పవిత్ర హరిద్వార్ కొండశిఖర మానసా దేవి ఆలయం వద్ద ఆదివారం తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు కనీసం ఆరుగురు భక్తులు మృతి చెందారు. 28 మంది గాయపడ్డారని స్థానిక పోలీసులు తెలిపారు. శ్రావణ మాసం, ఆదివారం కావడంతో ఇక్కడికి వందలాదిగా జనం తరలివచ్చారు. మెట్ల మీదుగా క్షేత్రానికి వెళ్లూతూ ఉండగా కరెంట్ షాక్ తలెత్తినట్లు వదంతులు వ్యాపించాయి. దీనితో ప్రాణభయంతో జనం పరుగులు తీయడం తొక్కిసలాటకు దారితీసిందని ప్రాధమికంగా తెలిసింది. గాయపడ్డ వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారని, వీరిలో ఆరుగురు చనిపోయారని హరిద్వార్ సీనియర్ ఎస్‌పి ప్రమేంద్ర సింగ్ తెలిపారు.
ఉదయం 9 గంటల ప్రాంతంలో దుర్ఘటన జరిగింది. ఇక్కడ 500 అడుగుల ఎత్తులో శివాలిక్ పర్వతం పైన ఆలయం ఉంది. ఇక్కడికి తరలివచ్చిన భక్తులలో ఎక్కువ మంది మహిళలు, వారి వెంట పిల్లలు ఉన్నారు. ఘటనపై మెజిస్టేరియల్ దర్యాప్తునకు ఆదేశించినట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. ఈ ఆలయంలో విషాదకర ఘటన జరిగిందని, మృతుల కుటుంబాలకు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ వేర్వేరు ప్రకటనలు వెలువరించారు.