కొంత మందిని మనం వాకింగ్ లైబ్రరి అంటుంటాం. అంటే లైబ్రరి నడిచి వస్తుందని కాదు. ఒక వ్యక్తికి అనేక విషయాలపైన అపారమైన జ్ఞానం ఉంటే ఆ వ్యక్తిని వాకింగ్ లైబ్రరి అనడం పరిపాటి. అయితే వాకింగ్ కాన్స్టిట్యూషన్ అనే పేరు ఎవరికైనా ఉందా? ఇప్పటి వరకు ఆ పేరు ఎవరికి ఖాయం కాలేదు. కానీ గత 50 ఏళ్లకు పైని భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడం మాత్రమే కాకుండా, ఇంటి నుంచి బయటకు కదిలితే ఆయన కోటు పాకెట్లో భారత రాజ్యాంగం పాకెట్ బుక్ ఉంటుంది. అది తన కోటులో లేకుండా బయటకు కదలడం నేను చూడలేదు. గత పదిహేను సంవత్సరాలుగా అనేకసార్లు ఆయనతో కలిసి మాట్లాడడం, సభల్లో పాల్గొనడం, ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసిన సభలకు నిర్వాహకుడుగా వ్యవహరించడం జరిగింది. ఏ సందర్భంలో కూడా ఆయన భారత రాజ్యాంగం పుస్తకం లేకుండా నాకు కనిపించలేదు.
ఆయనెవరో కాదు, భారత ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి. ఆయన రాష్ట్రపతి పదవికి (post President) పోటీ చేయడం అనే అంశం చాలా ఆశ్చర్యం. నిజానికి ఆయన అటువంటి పదవులు కావాలని భావించి ఉంటే ఇప్పటికే ఎన్నో అవకాశాలు వచ్చేవి. కాని ఆయన ఎటువంటి రాజకీయ పదవులు కోసం ప్రయత్నిం లేదు. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆయన సుప్రీంకోర్టు నుంచి పదవీ విరమణ పొందిన తర్వాత ఎన్నో పదవులకు అవకాశం ఉండింది. కానీ ఆయన అటువైపుగా ఆలోచించలేదు. కారణం, ఏమిటంటే, ఆయన ఎప్పుడైనా ఏదైనా చేయాలనుకునేవాడు, కావాలనుకునేవాడు కాదు. ఇప్పుడు కూడా ఏదో కావాలనుకునే కోరికతో ఉపరాష్ట్రపతిగా పోటీ చేయడం లేదు.
తన బాధ్యతగా ఇది చేయాలని తాను రంగంలోకి దిగాడు. ఆయనను ఉపరాష్ట్రపతిగా రంగంలోకి దింపింది కేవలం అంటే కేవలం భారత రాజ్యాంగ పరిరక్షణ మాత్రమే. ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల్లో ఈ కర్తవ్యం నిర్వర్తించాలని ఆయన నిర్ణయించుకున్నారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా అధికారంలో ఉన్న పార్టీలు, ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని నిర్లక్షం చేస్తున్నదని, రాజ్యాంగంలో పేర్కొన్న అనేక అంశాలను పక్కకు తోసేసి, తమ ఎజెండాను అమలు చేస్తున్నాయని ఆయన ఇటీవల అనేక సభల్లో మాట్లాడారు. అంతేకాకుండా రాజ్యాంగబద్ధంగా నిర్మితమైన చట్టసభలు, న్యాయ వ్యవస్థ, అధికార వ్యవస్థతో అనేక సంస్థలు నిర్వీర్యం అయిపోతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
అదే సమయంలో కాంగ్రెస్ పార్టీతో సహా ప్రతిపక్ష పార్టీలన్నీ రాజ్యాంగ పరిరక్షణ దాన్ని బలంగా వినిపిస్తున్నాయి. దానికి ఒకే సంకేతంగా సుదర్శన్ రెడ్డి ఎప్పటి నుంచో తన వెంట ఉంచుకొంటున్న మినీ రాజ్యాంగం పుస్తకాన్ని రాహుల్ గాంధీ లాంటి వాళ్లు వెంటపెట్టుకుంటున్నారు. అందుకోసం యాత్రలు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం సుదర్శన్ రెడ్డిని బలపరుస్తున్న ‘ఇండియా’ కూటమి పక్షాలన్నీ కూడా రాజ్యాంగ రక్షణ కోసం మాట్లాడుతూనే ఉన్నాయి. సుదర్శన్ రెడ్డి ఈ రోజుకు ఈ రోజు రాజ్యాంగ రక్షణ కావాలనుకోవటం లేదనే విషయాన్ని ముందే చెప్పాను. అంతేకాకుండా ‘ఇండియా’ కూటమి పక్షాల రాజకీయ భావాలన్నీ సుదర్శన్ రెడ్డిలో ఉన్నాయి. ఇది మరొక అంశం. ‘ఇండియా’ కూటమిలో కాంగ్రెస్సతో పాటు ఉన్న పక్షాలలో కమ్యూనిస్టులు, మార్కిస్టు లెనినిస్టు పార్టీ, సోషలిస్టు భావజాల వారసత్వం కలిగిన సమాజ్ వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, వాటితో పాటు కుల వివక్ష, ప్రాంత వివక్షలకు పోరాడుతున్న డిఎంకె, గత కొంత కాలంగా మత తత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న తృణమూల్, ఇంకా ఇతర ప్రజాస్వామిక, సెక్యులర్ భావజాలం కలిగిన వాళ్లు ఉన్నారు.
ఈ భావాల మొత్తం రూపమే జస్టిస్ సుదర్శన్ రెడ్డి. ఆయన విద్యార్థిగా ఉన్న సమయంలోనే ప్రముఖ సోషలిస్టు సిద్ధాంతకర్త రామ్ మనోహర్ లోహియా భావాలకు ఆకర్షితులయ్యారు. ఆ చైతన్యంతోనే 1974 ప్రాంతంలో ప్రారంభమైన జెపి ఉద్యమంలో పాల్గొన్నారు. 1975లో ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీని వ్యతిరేకించి తన ప్రజాస్వామ్య ఆకాంక్షను ఎత్తి పట్టారు. 1971లో న్యాయవాదిగా తన వృత్తిని చేపట్టినప్పటి నుంచి రాజ్యాంగ అధ్యయనం, దాని రక్షణ కోసం పని చేయడం జీవితంలో భాగమైపోయింది. ఆ తర్వాత 1993, మే 2వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియామకం జరిగినప్పటి నుంచి 2011 జులై, 7వ తేదీన పదవీ విరమణ పొందే వరకు ఆయన వెలువరించిన తీర్పులు ఎన్నో రాజ్యాంగ ప్రతిష్ఠను ఎత్తిపట్టాయి. అందులో సల్వాజుడుం పైన ఇచ్చిన తీర్పు భారత రాజ్యాంగం విశిష్టను దాని గొప్పతనాన్ని ఉన్నతంగా నిలబెట్టాయి. అదే విధంగా, పేదల పక్షాన నిలబడడంలో ఒక జడ్జిగా ఎన్నో ప్రయత్నాలు చేశారు.
అసైన్డ్ భూములు ప్రభుత్వం ప్రజా అవసరాల కోసం స్వాధీనం చేసుకుంటే, ఇతర పట్టా భూములకు ఇచ్చే నష్ట పరిహారం ఇవ్వాలని, అంతకన్న తక్కువ ఇవ్వడానికి లేదని గొప్ప తీర్పు ఇచ్చారు. ఇట్లా ఎన్నైనా చెప్పుకుంటూ పోవచ్చు. అంటే రాజ్యాంగ రక్షణతోపాటు, ప్రజల, ప్రత్యేకించి ఆదివాసుల, దళితుల, పేదల హక్కుల రక్షణ కూడా ఆయన తన కర్తవ్యంలో చేర్చుకున్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇతరులతో వేరు చేసి చూడడానికి ఇంకొక విశేషాన్ని చెప్పుకోవాలి. ఆయన భారత రాజ్యాంగాన్ని సరైన రీతిలో అర్థం చేసుకున్నారనడానికి మరొక ఉదాహరణ. ఆర్టికల్ 38 అమలు, భారత దేశంలోని చాలా సమస్యలకు పరిష్కారం ఆర్టికల్ 38లో ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో ఆయన తన సమయాన్ని, మేధస్సును పూర్తిగా ఉపయోగించారు.
ఆ సందర్భంలో ఎన్నో సార్లు జస్టిస్ సుదర్శన్ రెడ్డి భారత దేశంలో పెరుగుతున్న అసమానతలు అన్ని సమస్యలకు కారణమని మాతో చెప్పేవారు. ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య ఉన్న అసమానతలను తొలగించడం, అంతేకాకుండా అసమానతలు పెరగకుండా చర్యలు తీసుకోవడం లాంటి బాధ్యతలను ప్రభుత్వాలు తీసుకోకపోవడం వల్లనే అనేక ఉద్యమాలు, ఆందోళనలు వస్తున్నాయని జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. భారత రాజ్యాంంలోని ఆర్టికల్38 అమలు కోసం ప్రత్యేక ప్రభుత్వ విభాగం గానీ, వీలైతే ప్రత్యేక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేయాలని ఆయన భావించారు. నిజానికి ఇది గొప్ప ఆలోచన. ఆయన సామాజిక మార్గదర్శకానికి, భవిష్యత్ దర్శనానికి ఇది ఒక మచ్చు తునక.
ఈ రోజు ‘ఇండియా’ కూటమి తీసుకున్న ఈ నిర్ణయం చరిత్రాత్మకమైనది. ‘ఇండియా’ కూటమిలోని పార్లమెంటు సభ్యులు మాత్రమే కాకుండా ఎన్‌డిఎలోని సభ్యులందరూ ప్రత్యేకించి ఎస్సి, ఎస్టి ఇతర ప్రజాస్వామిక భావాలు కలిగిన పార్లమెంటు సభ్యులంతా తమ తమ పార్టీ ఆజ్ఞలను ధిక్కరించి రాజ్యాంగ రక్షణ కోసం, ప్రజా వ్యవస్థల మనుగడ కోసం నిరంతరం తపిస్తున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి వైపు నిలబడడం చారిత్రక సందర్భమవుతోంది. తెలుగు రాష్ట్రాలలోని అన్ని రాజకీయ పార్టీల తమ తమ అభిప్రాయాలను పక్కన పెట్టి ఈ ఒక్కసారి రాజ్యాంగ రక్షణకు అండగా నిలబడాల్సిన అవసరమున్నది.
- మల్లేపల్లి లక్ష్మయ్య (దర్పణం)