న్యూఢిల్లీ: ప్రముఖ రెజ్లర్, ఒలింపిక్ పతకాల విజేత సుశీల్ కుమార్‌కి (Sushil Kumar) సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న అతడి బెయిల్‌ను రద్దు చేసింది. వారం రోజుల్లో సరెండర్ కావాలని ఆదేశించింది. జాతీయ జూనియర్ రెజ్లింగ్ ఛాంపియన్ సాగర్ హత్య కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న సుశీల్‌కి గత మార్చి 4వ తేదీన ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే తన కుమారుడిని హత్య చేసిన సుశీల్‌కి ఇన్ని రోజులు బెయిల్ మంజూరు చేయడంపై సాగర్ తండ్రి అశోక్ ధన్కర్ సుప్రీంని ఆశ్రయించారు. సుశీల్ తరఫున మహేశ్ జెఠ్మలానీ, ధన్కర్ తరఫున సిద్ధార్థ మృదుల్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ బెయిల్‌ని రద్దు చేసింది.
అసలేం జరిగిందంటే..
2021లో ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో సాగర్ ధన్కర్‌తో పాటు అతడి ఇద్దరి స్నేహితులపై సుశీల్ (Sushil Kumar) దాడి చేసినట్లు కేసు నమోదైంది. తీవ్ర గాయాలతో సాగర్ మృతి చెందినట్లు పోస్ట్‌మార్టం రిపోర్టులో తేలింది. దీంతో 18 రోజుల పాటు అరెస్ట్ నుంచి సుశీల్ తప్పించుకున్నాడు. చివరకు ఆ తర్వాత అతన్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ వచ్చే వరకూ సుశీల్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. దీంతో అతడిని రైల్వేశాఖ ఉద్యోగం నుంచి తొలగించింది. అక్టోబర్ 2022లో సుశీల్ సహా 17 మందిపై వివిధ అభియోగాలను నమోదు చేసింది. మూడున్నరేళ్లు జైలు శిక్ష అనుభవించిన సుశీల్ బెయిల్ కోసం ధరఖాస్తు చేయగా.. మార్చి 4న ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు సుప్రీం ఆ బెయిల్‌ని రద్దు చేయడంతో మళ్లీ జైలుకు వెళ్లాల్సిప పరిస్థితి వచ్చింది.