బాహుబలి సినిమాతో తెలుగు ఇండస్ట్రీని హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్లిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి.. ఈ మూవీ అభిమానులకు సర్ ప్రైజ్ ప్రకటించారు. అద్భుతమైన విజువల్స్, పోరాట సన్నివేశాలు, భావోద్వేగాలతో సరికొత్త ప్రపంచాన్ని సృష్టించిన ‘బాహుబలి’ విడుదలై 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రాజమౌళి సోషల్ మీడియా వేదికగా ఈ మూవీ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. రెండు భాగాలను కలిపి ఒకే మూవీగా తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. ‘బాహుబలి: ది ఎపిక్‘ టైటిల్ తో ఈ మూవీని అక్టోబర్ 31న తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దగ్గుబాటి రానా విలన్ గా.. అనుష్క శెట్టి, తమన్నా హీరోయిన్లుగా.. రమ్య కృష్ణ, నాజర్, సత్య రాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈమూవీ తొలి భాగం ‘బాహుబలి: ది బిగినింగ్’ జూలై 10, 2015న విడుదలైంది. రెండో భాగం ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’ 2017లో విడుదలైంది. భారతీయ సినీ చరిత్రలోనే తొలిసారి రూ.వెయ్యి కోట్లు వసూల్ చేసిన చిత్రంగా ఈ మూవీ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండు భాగాలు.. ఒకే సినిమాగా వస్తున్న ‘బాహుబలి: ది ఎపిక్’ను చూసేందుకు ఎదురుచూస్తున్నట్లు మూవీ లవర్స్, అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.