ఎంజెపి కార్యదర్శి బడుగు సైదులు
మన తెలంగాణ / హైదరాబాద్ : విద్యార్థులను విద్యతో పాటు అన్ని రంగాల్లో ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు సూచించారు. కీసర బాలికల గురుకుల విద్యాసంస్థలో నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరాల ముగింపు కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సమ్మర్ క్యాంపులో(Summer camp ) చేసిన ఆర్ట్ వర్క్స్ తో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఎంతో సృజనాత్మకంగా ఉన్నాయని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
వేసవి శిబిరాలను సద్వినియోగం చేసిన విద్యార్థులను, ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 294 బిసి గురుకుల పాఠశాలల నుంచి 2,539 మంది విద్యార్థులు ఈ ఏడాది నిర్వహించిన వేసవి శిబిరాల్లో(Summer camp ) శిక్షణ పొందారని ఆయన తెలిపారు. స్పోర్ట్స్ లో వాలీబాల్, కబడ్డీ, కోకో, అథ్లెటిక్స్ లో శిక్షణ ఇచ్చారని ఆయన తెలిపారు. ఫైన్ ఆర్ట్స్ లో పెయింటింగ్, ఫోక్ ఆర్ట్ , ట్రెడిషనల్ ఆర్ట్, మ్యూజిక్ లో క్లాసికల్ , ఫోక్, డ్రామా, డాన్స్ తో పాటు కీబోర్డ్, వాయిలిన్, తబలా మొదలైన సంగీత వాయిద్యాలలో శిక్షణ ఇచ్చారని ఆయన చెప్పారు. ఈ వేసవి శిబిరాల్లో మెరుగైన ప్రతిభ కనబరిచిన వారిని సర్టిఫికెట్ కోర్స్ లో చేరే అవకాశం కల్పిస్తామని ఆయన తెలిపారు.
ఏప్రిల్ 23 న ప్రారంభమైన ఈ క్యాంప్ లో 21 రోజుల శిక్షణ కాలంలో విద్యార్థులకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహారం అందించామన్నారు. హైదరాబాద్ లో ఫైన్ ఆర్ట్స్ శిక్షణ శిబిరాలు బోగారం (బాయ్స్ ), కీసర (బాలికల )లో, స్పోర్ట్స్ కేంద్రాలు బాయ్స్ కోసం నోముల, తుర్కపల్లి, బాలికల కోసం యాచారం, ఇబ్రహీం పట్నం క్యాంపస్ లో నిర్వహించామని ఆయన తెలిపారు. స్పోర్ట్, ఫైన్ ఆర్ట్స్ శిక్షణతో పాటు ఆసక్తి గల 60 మంది విద్యార్థులకు సెయిలింగ్, 20 మంది విద్యార్థులకు మౌంట్ క్లైంబింగ్ లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని, ఈనెల 21న వారు ఎవరెస్ట్ బెస్ క్యాంప్ కు బయలుదేరుతున్నారని తెలిపారు.
వేసవి శిక్షణ శిబిరాల వల్ల విద్యార్థుల్లో చదువుతో పాటు క్రీడల్లో ఆసక్తి పెరుగుతుందని, వారిలోని నైపుణ్యాలను గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి వీలు కలుగుతుందని సైదులు తెలిపారు. సృజనాత్మకతతో పాటు వారిలో ఏకాగ్రత పెరుగుతుందన్నారు. క్రీడల్లో, ఇతర రంగాల్లో విద్యార్థులు తమ శక్తిసామర్ధ్యాలను పెంచుకునే వీలు కలుగుతుందన్నారు. విద్యార్థులు తీసుకున్న శిక్షణ గురించి ఆయన వారిని అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో అతిధిగా పాల్గొన్న ప్రముఖ మౌంటెరియన్ పూర్ణమాలావత్ మాట్లాడుతూ అసాధ్యమన్నది ఏదీ లేదని, నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తాను గురుకుల పాఠశాలలో చదువుకున్నానని, తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎవరెస్ట్ తో పాటు అనేక ఎత్తైన శిఖరాలు అధిరోహించి గలిగానని అన్నారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లే వారికి ఎవరెస్ట్ కూడా చిన్నగా కనిపిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంజెపి జాయింట్ సెక్రటరీ డాక్టర్ జి. తిరుపతి, హైదరాబాద్ ఆర్ సి ఓ ఆదిత్యవర్మ, రంగారెడ్డి ఆర్ సి ఓ వెంకటేశ్వర్ రెడ్డి, కీసర ప్రిన్సిపల్ రాములు గౌడ్, టీచర్స్, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.