Wednesday, August 20, 2025

నిజామాబాద్‌లో గూఢచారి పావురం కలకలం

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ జిల్లాలో గూఢచారి పావురం కలకలం సృష్టించింది. జిల్లాలోని బోధన్ మండలం భవానిపేట గ్రామంలో ఒక మైనర్ బాలుడు ఈ అనుమానాస్పద పావురాన్ని కనుగొన్నాడు. పావురం కాలికి ఒక కోడ్ రింగ్, రెక్కలపై కోడ్ లెటర్స్ ఉన్నాయి, ఇవి సాధారణ పావురాలకు భిన్నంగా ఉండటంతో గ్రామస్తులకు అనుమానం కలిగింది. పావురం గూఢచారి కార్యకలాపాలకు సంబంధించినది కావచ్చని అనుమానించిన గ్రామస్తులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. బోధన్ పోలీసులు పావురాన్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. పావురంపై ఉన్న కోడ్ రింగ్ , లెటర్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పావురం రెక్కలపై కోడ్ లెటర్స్, కాలికి ఉన్న రింగ్ గూఢచర్యానికి సంబంధించినవి కావచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఇలాంటి పావురాలను గతంలో కొన్ని దేశాలు గూఢచార సమాచార సేకరణకు ఉపయోగించిన సందర్భాలున్నాయి. పోలీసులు పావురంపై ఉన్న కోడ్ లెటర్స్ ఏ భాషకు సంబంధించినవో, అవి ఏదైనా సందేశాన్ని కలిగి ఉన్నాయా? అనే విషయాలను పరిశీలిస్తున్నారు.

ఈ కోడ్ రింగ్ ఒక ట్రాకింగ్ డివైస్ లేదా గుర్తింపు ట్యాగ్ కావచ్చని కూడా భావిస్తున్నారు. పావురం ఎక్కడ నుండి వచ్చింది, దాని ఉద్దేశం ఏమిటి అనే విషయాలను తెలుసుకోవడానికి పోలీసులు విచారణ చేస్తున్నారు. అలాగే, ఈ పావురం స్థానికంగా ఉన్న ఏదైనా పక్షి సంరక్షణ కేంద్రం లేదా పరిశోధన సంస్థకు సంబంధించినదా? అని కూడా ఆరా తీస్తున్నారు. పావురంపై ఉన్న కోడ్‌లను డీకోడ్ చేయడానికి లేదా దాని మూలాన్ని గుర్తించడానికి సైబర్ నిపుణులు లేదా గూఢచర్య నిపుణుల సహాయం తీసుకునే అవకాశం ఉంది. గతంలో భారతదేశంలో ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలలో ఇలాంటి అనుమానాస్పద పావురాలు కనిపించిన సందర్భాలున్నాయి. ఉదాహరణకు 2020లో పంజాబ్‌లో ఒక పావురం పాకిస్తాన్ నుండి గూఢచారిగా అనుమానించి అదుపులోకి తీసుకున్నారు. కానీ తర్వాత అది సాధారణ పావురమని తేలింది. అయితే ఇది పందేపు పావురం కూడా కావొచ్చని భావిస్తున్నారు. తమిళనాడు లో పావురాల పందేలు చాలా ప్రసిద్ధి. వీటిపై చాలా సినిమాలు కూడా వచ్చాయి. ప్రొఫెషనల్ గా పావురాలను పెంచి పందేల కోసం శిక్షణ ఇస్తూంటారు.

వారు తమ పావురాల గమన్నాన్ని గుర్తించడానికి డివైస్‌లు కూడా వాడుతున్నారు. బహుశా ఆ పావురమే బోధనలో చిక్కి ఉంటుందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. పోలీసులు ఈ దిశగా కూడా దర్యాప్తు చేసే అవకాశం ఉంది. బోధన్‌లోని భవానిపేటలో కనుగొన్న ఈ పావురం స్థానికంగా గూఢచారి అనుమానాలను రేకెత్తించినప్పటికీ, దీని నిజమైన ఉద్దేశం గురించి ఇంకా స్పష్టత లేదు. పోలీసుల దర్యాప్తు ఈ సంఘటన వెనుక ఉన్న వాస్తవాలను వెలికితీసే అవకాశం ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News