Wednesday, May 21, 2025

అమ్మాయిల తగ్గుదలతో అనర్థాలెన్నో!

- Advertisement -
- Advertisement -

బాలల శ్రేయస్సు, ఆరోగ్యం, విద్యపైనే రేపటి దేశ ఆర్థిక వ్యవస్థ, సమాజ పురోభివృద్ధి ఆధారపడి ఉంటుంది. సమాజంలో బాలబాలికలపట్ల సమ భావన ఉండాల్సిందిపోయి బాలురపట్ల ప్రాధాన్యత, బాలికలపట్ల చిన్నచూపు కొనసాగుతోంది. కొన్నేళ్ల క్రితం కుటుంబాలలో బాలుర కంటే మిన్నగా బాలికలను చూసుకునేవారు. బాలికల పట్ల ప్రత్యేకమైన ప్రేమ, అభిమానం, ఆప్యాయతను, అనురాగాన్ని తల్లిదండ్రులు కనబరిచేవారు. సమాజంలో మారిన పరిస్థితులతో బాలికల పెంపకం, చదువు, పోషణ, వివాహం మొదలైనవి ఖర్చుతో కూడుకున్నవనే భావన నాటుకుపోవడంతో ఆడపిల్ల జననాన్ని తల్లిదండ్రులు భారంగా పరిగణిస్తున్నారు. అమ్మాయిల పట్ల కొనసాగుతున్న తీవ్రమైన వివక్ష వారి పుట్టుకకే సవాల్ విసురుతున్నది. రోజువారీ జీవితంలో ఆడపిల్లలపై జరుగుతున్న వేధింపులు, హింస, కిడ్నాప్‌లు, అత్యాచారాలు మొదలగునవి వారి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని జనగణన విభాగం ఇటీవల విడుదల చేసిన శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టం (ఎస్‌ఆర్‌ఎస్) 2021 నివేదికలో బాలల లింగ నిష్పత్తి వివరాలు నివ్వెరపరుస్తున్నాయి.

దేశంలో, రాష్ట్రంలో బాలల లింగ నిష్పత్తిలో పెరుగుతున్న వ్యత్యాసం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో 2021లో జననాల సంఖ్య 2.42 కోట్లుగా ఉంది. జననాల్లో బాలురు 52.2%, బాలికలు 47.8 శాతంగా నమోదు కావడం జరిగింది. దీని ప్రకారం ప్రతి 1000 మంది బాలురకు 916 మంది బాలికలు మాత్రమే ఉన్నారు. ఎస్‌ఆర్‌ఎస్ నివేదిక ప్రకారం తెలంగాణలో 2021లో 3,18,300 మంది మగ పిల్లలు, 2,93,400 మంది ఆడపిల్లలు పుట్టారు. ప్రతి 1000 మంది మగ పిల్లలకు 922 మంది ఆడపిల్లలు మాత్రమే పుట్టినట్లు లెక్కలు చెబుతున్నాయి. 2001 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో బాలల లింగ నిష్పత్తి (0 -6 సంవత్సరాలు) 927 ఉండగా, 2011 జనాభా లెక్కల నాటికి 919కి తగ్గింది. 2001 జనాభా లెక్కలలో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బాలల లింగ నిష్పత్తి 961 ఉండగా, 2011 నాటికి 939కి తగ్గింది. గడిచిన రెండున్నర దశాబ్దాలుగా నాటి 2001 జనాభా లెక్కల నుంచి నేటి ఎస్‌ఆర్‌ఎస్ లెక్కలు తేల్చిన వివరాల ప్రకారం దేశంలో, రాష్ట్రంలో బాలల లింగ నిష్పత్తి క్రమేణా క్షీణించటం ఆందోళన కలిగిస్తోంది.

పితృస్వామ్య భావజాలం సమాజంలో ఆవరించడంతో బాలికలు అంటే చిన్నచూపు వారి పుట్టుకకు, ఎదుగుదలకు, అభివృద్ధికి ఆటంకంగా తయారవుతున్నది. ఇంటిలో, సమాజంలో ఆడపిల్లలు ఆహారం, విద్య, వైద్యం, పని విభజన, స్వేచ్ఛ మొదలగు అన్ని విషయాల్లోనూ తీవ్ర వివక్షకు గురవుతున్నారు. ఏనాటికైనా కట్న కానుకలు సమర్పించి ఆడపిల్లను పరాయి ఇంటికి పంపించి వేయాల్సిందేనన్న భావన సమాజంలో పాతుకునిపోవడంతో వారు తీవ్ర అసమానతలకు, అవమానాలకు గురవుతున్నారు. సంతానంలో ఒకరు లేదా ఇద్దరు చాలు అనే భావన సమాజంలో నెలకొనడంతో పుత్ర సంతానపై కోరిక పెరగడమే కాక కూతురు వద్దనే భావన బలపడుతోంది. దీనివల్ల భవిష్యత్తు కాలంలో అమ్మాయిల సంఖ్య ఇంకా తగ్గిపోయి కుటుంబ వ్యవస్థకు విఘాతం కలిగి సమాజంలో అసాంఘిక కార్యకలాపాలు చెలరేగటానికి ఆస్కారం ఉంది. తగ్గిపోతున్న ఆడపిల్లల సంఖ్య సామాజిక, ఆర్థిక, ఆరోగ్య అంశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. అత్యాచారాలు, లైంగిక నేరాలు, అమ్మాయిల అమ్మకం, కిడ్నాపుల వంటి సమస్యలు పెరిగిపోతాయి. బాల్య వివాహాలు ఎక్కువై ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అమ్మాయిలు దొరకక పురుషుల వివాహాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అనేక సామాజిక వర్గాలలో బాలికల సంఖ్య తగ్గిపోయి ఆ వర్గాల్లోని యువకుల వయసు 35, 40 సంవత్సరాలు చేరుకున్నప్పటికీ పెళ్లిళ్లు గాక వారి తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు.

తల్లి కడుపులో ఉండగానే ఆడ శిశువులు పుట్టే హక్కును, జీవించే హక్కును కోల్పోతున్నారు. గర్భాశయంలో ఆడపిల్లలను కడతేరుస్తున్న సంఘటనలు దేశంలో నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కొందరు వైద్యులు కాసులకు కక్కుర్తిపడి స్కానింగ్ ప్రక్రియ ద్వారా తల్లి కడుపులోని బిడ్డ లింగాన్ని నిర్ధారిస్తూ గర్భాశయంలోనే ప్రాణాన్ని చిదిమేస్తూ అబార్షన్లకు పాల్పడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇబ్బడిముబ్బడిగా ఉన్న స్కానింగ్ సెంటర్లు గ్రామీణ ప్రాంతాల వరకు తమ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకొని లింగ నిర్ధారణ పరీక్షలతో కోట్ల రూపాయలు దండుకుంటూ మాతా, శిశు ప్రాణాలతో చెలగాటాలాడుతున్నారు. ఇటీవల సూర్యాపేటలో అనుమతి లేని ఓ స్కానింగ్ సెంటర్ యజమాని నుంచి 25 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసి ఓ డిఎస్‌పి, సిఐ ఎసిబికి పట్టుబడటం స్కానింగ్ సెంటర్లలో జరిగే తెరమాటు వ్యవహారాన్ని బట్టబయలు చేసింది.

భ్రూణ హత్యలు నివారించడానికి పిసిపిఎన్ డిటి- 1994 చట్టాన్ని కేంద్రం తీసుకొచ్చినప్పటికీ ఫలితం లేకుండాపోతోంది. వైద్య ఆరోగ్యశాఖ అధికారుల అలసత్వంతో ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు యథేచ్ఛగా గర్భంలో ఉన్న శిశువు లింగాన్ని నిర్ధారిస్తూ అబార్షన్లకు పాల్పడుతూ చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్టు కూడా దేశంలో ఉన్న లింగ వివక్షను అసమానతలను వేలెత్తి చూపింది. 2023లో 146 దేశాలలో 127వ స్థానంలో ఉన్న భారతదేశం, 2024లో మరింత దిగజారి 129వ స్థానానికి పడిపోయింది. బాలబాలికల సంఖ్య సమతుల్యంగా ఉన్నప్పుడే వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండి సమాజంలో అనేక సమస్యలు నివారించబడతాయి. దేశవ్యాప్తంగా లింగ వివక్షను రూపుమాపేందుకు కృషి చేస్తున్నట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ప్రచార ఆర్భాటాలకే ప్రభుత్వ కార్యక్రమాలు పరిమితం అవుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వం బాలికల సంఖ్యను, విద్యను, రక్షణను మెరుగుపరిచేందుకు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన బేటీ బచావో -బేటీ పడావో పథకం ప్రారంభమై దశాబ్దకాలం గడుస్తున్నా అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాలికల సంఖ్యను పెంచేందుకు గల అవకాశాలపై దృష్టి పెట్టి బాలికల పుట్టుకకు, ఎదుగుదలకు, అభివృద్ధికి, రక్షణకు ఆటంకంగా ఉన్న అవరోధాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. స్కానింగ్ సెంటర్లపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, పోలీస్ శాఖ నిరంతరం నిఘా ఉంచి భ్రూణ హత్యల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన వైద్యులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిర్భయ, పోక్సో చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి.

బిల్లిపెల్లి లక్ష్మారెడ్డి, 94409 66416

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News