న్యూఢిల్లీ : ఉప రాష్ట్రపతి పదవికి ఎన్నిక అనివార్యమైంది. దక్షిణ భారతదేశానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బరిలో నిలుస్తున్నారు. తాజాగా ఇండియా కూటమి తమ అభ్యర్థిని పోటీలో దింపాలని నిర్ణయించడంతో పాటు రిటైర్డ్ జడ్జి, తెలంగాణకు చెందిన జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి పేరును ప్రకటించింది. ఈ మేరకు మంగళవారంనాడు కూటమి తరపున కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే ఉమ్మడి ప్రకటన చేశారు. మరోవైపు ఎన్‌డిఎ అభ్యర్ధిగా ఇప్పటికే మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ పేరును ప్రకటించింది. సుదర్శన్ రెడ్డి కి విపక్ష పార్టీలన్నీ మద్దతు తెలిపాయని ఖర్గే వెల్లడించారు. ‘దేశం లోని ప్ర ఖ్యాత న్యాయ నిపుణుల్లో బి. సుదర్శన్ రెడ్డి ఒకరు. ఆంధ్ర ప్రదేశ్, గువాహ టి, హైకోర్టులతోపాటు సుప్రీంకోర్టులో సేవలందించారు. సామాజిక, ఆర్థి క, రాజకీయ న్యాయంపై స్పష్టమైన అవగాహన కలిగిన వ్యక్తి. ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని ఇండియా కూటమిలోని పార్టీలన్నీ ఓ అభిప్రాయానికి వచ్చి ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి ’ అని కూటమి ఉమ్మడి ప్రకటనలో ఖర్గే పేర్కొన్నారు. ప్రతిపక్షాలన్నీ ఒకే పేరును అంగీకరించడం ఎంతో సంతోషంగా ఉందని, ఇది ప్రజాస్వామ్యానికి అతి పెద్ద విజయమన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నప్పుడు విపక్షాలన్నీ ఏకమై పోరాటం చేస్తాయని, అందవల్ల తాము అభ్యర్థిని నిలబెట్టాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.
భారతదేశంలో పేరెన్నికగన్న న్యాయనిపుణుల్లో సుదర్శన్‌రెడ్డి ఒకరని ప్రశంసించారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయంలో ఆయనను చాంపియన్‌గా ఖర్గే అభివర్ణించారు. పేదల పక్షపాతి అని, ఆయన తీర్పులను గమనిస్తే అది స్పష్టంగా అర్థమవుతుందన్నారు. రాజ్యంగం, ప్రాథమిక హక్కులను కాపాడడంలో ఆయన తనవంతు ప్రాత పోషించారన్నారు. సుదర్శన్‌రెడ్డి మంగళవారం ఢిల్లీకి చేరుకున్నారు. బుధవారం జరిగే ప్రత్యేక సమావేశంలో ఆయనను ఇండియా కూటమి ఎంపిలకు పరిచయం చేయనున్నారు. ఈ సందర్భంగా విపక్ష నేతలను సుదర్శన్‌రెడ్డి వ్యక్తిగతంగా కలిసి మద్దతు కోరనున్నారు. మరోవైపు రాధాకృష్ణన్‌ను ఎలాంటి మచ్చ లేని రాజకీయ నాయకుడిగా పేర్కొంటూ ఎన్‌డిఎ ఆయనను బరిలో దింపింది. పాలనా పరమైన అనుభవం కూడా ఆయనకు ఉందని తెలిపింది. 201620 వరకు కాయిర్ బోర్డు చైర్మన్‌గా వ్యవహరించారని, ఆయన హయాంలో ఆ రంగం అద్భుతమైన ప్రగతిని సాధించిందని వెల్లడించింది. రాధాకృష్ణన్‌ను రాజనీతిజ్ఞుడిగా బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా అభివర్ణించారు. తమిళనాడులో బలమైన ఓబిసి గౌండర్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తని, బలహీన వర్గాల అభ్యున్నతికి తోడ్పాడతారని కొనియాడారు.
ఉస్మానియా వర్శిటీ నుంచి పట్టా…
జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి స్వస్థలం తెలంగాణ లోని రంగారెడ్డి జిల్లా ఆకులమైలారం. 1946 జులైలో జన్మించిన ఆయన 1971లో ఉస్మానియా యూనివర్శిటీలో న్యాయవిద్య పూర్తి చేశారు. అనంతరం అదే ఏడాది డిసెంబర్ 27న బార్ కౌన్సిల్‌లో నమోదు చేసుకున్నారు. 1995 మే 2న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2005లో గువాహటి హైకోర్టు సీజేగా పనిచేశారు. 200711 మధ్య సుప్రీం కోర్టు జడ్జిగాను సేవలందించిన ఆయన … 2013మార్చిలో గోవా తొలి లోకాయుక్తగా బాధ్యతలు స్వీకరించారు. వ్యక్తిగత కారణాలతో ఏడు నెలల్లోనే ఆ పదవికి రాజీనామా చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ న్యాయ సలహాదారుగా కూడా పనిచేశారు. హైదరాబాద్‌లోని అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రానికి బోర్డు ఆఫ్ ట్రస్టీ సభ్యుడిగా కూడా సుదర్శన్ రెడ్డి ఉన్నారు.