Saturday, August 2, 2025

తెలుగు రాష్ట్రాలకు తీరని ఆశాభంగం

- Advertisement -
- Advertisement -

దేశంలో 2026 తరువాత నిర్వహించే మొదటి జనాభా లెక్కల ప్రకారం తదుపరి నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతుండగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ చట్టం 2014లో ఇచ్చిన హామీల మేరకు తమ అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందని నిరీక్షిస్తున్నాయి. అయితే ఈ పరిస్థితిలో ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఈ రెండు తెలుగు రాష్ట్రాల ఆశలపై నీళ్లుజల్లింది. 2014 చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 175 నుంచి 225కు పెరుగుతాయి. అలాగే తెలంగాణలో 119 నుంచి 153 కు పెరుగుతాయి. అయితే ఈ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ 20202021లో కరోనా మహమ్మారి విజృంభణతో పాటు మరికొన్ని కారణాల వల్ల ప్రారంభం కాలేదు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను అనేక సార్లు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకు వచ్చింది. రెండు రాష్ట్రాల విభజన తరువాత నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని (solve existing problems) కేంద్ర హోం మంత్రిత్వశాఖ నిర్వహించిన సమావేశాల్లోను, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యాన జరిగిన దక్షిణ జోన్ కౌన్సిల్ సమావేశాల్లోనూ ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావించింది. చట్టంలోని సెక్షన్ 26 కింద రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు వీలవుతుందని గుర్తు చేస్తూ అప్పటి తెలంగాణ చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ 2016 జూన్‌లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మెహ్రిషికి లేఖ రాశారు. తెలంగాణ కొత్త రాష్ట్రంగా 2014 జూన్ 2 నుంచి ఆవిర్భవించింది.

తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 119 నుంచి 153 కి పెంచేందుకు వీలుందని ఈ విషయాన్ని వీలైనంత త్వరగా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురావాలని రాజీవ్ శర్మ కేంద్ర హోం మంత్రిత్వశాఖను అభ్యర్థించారు. రెండు రాష్ట్రాల విభజన సమయంలో తెలంగాణ లోని ఖమ్మం జిల్లాకు చెందిన కొన్ని మండలాలు పొరుగునున్న ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోయిన ప్రభావంపై తెలంగాణ మాజీ ఎన్నికల చీఫ్ కమిషనర్ రజత్ కుమార్ కూడా మాట్లాడారు. తరలిపోయిన వాటిలో మూడు నియోజకవర్గాలు షెడ్యూల్డ్ తెగలకు రిజర్వు అయినట్టు చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అసెంబ్లీ సీట్లు తిరిగి సర్దుబాటు చేయాల్సిందిగా కోరుతూ ప్రొఫెసర్ కె. పురుషోత్తంరెడ్డి సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.

జమ్ముకశ్మీర్‌లో జరిగిన ప్రక్రియను ఈ సందర్భంగా ఉదహరించారు. దీనిపై గత వారం సుప్రీం కోర్టు తీర్పువెలువరించింది. 2026 నుంచి ప్రారంభం అవుతాయని భావిస్తున్న జనాభా లెక్కలు పూర్తయి నోటిఫికేషన్ వెలువడిన వరకు నియోజకవర్గాల పునర్విభజన సంగతే ప్రస్తావించవద్దని తీర్పులో స్పష్టం చేసింది. ఇందులో ఉపశమనం కల్పించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమవుతుందని పేర్కొంటూ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. రాష్ట్రాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల రూపకల్పనకు సంబంధించిన ఆర్టికల్ 170 కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తించదని పేర్కొంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఓటర్ల పట్ల వివక్ష చూపడం లేదని, కేంద్ర పాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్ ఒక ప్రత్యేకమైన రాజ్యాంగ, చట్టబద్ధమైన పాలనలో ఉన్నందున అక్కడ నియోజకవర్గాలను పునర్విభజించినట్టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఓటర్ల న్యాయమైన అంచనాలను దెబ్బతీసేలా వ్యవహరించలేదని వివరించింది.

ఆర్టికల్ 170లో పేర్కొన్న నిర్దిష్ట రాజ్యాంగం గురించి జస్టిస్ సూర్యకాంత వివరించారు. 2026లో జనాభా గణన ప్రక్రియ పూర్తయ్యేవరకు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేయరాదని రాజ్యాంగం నిర్దేశించినట్టు ఉదహరించారు. పార్లమెంట్ విధంగానే చట్టం ద్వారా ప్రతి జనాభా లెక్కింపు పూర్తయిన తరువాతనే ప్రతి రాష్ట్ర అసెంబ్లీలోని, అలాగే ప్రతి రాష్ట్రం లోని భౌగోళిక నియోజకవర్గాల తిరిగి సర్దుబాటు అధికారికంగా జరగవలసి ఉంటుందని ఆర్టికల్ 170 (3) చెబుతోంది. తదుపరి జనాభా గణన షెడ్యూల్ ప్రకారం 2026లో ప్రారంభించవలసి ఉంటుంది.

రెండు దశల్లో దీన్ని నిర్వహించవచ్చు. అధికారికంగా జనాభా సేకరణ, జాబితా తయారీ ఇవన్నీ 2027 మార్చి 1 నాటికి పూర్తి అవుతాయని భావిస్తున్నారు. గణాంకాలను తుది ఖరారు చేయడానికి, జాబితాలను విడుదల చేయడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. జనాభా లెక్కల వివరాలను ప్రచురించిన తరువాతనే వాటి ఆధారంగా నియోజకవర్గ పునర్విభజన కమిషన్ తన కార్యాచరణ ప్రారంభిస్తుంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ మరింత ఆలస్యం కావచ్చు. ఇవన్నీ పరిశీలిస్తే తదుపరి జనాభా లెక్కల డేటా ప్రచురించిన తరువాతనే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.

రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందని ఆశించిన ఉభయ రాష్ట్రాలకు సుప్రీం కోర్టు తీర్పు ఆశాభంగం చేసినా, భారత రాష్ట్ర సమితితోసహా ఏ రాజకీయ పార్టీ కూడా ఈ చట్టంలోని పదాల కూర్పు రూపకల్పన గురించి ఏమాత్రం పట్టించుకోకపోవడం ముఖ్యంగా గమనించదగింది. 2014 చట్టంలోని ‘సెక్షన్ 170 సబ్‌క్లాజ్ 3 తో ఎటువంటి సంబంధం లేకుండా’ అన్న పదాలు చేరిస్తే సులువుగా ఈ సమస్య పరిష్కారమయ్యేదని మాజీ ఎంపి బి. వినోద్ కుమార్ పాత్రికేయుల సమావేశంలో తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ విధంగా చేస్తే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ దేశం మొత్తం మీద నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియతో సంబంధం లేకుండా జరిగి ఉండేది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News