హరిద్వార్‌లో తొక్కిసలాట జరిగింది. ఆదివారం ఉదయం హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ విషాద సంఘటనలో ఆరుగురు మరణించగా, 25 మందికి పైగా గాయపడ్డారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని హరిద్వార్ ఎస్‌ఎస్‌పి తెలిపారు. అధికారుల వివరాల ప్రకారం.. మానసా దేవి ఆలయానికి వెళ్లే 2 కి.మీ. నడక మార్గంలో ఈ ఉదయం తొక్కిసలాట జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఓ ప్రదేశంలో ఆగిపోవడంతో రద్దీ ఏర్పడింది. దీంతో కొంతమంది వెనక్కి వెళ్లేందుకు ప్రయత్నించగా.. ఇది భయాందోళనలకు దారితీసింది. జనం పరుగులు పెట్టడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఊపిరాడక అనేక మంది స్పృహతప్పి పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం అంబులెన్స్‌ల ద్వారా సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
మానసా దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాట సంఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. SDRF ఉత్తరాఖండ్ పోలీసులు, స్థానిక పోలీసులు, ఇతర రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలలో నిమగ్నమై ఉన్నాయని ఆయన తెలిపారు. అధికారులను నిరంతరం సంప్రదిస్తూ.. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాని చెప్పారు. భక్తులందరి భద్రత, శ్రేయస్సు కోసం మాతృదేవతను ప్రార్థిస్తున్నాని ఆయన పేర్కొన్నారు.