హైదరాబాద్: సృష్టి యూనివర్సల్ ఫర్టిలిటీ సెంటర్ (Srushti Centre) దారుణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆ సెంటర్ డాక్టర్ నమ్రతకు ఐదు రోజులు పోలీసు కస్టడీ విధించిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసుకు సంబంధించి పలు కీలక అంశాలను పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. సరోగసి చేయకుండానే పలువురు దంపతులను మోసం చేసినట్లు ఆ విషయాన్ని నమ్రత అంగీకరించినట్లు తెలిపారు.
‘‘రాజస్థాన్ దంపతులనూ సరోసగి పేరుతో నమ్రత (Srushti Centre) మోసం చేశారు. వాళ్లు డిఎన్‌ఎ పరీక్షల నివేదికలు కావాలని అడగడంతో విషయం బయటపడకుండా తప్పించుకున్నారు. తప్పును సరిదిద్దడానికి కొన్ని రోజుల సమయం కోరారు. వినకపోవడంతో రాజస్థాన్ దంపతులను తన కుమారుడితో బెదిరించారు. సరోగసి పేరుతో ‘సృష్టి’ సెంటర్ చాలా మోసాలు చేసింది. ఐవీఎఫ్ కోసం వచ్చే వారిని సరోగసి వేపు మళ్లించి డబ్బులు దోచుకున్నారు. ఎపిలో కొంతమంది ఎఎన్ఎంల సహాయం కూడా తీసుకున్నారు. గాంధీ ఆస్పత్రి అనస్థీషియన్ డాక్టర్ సదానందం కూడా పూర్తిగా సహకరించారు’’ అని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.