పిల్లలు చదువుల్లో రాణించాలని, ఉన్నత స్థాయిలో వారి భవిష్యత్తు ఉండాలని తల్లిదండ్రులు కలలు కంటుంటారు. వారి చదువుల కోసం తమకు అంతటి ఆర్థిక స్తోమత లేకపోయినా, అవసరమైన ఖర్చులు తగ్గించుకుని లేదా అప్పులు చేసి, ఆస్తులు అమ్మి త్యాగం చేస్తుంటారు.అయితే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలనే ఆశ్రయించడం జరుగుతోంది. కానీ ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దోపిడీ రానురాను మితిమీరిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ సమస్యపై ఇటీవల ఢిల్లీలోని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన బాట పట్టడం చివరకు ఫలించింది. ఈ అత్యధిక ఫీజుల జులుంకు అడ్డుకట్ట వేయడానికి ఢిల్లీ ప్రభుత్వం ఫీజుల స్థిరీకరణ, నియంత్రణ బిల్లు 2025 ముసాయిదా బిల్లును అమలు లోకి తీసుకురావడం సాహసోపేత నిర్ణయం అని చెప్పవచ్చు.
దీనివల్ల ఢిల్లీలోని 1677 పాఠశాలలు, ఎయిడెడ్, నాన్ ఎయిడెడ్ లేదా ప్రయివేట్ అయినా ఫీజులకు సంబంధించిన పూర్తి మార్గదర్శకత్వం, విధానాన్ని నిర్ణయించడానికి వీలవుతుంది. ఈ నిబంధనలు అమలు చేయడానికి మూడు కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. పాఠశాల మౌలిక సదుపాయాల ఆధారంగా మూడు సంవత్సరాల పాటు ఫీజులను ఈ ప్యానెళ్లు నిర్ణయిస్తాయి. ఫీజుల నిర్ణయంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాత్ర వహిస్తారు. ఢిల్లీలో ప్రైవేట్ స్కూళ్లు ఫీజులు గత మూడేళ్లలో 50 నుంచి 80 శాతం పెరిగాయి. ఢిల్లీలో సగానికి సగం స్కూళ్లన్నీ ప్రైవేట్‌వే. జాతీయ స్థాయిలో ఈ సంఖ్య మూడోవంతుగా ఉంది. ప్రభుత్వ స్కూళ్లలో చదువులకు కనీస వసతులు లేకపోవడంతో చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్లను ఆశ్రయించవలసి వస్తోంది. దీనికి తోడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం లేకపోవడం కూడా లోటు అవుతోంది. ప్రైవేట్ స్కూళ్లలో విద్యార్థుల అడ్మిషన్లు పరిశీలిస్తే రానురాను పెరుగుతున్నాయి.
2010లో 20 శాతం అడ్మిషన్ల నుంచి 2023లో 46% వరకు పెరగడం గమనార్హం. డిమాండ్‌కు తగ్గట్టు స్కూళ్ల చదువుల్లో నాణ్యత ఉండడం లేదు. చదువుల వ్యాపారంలో బోధన ఎంత నాసిరకంగా ఉన్నా లాభాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో చదువులు అత్యంత ఖరీదుగా మారుతున్నాయి. జవాబుదారీతనం లోపిస్తోంది. ఆశావహులైన మధ్య తరగతి వర్గాలు తక్కువ నాణ్యత కలిగిన చదువులకు ఎక్కువగా ఖర్చు పెట్టవలసి వస్తోంది. ఫీజులను భరించే స్తోమత లేక విద్యార్థుల తల్లిదండ్రులు నిస్సహాయంగా దిక్కులు చూస్తున్నారు. ఈ పరిస్థితిపై ఢిల్లీలోని ప్రైవేట్ స్కూళ్ల వ్యవహారంపై పరిశీలనకు ఏర్పాటైన జడ్జీ నేతృత్వ కమిటీ ఢిల్లీలో 449 ప్రైవేట్ స్కూళ్లు అత్యధిక ఫీజులను గుంజుతున్నాయని గుర్తించింది. అయితే దీనికి అడ్డుకట్ట వేయడంలో విఫలమవుతున్నారు. ప్రభుత్వ విధానపరమైన లోపాలే దీనికి కారణం.
బెంగళూరు నుంచి ఢిల్లీ వరకు గత మూడేళ్లుగా 50 నుంచి 80 శాతం పెరిగాయని సర్వేలో తేలింది. దేశంలోని 309 జిల్లాలకు సంబంధించి 31,000 మంది విద్యార్థుల తల్లిదండ్రులను సర్వే చేయగా, 93 శాతం మంది తల్లిదండ్రులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ఫీజులను నియంత్రించలేక పోతున్నాయని నిందించారు. దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి ఫీజుల భారం పై మార్చి, ఏప్రిల్ నెలల్లో 100 ఫిర్యాదులు అందాయని లోకల్ సర్కిల్స్ సంస్థాపకుడు సచిన్ టపారియా చెప్పారు. 8 శాతం మంది తమ పిల్లల స్కూలు ఫీజులు 80 శాతం వరకు పెరిగాయని చెప్పగా, 36% మంది 50 నుంచి 80% వరకు పెరిగాయని ఉదహరించారు. మరో 8 శాతం మంది 30 శాతం నుంచి 50% వరకు పెరిగాయని తెలిపారు. మొత్తం మీద 44% మంది తమ పిల్లల ఫీజులు గత మూడేళ్లలో 50% నుంచి 80% వరకు పెరిగాయని వివరించారు.
46 శాతం మంది ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలతో చర్చించినా ప్రయోజనం కనిపించలేదన్నారు. 47 శాతం మంది తమ రాష్ట్రాలు ఈ సమస్యను అసలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మొత్తం మీద 93% మంది రాష్ట్ర ప్రభుత్వాలు స్కూళ్ల ఫీజులను అదుపు చేయలేకపోతున్నాయని ఆరోపించారు. ప్రైవేట్ స్కూళ్లు ముఖ్యంగా అంతర్జాతీయ ప్రమాణాల విద్యా విధానాన్ని ఏవైతే అందిస్తాయో ఆయా స్కూళ్లు అత్యధిక ఫీజులను గుంజుతున్నాయి. ధనిక వర్గాలు ఈ భారాన్ని తేలికగా భరించగలుగుతున్నారు. మధ్యతరగతి, సామాన్య వర్గాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పిల్లల చదువులకోసం అత్యవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం లేదా అప్పు చేయడమో చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో భరించగలిగే ఫీజులతో నాణ్యమైన విద్య పిల్లలకు అందేలా సహకరించాల్సిన అవసరం ఉంది. మౌలిక సౌకర్యాలు కూడా కల్పించవలసి ఉంది. ఈ ఫీజుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వ ఉత్తర్వులేవీ జారీ కాలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో విద్యా విభాగం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. విద్యామంత్రిత్వశాఖకు చెందిన యునిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (యుడిఐఎస్‌ఇ+) నివేదిక ప్రకారం దేశంలో 202324లో స్కూళ్లలో విద్యార్థుల నమోదు 24.8 కోట్లకు తగ్గిందని తేలింది. అంతకుముందటి సంవత్సరాలతో పోలిస్తే కోటి మంది స్కూళ్లకు వెళ్లడం లేదని తెలిసింది. ఇది 201819 తో పోలిస్తే 26.02 కోట్ల నుంచి 6% తగ్గినట్టు చెప్పవచ్చు. ఈ విధంగా నమోదు తగ్గిపోవడం ప్రస్తుత విద్యావిధానాల సమర్ధ తపై ఆందోళన కలిగిస్తోంది. తగిన లక్షాలను అమలు చేయడం తప్పనిసరి.