Saturday, May 3, 2025

తదుపరి సిజెఐగా బిఆర్ గవాయి

- Advertisement -
- Advertisement -

గవాయి పేరును కేంద్రానికి సిఫార్సు చేసిన సిజెఐ సంజీవ్ ఖన్నా
మే 13న ఖన్నా పదవీ విరమణ
ఆరు మాసాలే సిజెఐగా ఉండనున్న గవాయి

న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామ్‌కృష్ణ గవాయి పేరును కేంద్రానికి సిజెఐ సంజీవ్ ఖన్నా బుధవారం సిఫార్సు చేశారు. సిజెఐ ఖన్నా తరువాత సుప్రీం కోర్టులో రెండవ అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ గవాయి మే 14న 52వ సిజెఐ కానున్నారు. సిజెఐ ఖన్నా మే 13న పదవీ విరమణ చేయనున్నారు. 2019 మే 24న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన జస్టిస్ గవాయి సిజెఐగా ఆరు మాసాలకు పైగా వ్యవహరించనున్నారు. ఆయన నవంబర్ 23న పదవీ విరమణ చేయనున్నారు.

నిరుడు నవంబర్ 11న 51వ సీజెఐగా ప్రమాణ స్వీకారం చేసిన ఖన్నా తదుపరి సిజెఐగా జస్టిస్ గవాయి నియామకానికి కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖకు సిఫార్సు చేశారు. 2010లో జస్టిస్ కెజి బాలకృష్ణన్ రిటైర్‌మెంట్ తరువాత సిజెఐగా నియుక్తుడు కానున్న రెండవ షెడ్యూల్డ్ కులాల న్యాయమూర్తి జస్టిస్ గవాయి. ఆయన ప్రముఖ సంఘ సేవకుడు, బీహార్, కేరళ మాజీ గవర్నర్ దివంగత ఆర్‌ఎస్ గవాయి కుమారుడు. సుప్రీం కోర్టు న్యాయమూర్తుల రిటైర్‌మెంట్ వయస్సు 65 సంవత్సరాలు. 1960 నవంబర్ 24న అమరావతిలో జన్మించిన జస్టిస్ గవాయి 2003 నవంబర్ 14న బొంబాయి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.

ఆయన 2005 నవంబర్ 12న హైకోర్టు శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. జస్టిస్ గవాయి విశిష్ట తీర్పులు వెలువరించిన సర్వోన్నత న్యాయస్థానం రాజ్యాంగ ధర్మాసనాలు పెక్కింటిలో సభ్యుడుగా ఉన్నారు. పూర్వపు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించిన 370 అధికరణం నిబంధనలను రద్దు చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని ఏకగ్రీవంగా 2023 డిసెంబర్‌లో ధ్రువీకరించిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో ఆయన సభ్యుడు. జస్టిస్ గవాయి సభ్యుడుగా ఉన్న ఐదుగురు సభ్యుల మరొక రాజ్యాంగ ధర్మాసనం రాజకీయ పార్టీల నిధుల కోసం ఎలక్టొరల్ బాండ్ల పథకాన్ని రద్దు చేసింది. రూ. 1000, రూ. 500 కరెన్సీ నోట్ల చలామణీని రద్దు చేయాలన్న 2016 నాటి కేంద్ర నిర్ణయానికి 4:1 మెజారిటీ తీర్పుతో ఆమోద ముద్ర వేసిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో కూడా ఆయన సభ్యుడే. సాంఘికంగా, విద్యావిషయకంగా అత్యంత వెనుకబడిన కులాల అభ్యున్నతికి రిజర్వేషన్ మంజూరు నిమిత్తం షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణకు రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాలకు 6:1 మెజారిటీ తీర్పుతో సాధికారత కల్పించిన ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ గవాయికి భాగం ఉంది.

జస్టిస్ గవాయి అధ్యక్షుడుగా గల ఒక ధర్మాసనం ముఖ్యమైన ఒక తీర్పులో పాన్ ఇండియా మార్గదర్శక సూత్రాలు నిర్దేశించింది. ముందస్తు షోకాజ్ నోటీసు లేకుండా ఏ ఆస్తినీ కూల్చివేయరాదని, బాధితులకు స్పందించేందుకు 15 రోజులు వ్యవధి ఇవ్వాలని బెంచ్ ఆదేశించింది. అడవులు, వన్యప్రాణులు, వృక్షాల పరిరక్షణకు సంబంధించిన వ్యవహారాలను విచారిస్తున్న బెంచ్‌కు కూడా ఆయన సారథిగా ఉన్నారు. ఆయన 1985 మార్చి 16న బార్‌లో చేరారు. ఆయన నాగ్‌పూర్ మునిసిపల్ కార్పొరేషన్‌కు, అమరావతి మునిసిపల్ కార్పొరేషన్‌కు, అమరావతి విశ్వవిద్యాలయానికి స్టాండింగ్ కౌన్సెల్‌గా ఉన్నారు. ఆయనను 1992 ఆగస్టు నుంచి 1993 జూలై వరకు బొంబాయి హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్‌లో అసిస్టెంట్ ప్రభుత్వ ప్లీడర్‌గా, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించారు. ఆయన 2000 జనవరి 17న నాగ్‌పూర్ బెంచ్‌కు ప్రభుత్వ ప్లీడర్‌గా, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News