కనపడని వేసవి శిక్షణ శిబిరాలు, వెలవెలబోతున్న క్రీడా మైదానాలు
విద్యార్థులలో ఆందోళన
మన తెలంగాణ/ఉప్పల్: గ్రేటర్ హైదరాబాద్ లో ఏటా నెల రోజులపాటు నిర్వహించే క్రీడా శిక్షణ శిబిరాలు ఇప్పటివరకు కనిపించడం లేదు. శిక్షణ శిబిరాలు లేక పేద, మధ్యతరగతికి చెందిన విద్యార్థులు ఆటలకు నోచుకోవడం లేదు. విద్యార్థులలో క్రీడా స్ఫూర్తిని నింపేందుకు జిహెచ్‌ఎంసి స్పోరట్స్ విభాగం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జోనల్ స్థాయిలో వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తోంది.
మే 1 నుంచి 30 వరకు శిక్షణ శిబిరాలు నిర్వహించి క్రీడలను ప్రోత్సహిస్తుంది. ఆయా క్రీడలలో శిక్షణ పొందిన విద్యార్థులకు స్పోరట్స్ కిట్లు, సర్టిఫికెట్లను పంపిణీ చేసి చైతన్యవంతుల్ని చేస్తోంది. అయితే ఈ సంవత్సరం ఇప్పటివరకు శిక్షణ శిబిరాలను ప్రారంభించలేదు. ఇంతకీ నిర్వహిస్తారో లేదో అన్న అనుమానం అందరిలో వ్యక్తమవుతుంది. కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఖో ఖో వంటి ఎన్నో రకాల క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ విద్యార్థుల్లో నూతన ఉత్తేజాన్ని నింపడం ఆనవాయితీ. ప్రస్తుతం మే నెల మొదటివారం గడిచినా ఇప్పటివరకు శిక్షణ శిబిరాలను నిర్వహించకపోవడంతో పేద విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పేద విద్యార్థుల పట్ల ఇంత నిర్లక్ష్యమా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవి శిక్షణ శిబిరాలు లేక ప్రభుత్వ క్రీడా మైదానాలు వెలవెలబోతున్నాయి. బయట ప్రైవేట్ విద్యాసంస్థల క్రీడా మైదానాలలో నిర్వహించే వేసవి క్రీడా శిక్షణలో అధిక ఫీజు చెల్లించలేక క్రీడలకు తమ పిల్లలు దూరం అవుతున్నారని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి క్రీడలకు ప్రత్యేక నిధులు వెచ్చించి వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.