Tuesday, June 17, 2025

ప్రజలు సొంతం చేసుకున్న వాడే మహాకవి

- Advertisement -
- Advertisement -

ఎవరి గురించి ఎంతెంత రాసినా ఇంకా రాయవలసిందేదో మిగిలి ఉంటుందో, ఏ కవి రాతలు ప్రతినిత్యం సజీవంగా జాతి గుండెలలో ప్రతిధ్వనిస్తూ ఉంటాయో, ఆ కవి చిరంజీవి. అతను ఆ జాతి కవి. అతడిని కొందరు మహాకవి అని పొగిడారు. ఇంకొందరు ప్రజాకవి అని పిలిచారు, మరి కొందరు విప్లవ కవి అని ప్రశంసించారు, వేరొక కొందరు రేపటికవి అంటున్నారు. మరేదో సరికొత్తగా ప్రకటించడానికి ఇంకా ఆస్కారం ఉన్నవాడు, పాఠకుడు ఎదిగే కొద్దీ మరింత అర్థమయ్యే కవిత్వమైనవాడు, లోకం బాధ తన కావ్య బాధగా మార్చిన వాడు కనుకనే అతని కవితా వాక్యాలు తెలుగు వారి నోట నినాదాలుగా నానుడులుగా‘నిలిచాయి. ఈపాటికే మనందరి ఊహల్లో కదిలే అతడే.. అతడే శ్రీశ్రీ.
అతడిని కవిత్వ రహస్యం తెలిసిన కాళిదాసు, పెద్దన్న, కృష్ణశాస్త్రిల సరసన కూర్చోపెట్టాడు దేవరకొండ బాలగంగాధర తిలక్. 55ఏళ్ల క్రితం రాసిన ఈ కింది శ్రీశ్రీ వాక్యాలు ఎంత సజీవంగా ఉన్నాయో చూడండి.
“పాతను బతికించడానికి
కొత్త చిట్కాలు వెతుకుతున్నారు
కొత్తను హతమార్చడానికి
పాత కత్తులు నూరుతున్నారు” (1970).
ఈనాడు మన చుట్టూ ఆవరించుకుని ఉన్న సాంస్కృతిక వాతావరణాన్ని ఇది ప్రతిబింబించడం లేదూ! 90ఏళ్ల క్రితం శ్రీశ్రీ రాసిన ‘అవతారం’ అనే కవితను ఈ నాటికి అన్వయించుకుంటే,
బాధాసర్పదష్టులైన పీడితులు
అణగారినవర్గాలు, తాము పుట్టి పెరిగిన ప్రదేశాల నుండి గెంటివేయబడుతున్నవారు, తమపై స్వారీ చేసే శక్తులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారని పై కవితలో ఆయన అనేక పురాణ ప్రతీకల ద్వారా రుజుపరిచారు. అందులోని చివరి పంక్తులు చూడండి:
“ఆదిసూకర వేద వేద్యుడు’
ఘుర్ఘురిస్తూ, కోర సాచాడు”
శ్రీమహావిష్ణువు అవతారాలలో మనం చెప్పుకునే వరాహవతారం భూమి మొత్తాన్ని కబళిoచాలని చూసిన హిరణ్యాక్షునిపై ‘ఆది సూకర వేద వేద్యుడై‘పై విధంగా కోరసాచి అంతం చేశాడని మనకి పురాణ గాధ చెబుతుంది. ఇరాక్ మీద అమెరికా వాడు దాడి చేయగానే (2003) హైదరాబాదు ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ఒక సభలో దాశరధి రంగాచార్య మాట్లాడుతూ ‘వాడు హిరణ్యాక్షుడు.
ప్రపంచాన్నంతా చుట్టబెట్టి తన చంకలో పెట్టుకోవాలనుకుంటున్నాడు’ అని అమెరికాను తీవ్రం గా విమర్శించారు. వెంటనే చాలామందికి శ్రీశ్రీ కవితా పంక్తులు జ్ఞాపకం వస్తాయి. అలా శ్రీశ్రీ ప్రాసంగికత అనేకానేక సందర్భాల్లో వస్తూ ఉంటుంది.
ఆయన రాసిన కొన్ని కవితల ముక్తాయింపు వాక్యాలు గొప్ప అర్థవంతంగా ఉండేవి చెప్పుకోదగినన్ని ఉన్నాయి. పై వాక్యం అయిన వెంటనే ముగింపుగా..
“పుడమి తల్లికి పురిటి నొప్పులు కొత్త జగతిని స్ఫురిపించాయి” అంటాడు. అంటే ఇలాంటి తిరుగుబాట్లు ద్వారానే పాతకాలపు ఆధిపత్య వ్యవస్థ పోయి ప్రజానుకూలమైన కొత్త ప్రపంచం రూపొందుతుంది అని కవి భావం.
శ్రీశ్రీ చెప్పిన ‘కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బుబిళ్ళ.. కావేవీ కవితకనర్హం.’ అనేది చాలామందికి తెలిసిన ‘ఋక్కులు’ అనే కవితలోనివి.
ఈ కవిత కొసమెరుపు ఇలా ఉంటుంది.
“ప్రపంచమొక పద్మవ్యూహం
కవిత్వమొక తీరని దాహం”
ఈ రెండు వేరువేరు వాక్యాలుగా ఉన్నట్లు కనిపించినా కవులు ఎక్కువ ఆసక్తి చూపించే తీరని దాహం అనేది పద్మవ్యూహాన్ని ఛేదించడం ద్వారానే అది తీరగలదు అని శ్రీశ్రీ భావం.
మరి పద్మవ్యూహం అంటే ఏమిటి? అర్థం అయినట్లే ఉండి, స్పష్టం కాని, అనేకానేక రూపాలలో వ్యక్తం అయే జీవన సంఘర్షణ వెనుక ఉండే వైరుధ్యాలే ఆధునిక పద్మవ్యూహం. జీవన సంఘర్షణ, వైరుధ్యాలు లేని కాలమే ఉండదు. ఒకదాని తర్వాత ఒకటి పరిష్కరించుకుంటూ వెళ్ళినకొద్దీ మళ్లీ కొత్తవి పుడుతూ ఉంటాయి. తిరిగి తిరిగి ఆ కొత్త వైరుధ్యాలను పరిష్కరించడానికి సంసిద్ధపడవలసిందే. ఒకసారి దాహం తీరిన తరువాత ‘అమ్మా దాహం తీరింది.’ అనుకుని ఊరుకోలేం కదా. మళ్ళీ కొద్ది గంటలకు దాహం పుడుతుంది. మళ్లీ మళ్లీ దాహం తీర్చుకోవాల్సిందే. అలాగే కవులు తమ ప్రతిభ తో నిరంతరాయంగా సామాజిక వైరుధ్యాలను పరిష్కరించే కవిత్వాలు రాసుకుంటూ కొనసాగుతూ ఉండవలసిందే.
కవిత్వ దాహమంతా పద్మవ్యూహం లాంటి ప్రపం చ వైరుధ్యాల చిక్కు ముడులను అర్థం చేయించడానికీ పరిష్కరించడానికేననీ, కవిత్వంలో ఉండే రసాత్మకత దీనికి లోబడినదేనని శ్రీశ్రీ అభిప్రాయంగా మనం చెప్పుకోవచ్చు. శ్రీశ్రీ కవిత్వం గురించి గుడిపాటి వెంకటచలం చెప్పిన కొన్ని మాటలతో దీన్ని ముగిస్తాను. ‘శ్రీశ్రీ పుస్తకం కొని తీరికగా చదవండి. పద్యం పదిసార్లు చదవండి. ఏమీ అర్థం కాలేదా ఏ యువకుడుకో, బిక్షకుడికో Death bed Presentationగా పంపండి. పారేయకండి. అంతకన్నా దాచుకోకండి. తెలుగు కవిత్వాన్ని ఖండించి, దీవించి, ఊగించి, శాసించి, ర క్షించే శక్తి మీ చేతుల్లో పుస్తకం Pass it on.’
(జూన్ 15 శ్రీశ్రీ 42వ వర్ధంతి)
దివి కుమార్

శ్రీశ్రీ పుస్తకం కొని తీరికగా చదవండి. పద్యం పదిసార్లు చదవండి. ఏమీ అర్థం కాలేదా ఏ యువకుడుకో, బిక్షకుడికో Death bed Presentation గా పంపండి. పారేయకండి. అంతకన్నా దాచుకోకండి. తెలుగు కవిత్వాన్ని ఖండించి, దీవించి, ఊగించి, శాసించి, రక్షించే అపూర్వ శక్తి మీ చేతుల్లో పుస్తకం Pass it on.
– చలం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News