రాజకీయ నేతలు ఒక పార్టీనుంచి మరో పార్టీకి ఫిరాయించే ఆయారామ్‌గయారామ్ సంస్కృతి మనదేశంలో కొత్తేమీ కాదు. ఈ గోడ దూకుళ్లకు అడ్డుకట్ట వేయడానికి ఫిరాయింపుల నిషేధ చట్టం అమలులో ఉన్నా ప్రయోజనం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన ఎంఎల్‌ఎల వ్యవహారంపై సుప్రీం కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. 2023 నవంబర్‌లో తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గెలిచిన పదిమంది బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు కాంగ్రెస్ లోకి ఫిరాయించడంపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లపై మూడు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు సూచించడం గమనార్హం. రాజ్యాంగం 10 వ షెడ్యూల్ కింద ఫిరాయింపుదార్ల శాసనసభ్యత్వాలను రద్దు చేయాలని కోరుతూ వచ్చిన పిటిషన్లపై నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్‌కు ఉంది. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి సుప్రీం కోర్టు సూచనల ప్రకారం అక్టోబర్ 31లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.
రాజ్యాంగం లోని పదో షెడ్యూల్‌లో పొందుపరిచిన ఫిరాయింపుల నిరోధక చట్టం 1985 లో అమలులోకి వచ్చింది. ఈ చట్టం రాకముందు 1969, 70ల్లో ఎంపిలు, ఎంఎల్‌ఎల ఫిరాయింపులు ఎక్కువగా(MLA defection rates) జరుగుతుండేవి. చట్టం వచ్చినప్పటికీ ఫిరాయింపుల పీడ తొలగిపోలేదు. దీనికి కారణం పదో షెడ్యూల్ ముసాయిదా లోని లొసుగులు చోటు చేసుకోవడమే. ఈ చట్టంలో ఉన్న రెండు మినహాయింపులే ఫిరాయింపులకు పరోక్షంగా వీలు కల్పిస్తున్నాయి. ఒకటి రాజకీయ పార్టీలో చీలికలకు సంబంధించినది కాగా, రెండోది పార్టీల విలీనానికి సంబంధించినది. పార్టీలు, చట్టసభ సభ్యుల మధ్య సైద్ధాంతిక విభేదాలు ఎదురైనప్పుడు ఫిరాయింపుల వంటి మినహాయింపులను ఉపయోగించుకోవచ్చని ఈ చట్టంపై జరిగిన పార్లమెంటరీ చర్చలు స్పష్టం చేస్తున్నాయి. ఇలాంటి మినహాయింపును చాలా మంది తమకు అనుకూలంగా వినియోగించుకుంటున్నారు.
అయితే చీలిక రాజకీయాల వల్ల ప్రభుత్వాలు కూలిపోతుండటంతో 2003లో చీలిక మినహాయింపును తొలగించారు. ఇప్పుడు విలీనానికి సంబంధించిన మినహాయింపు మాత్రం కొనసాగుతోంది. ఈ విలీనం చెల్లుబాటు అయ్యేలా ఆయా సభ్యులు నిరూపించుకోవలసి ఉంటుంది. ఉదాహరణకు 2019లో గోవా శాసనసభలోని మొత్తం 15 మంది కాంగ్రెస్ ఎంఎల్‌ఎలలో పదిమంది బిజెపిలో చేరారు. అది బిజెపి, కాంగ్రెస్ శాసనసభా పక్షాల మధ్య చెల్లుబాటైన విలీనంగా నిలిచింది. ఆ పదిమంది కాంగ్రెస్ సభ్యులనూ గోవా అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటునుంచి మినహాయించారు. ఈ నిర్ణయాన్ని గోవాలోని బాంబే హైకోర్టు ధర్మాసనం కూడా సమర్థించింది. ఫిరాయింపుదార్లపై అనర్హత వేటు పడకుండా అడ్డుకోవడంలో విలీనాలు, చీలికలే కీలకంగా మారుతున్నాయి. మరో ముఖ్యమైన విషయం ఏమంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థులు గెలిచిన తరువాత అధికార పార్టీలోకి ఫిరాయిస్తే వారిపై ఉన్న కేసులన్నీ మాఫీ అవుతాయన్న అపోహలు కూడా ఉన్నాయి.
అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్ విశ్లేషణ ప్రకారం అవినీతి ఆరోపణల పాలైన దాదాపు 25 మంది ప్రఖ్యాత రాజకీయ నేతలు 2014 నుంచి కేసుల్లో ఇరుక్కోవడంతో వారంతా బిజెపిలోకి ఫిరాయించినట్టు వెల్లడైంది. వీరిలో కాంగ్రెస్ నుంచి 10 మంది, ఎన్‌సిపి నుంచి ఒకరు, వైసిపి నుంచి ఒకరు బిజెపిలోకి ఫిరాయించారు. గత లోక్‌సభ ఎన్నికలకు ముందుగానే ఆరుగురు నేతలు బిజెపిలోకి మారిపోవడం విశేషం. ఫిరాయింపుల నిరోధక చట్టంలో స్పీకర్ ఇన్ని రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ఎక్కడా స్పష్టం చేయలేదు. అందువల్ల స్పీకర్ విచక్షణకే ఇది మిగిలిపోతోంది. మహారాష్ట్రలో శివసేన వర్గాల పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం అవుతుండటాన్ని గమనించి చివరకు సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవలసి వచ్చింది. దాంతో స్పీకర్ నిర్ణయం తీసుకోక తప్పలేదు. అధికార పార్టీ శాసనసభ్యులను ప్రలోభపెట్టి చీల్చడానికి ప్రయత్నాలు జరిగినప్పుడు వారిని కాపాడుకోవడం అధికార పార్టీకి అగ్నిపరీక్ష అవుతోంది.
మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. స్వతంత్ర ఎంపిలు, ఎంఎల్‌ఎల విషయంలో మాత్రం ఫిరాయింపుల నిరోధక చట్టం కొంతవరకు పనిచేస్తోంది. స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికలు కాగానే ఏదో ఒక పార్టీలో చేరడం ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేసినట్టే అన్న కారణంపై స్వతంత్ర అభ్యర్థులపై అనర్హత వేటుపడిన సంఘటనలు ఉన్నాయి. 1989 2011 మధ్య హర్యానా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీలోకి చేరిన తొమ్మిది మంది స్వతంత్ర ఎంఎల్‌ఎలపై అనర్హత వేటుపడింది. 19882009 మధ్య మేఘాలయ అసెంబ్లీలో ఐదుగురు స్వతంత్ర ఎంఎల్‌ఎలు రాజకీయ పార్టీలో చేరినందుకు స్పీకర్ అనర్హత వేటువేశారు. 2024 ప్రారంభంలో అఖిల భారత ప్రిసైడింగ్ అధికారుల సదస్సులో ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సమీక్షించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు.
ఇదెంత వరకు ఫలితాలను అందిస్తుందో చూడాలి. ఇప్పటివరకు ఈ చట్టం కోరలు లేనిదిగానే ఉంటోంది. 19862004 మధ్య లోక్‌సభ స్పీకర్ల ముందు 55 అనర్హత పిటిషన్లు దాఖలు కాగా, వాటిలో 49 పిటిషన్లలో ఏ ఒక్క సభ్యుడిపైనా అనర్హత వేటు పడలేదు. వీరంతా ఫిరాయింపుదారులే అయినప్పటికీ, తమ ఫిరాయింపును చెల్లుబాటయ్యేలా రుజువు చేసుకోగలిగారు. ఉత్తరప్రదేశ్‌కు సంబంధించి 19902008 మధ్య 89 పిటిషన్లు దాఖలు కాగా, కేవలం రెండు పిటిషన్ల లోనే అనర్హత వేటుపడింది. మిగతా 67 కేసుల్లో ఎలాంటి చర్యలు లేవు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత ప్రభావంతం చేయడానికి 2003 లో సవరణ జరిగినా పరిస్థితి మారడం లేదు. ఈ నేపథ్యంలో అనర్హత వేటు వేసే పని తమది కాదని, ఈమేరకు పార్లమెంటే పటిష్టమైన చట్టం తీసుకురావాలని సుప్రీం కోర్టు అభిప్రాయం వెలిబుచ్చడం సమంజసమే.