ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి మంచి ఉద్యోగం సంపాదించి సంతోషంగా ఇంటికి తిరిగి వస్తుందనుకున్న తమ కుమార్తె విదేశాల్లో రోడ్డు ప్రమాదానికి గురై శవమై ఇంటికి తిరిగి వస్తుందని కలలో కూడా అనుకోలేదని మృతురాలి కుటుంబసభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ పరిధిలోని బాలాజీ నగర్, గండిమైసమ్మలో నివాసముండే శ్రీనివాస్‌రావు పెద్ద కుమార్తె శ్రీజ వర్మ (23) ఉన్నత చదువుల ఉద్యోగం కోసం వెళ్లి అమెరికాలోని చికాగోలోని ఈస్టర్న్ ఇల్లినియస్ విశ్వ విద్యాలయంలో ఎంఎస్ పూర్తి చేసి అక్కడే ఉద్యోగ వేటలో ఉంటుంది. సోమవారం రాత్రి శ్రీజ అర్బనాలోని తన అపార్ట్మెంట్ పక్కనే ఉన్న రెస్టారెంట్‌కి భోజనం కోసం నడుచుకుంటూ వెళ్లుతుండగా, అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రక్ ఆమెను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో అక్కడి వారు వెంటనే ఆమెను అర్బనా లోని కార్లే హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుత్బుల్లాపూర్ లో నివాసం వద్ద ఆలుముకున్న విషాద ఛాయలు తమ కుమార్తెను ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు శ్రీజ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందన్న వార్త విని శోకసంద్రంలో మునిగిపోయారు. వారి నివాసం వద్ద బంధువులు,స్నేహితులు శ్రీజ ను కడసారిగా చూసుకోవాలని ఆమె మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి రప్పించేందుకు తెలంగాణ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సహాయం చేయవలసిందిగా తల్లిదుండ్రులు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు.