ఆరునెలల నుంచి మూడు సంవత్సరాల అద్దెలు పెండింగ్..!
అద్దెలు చెల్లించలేక చేతులెత్తేస్తున్న సబ్ రిజిస్ట్రార్‌లు…?
తాళాలు వేసి, నెట్, కరెంట్, వాటర్ కనెక్షన్‌లను కట్ చేస్తున్న యజమానులు
కూర్చోవడానికి కుర్చీలు లేవు…. తాగడానికి నీళ్లు లేవు…
స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులకు సబ్ రిజిస్ట్రార్‌ల మొర
మనతెలంగాణ/హైదరాబాద్: సొంత భవనాలు లేకపోవడంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆదాయాన్ని తీసుకురావడంలో ఈ శాఖ రెండోస్థానంలో ఉండగా భవనాలకు అద్దెలు, కరెంట్, నెట్ బిల్లులు చెల్లించడంలో వెనుకబడి ఉందని, దీనివల్ల తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని సబ్ రిజిస్ట్రార్‌లు వాపోతున్నారు. దీంతోపాటు ప్రతినెలా కిరాయిని చెల్లించాలని భవన యజమానులు ఇబ్బందులు పెడుతున్నారని సబ్ రిజిస్ట్రార్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలావరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలన్నీ అద్దె భవనాల్లో కొనసాగుతుండడంతో ఆయా భవనాల యజమానులు అద్దెల కోసం సబ్ రిజిస్ట్రార్‌లపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు యజమానులు కరెంట్, నెట్ కనెక్షన్‌లను కట్ చేయించడం, మరికొందరు యజమానులు తాళాలు వేస్తుండడంతో రిజిస్ట్రేషన్‌లు ఆగిపో తున్నాయని సబ్ రిజిస్ట్రార్‌లు వాపోతున్నారు. ప్రస్తుతం పలు భవనాల అద్దెలకు సంబంధించి ఆరునెలల నుంచి మూడు సంవత్సరాల వరకు అద్దెలు పెండింగ్‌లో ఉన్నాయని సబ్ రిజిస్ట్రార్‌లు పేర్కొంటున్నారు.
మూడునెలల నుంచి ఆరు నెలల్లోపు బకాయిలను చెల్లించాలని ఆదేశాలు ఉన్నా….
గత ప్రభుత్వంలో సంవత్సరానికి ఒకసారి భవన యజమాలనుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అద్దెలను చెల్లించేది. అయితే, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం మూడునెలల నుంచి ఆరు నెలల్లోపు బకాయిలను చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అయినా బిల్లులు మంజూరు కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని సబ్ రిజిస్ట్రార్‌లు వాపోతున్నారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లకు వచ్చే వారు కూర్చోవడానికి కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కుర్చీలు కూడా లేకపోవడంతో చెట్ల కిందే క్రయ, విక్రయదారులు సర్దుకుపోతున్నారని, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు కార్యాలయాల్లో వారు నిలబడాల్సిన పరిస్థితి నెలకొందని సబ్ రిజిస్ట్రార్‌లు వాపోతున్నారు. కనీసం మౌలిక సదుపాయాల కోసమేనా బడ్జెట్‌ను కేటాయించాలని ఉన్నతాధికారులకు సబ్ రిజిస్ట్రార్‌లు విజ్ఞప్తి చేస్తుండడం విశేషం. ప్రస్తుతం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కొనసాగుతున్న పలు అద్దె భవనాలకు సంబంధించి కిరాయి తక్కువలో తక్కువగా రూ.20వేల నుంచి రూ.3లక్షల వరకు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ చెల్లిస్తుండడం గమనార్హం.
జీతం నుంచే అద్దెలను..
ఈ నేపథ్యంలోనే సోమవారం రామోజీఫిలిం సిటీ పరిధిలో ఉన్న అబ్దుల్లాపూర్‌మెట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఆ భవన యజమానికి తాళం వేశారు. ఏకంగా 40 నెలల అద్దె బకాయిలు చెల్లించకపోవడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తాళాలు వేశామని, ఇప్పటికే పలుమార్లు ఆ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని అయినా వారు స్పందించలేదని, అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తానని ఆయన పేర్కొన్నారు. ఇలా గతంలోనే అనేక సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకోవడం విశేషం. కొందరు భవన యజమానులు కరెంట్, నెట్ కనెక్షన్, వాటర్ కనెక్షన్‌లను కట్ చేయించి సబ్ రిజిస్ట్రార్‌లను ఇబ్బంది పెడుతున్నట్టుగా తెలిసింది. ప్రభుత్వం ఆదేశించినా తమకు బిల్లులు మంజూరు కావడం లేదని, దీంతో తమ జీతం నుంచే అద్దెలు చెల్లించాల్సి వస్తుందని సబ్ రిజిస్ట్రార్‌లు పేర్కొంటున్నారు.
సొంత డబ్బులతో నెట్, కరెంట్ బిల్లులు…
తమ సొంత డబ్బులతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సంబంధించి నెట్, కరెంట్ బిల్లులను చెల్లింపులు చేసి రోజు వారీ పనులు జరిగేలా చూస్తున్నామని కొందరు సబ్ రిజిస్ట్రార్‌లు పేర్కొంటున్నారు. అయితే చాలాచోట్ల కిరాయిలు, మిగతా బిల్లులను తాము చెల్లించలేమని మరికొందరు సబ్ రిజిస్ట్రార్‌లు చేతులెత్తేస్తుండడంతో ఆయా భవనాల యజమానులు కోర్టును ఆశ్రయించి నోటీసులు జారీ చేస్తుండడంతో పాటు తాళాలు వేస్తున్నట్టుగా సబ్ రిజిస్ట్రార్‌లు పేర్కొంటున్నారు.
37 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకే సొంత భవనాలు
రాష్ట్రంలో మొత్తం 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుండగా వాటిలో 37 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మాత్రమే సొంత భవనాల్లో నడుస్తున్నాయి. మిగతా 104 ఆఫీసులు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 52 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు అవసరమయ్యే భవనాల నిర్మాణానికి ప్రభుత్వం ఈ మధ్యనే స్థలాన్ని సైతం కేటాయించింది. భూములు సిద్ధంగా ఉన్న చోట వీలైనంత త్వరగా మోడల్ రిజిస్ట్రేషన్ ఆఫీసులను నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి పొంగులేటిలు అధికారులను ఆదేశించారు. మిగతా 52 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు సరిపడా స్థలాలను అన్వేషించాలని, పబ్లిక్ యుటిలిటీ కింద సేకరించిన స్థలాలు అందుబాటులో ఉంటే అక్కడే నూతన భవనాలు నిర్మించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అందులో భాగంగా మొదటి దశలో ఆదాయం ఎక్కువగా వచ్చే రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.