Thursday, May 8, 2025

తిరుమ‌ల‌లో వైభ‌వంగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

భూలోక వైకుంఠాన్ని తల పించిన ” దశావతార – అష్టలక్ష్మి మండపం”

తిరుమల: తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో వివిధ సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో అలంకరించిన ” దశావతార – అష్టలక్ష్మి ” మండపంలో మంగళవారం సాయంత్రం శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. మే 8వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి.

ఒక టన్ను పండ్లు, 2 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 30 వేల కట్ ఫ్లవర్స్ తో 150 మంది గార్డెన్ సిబ్బంది, 50 మంది ఎలక్ట్రిక్ సిబ్బంది కలిసి మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.

మొదటిరోజు వైశిష్ట్యం :

శ్రీ పద్మావతి పరిణయోత్సవాల్లో మొదటిరోజు అంటే వైశాఖశుద్ధ నవమిరోజైన మంగళవారంనాడు శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనాన్ని అధిరోహించగా ఉభయనాంచారులు పల్లకిపై పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు.

వివిధ హంగులతో శోభిల్లుతున్న ఈ పెండ్లిమండపంలో నిత్య నూతన వధూవరులైన శ్రీ స్వామివారికి, అమ్మవార్లకు ఎదుర్కోలు, మాల పరివర్తనం, పూలబంతులాట, నూతన వస్త్ర సమర్పణ కోలాహలంగా జరిగాయి. ఆ తరువాత శ్రీ స్వామివారికి కొలువు (ఆస్థానం) జరిగింది.

ఈ క్రతువుల అనంతరం చతుర్వేద పారాయణం, మలహారి, దేశిక, సౌరాష్ట్ర, వారహి, కదన కుతూహల, నీలంబారి వంటి వివిధ రాగ- తాళ-వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.

పిదప ఆర్జిత భక్తులకు వస్త్ర బహుమానం, ప్రసాద వితరణ జరిగింది. ఆ తరువాత శ్రీదేవి భూదేవి సహితుడైన స్వామి అశేష భక్తజనం మధ్య ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేయడంతో తొలిరోజు వివాహ వేడుక ఘనంగా ముగిసింది.

ఈ కార్యక్రమంలో టిటిడి చైర్మన్ బీ.ఆర్.నాయుడు, బోర్డు సభ్యులు పనబాక లక్ష్మీ, అదనపు ఇఒ సి.హెచ్.వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఇఒ లోకనాథం, పేష్కార్ రామకృష్ణ, ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భక్తులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News