెప్పండి. దానిని కేంద్రం పార్లమెంట్‌లో ఆమోదించింది’ అని ఒమర్ పేర్కొన్నారు. అసెంబ్లీలో వేరే నిబంధనల కింద ఒక తీర్మానాన్ని అనుమతించి ఉండవచ్చు. అయితే, అది ఇప్పటికే ఆమోదముద్ర పొందింది. నేషనల్ కాన్ఫరెన్స్ సహా అనేక పార్టీలు సుప్రీం కోర్టును ఆశ్రయించి, కోర్టుకు తమ అభిప్రాయాలు నివేదించాయి. ఇప్పుడు ఎస్‌సి ఏమి చెబుతుందో చూస్తాం’ అని ఆయన తెలిపారు. వంతెన ప్రారంభంపై ఒమర్ వ్యాఖ్యానిస్తూ, 2014 వరదలకు కొట్టుకుపోయిన 11 ఏళ్ల తరువాత దక్షిణ కాశ్మీర్‌లో చరార్ ఎ షరీఫ్‌ను అనుసంధానించే వంతెనను తిరిగి నిర్మించవలసిరావడం దురదృష్టకరమని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News