న్యూఢిల్లీ: నేపాల్‌లో యువత నిరసనలు హింసాత్మకంగా మారాయి. దీంతో అక్కడ రాజకీయ సంక్షోభం ఏర్పడింది. కొన్ని నెలల క్రితం బంగ్లాదేశ్ లోనూ ఇదే పరిస్థితి. ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్‌హసీనా.. దేశాన్ని వీడి భారత్‌లో తలదాచుకుంటున్నారు. ఈ పరిణామాల నడుమ ఓ కేసు విచారణ సమయంలో భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. నేపాల్, బంగ్లాదేశ్ లోని పరిస్థితులను ఉటంకిస్తూ మన రాజ్యాంగం పట్ల గర్వపడుతున్నట్టు పేర్కొంది. రాష్ట్రాల బిల్లుల ఆమోదంలో న్యాయస్థానం తనకు గడువు నిర్దేశించడంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కోరిన అభిప్రాయం అంశంపై సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ముందు బుధవారం వాదనలు కొనసాగాయి. సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వం లోని ఈ ధర్మాసనం లో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఎఎస్ చందూర్కర్ సభ్యులుగా ఉన్నారు.
ఈ క్రమం లోనే రాజ్యాంగాన్ని ప్రస్తావించిన సీజేఐ జస్టిస్ బిఆర్గవాయ్, ప్రజా ప్రాముఖ్యం కలిగిన లేదా ప్రజలను ప్రభావితం చేసే ఏదైనా చట్టంపై సుప్రీం కోర్టు సలహా కోరే హక్కు రాష్ట్రపతికి ఉందన్నారు. “మన రాజ్యాంగం చూసి గర్విస్తున్నాం. పొరుగుదేశాల్లో ఏం జరుగుతుందో చూడండి. నేపాల్‌లో పరిస్థితి గమనించండి” అని వ్యాఖ్యానించారు. “అవును… బంగ్లాదేశ్ లోనూ ” అంటూ జస్టిస్ విక్రమ్ నాథ్ స్పందించారు. బిల్లులను నెల రోజులకు పైగా రిజర్వ్ చేసే విషయంలో గవర్నర్ల అధికారాలను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమర్ధించారు. అటువంటి కేసులు తక్కువే ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన అన్ని బిల్లుల్లో 90 శాతం బిల్లులకు గవర్నర్ నెలలోపే సమ్మతి తెలుపుతారని చెప్పారు. 1970 నుంచి 2025 వరకు తమిళనాడుకు చెందిన ఏడు బిల్లులు సహా కేవలం 20 బిల్లులు మాత్రమే రిజర్వులో ఉన్నట్టు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.