వక్ఫ్ సవరణ చట్టం 2025పై సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ స్వాగతించారు. ఈ చట్టంలోని వివాదాస్పద నిబంధనలపై బిఆర్‌ఎస్ మొదటి నుంచి తన ఆందోళనలను గట్టిగా వినిపించిందని ఆయన పేర్కొన్నారు. ఈ చట్టం ప్రగతిశీలత ముసుగులో దేశంలో విభజన రాజకీయాలకు, మత సామరస్యానికి విఘాతం కలిగించడానికి ప్రయత్నిస్తోందని తాము ఎప్పుడూ చెబుతూనే ఉన్నామని అన్నారు. వక్ఫ్ సవరణ చట్టంలోని సమస్యలపైన తాము పోరాడామని తెలిపారు. ఒక వ్యక్తి ముస్లిం అని ఎవరు నిర్ణయిస్తారు.. ప్రభుత్వ అధికారి ఏకపక్షంగా వక్ఫ్ ఆస్తుల యాజమాన్యాన్ని ఎలా నిర్ణయిస్తారు.. ఇలాంటి అనేక సమస్యలు ఈ చట్టంలో ఉన్నాయి, ఇవి విభజన రాజకీయాలకు ఆజ్యం పోయగలవు అని వ్యాఖ్యానించారు. బిఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడూ దేశంలోని మత సామరస్య వాతావరణాన్ని పరిరక్షించడానికి కృషి చేస్తోందని కెటిఆర్ స్పష్టం చేశారు. రాజకీయాల కన్నా దేశ ఐక్యత ముఖ్యమని తాము విశ్వసిస్తామని తెలిపారు.
Also Read: బండి సంజయ్‌పై పది కోట్ల పరువు నష్టం దావా వేసిన కెటిఆర్
వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా రాజ్యసభలో తమ పార్టీ సభ్యులు పూర్తి శక్తితో పోరాడారని, భవిష్యత్తులో కూడా అవసరమైనప్పుడు దేశ సమగ్రత కోసం పోరాడుతూనే ఉంటామని తెలిపారు. బిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ మైనార్టీల సంక్షేమంలో గొప్ప పురోగతి సాధించిందని గుర్తు చేశారు. కెసిఆర్ పది సంవత్సరాల పాలనలో రాష్ట్రంలో ఒక్క మత ఘర్షణ కూడా జరగలేదని, ఇది తమ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం అని వ్యాఖ్యానించారు. తమ స్వార్థ రాజకీయాల కోసం దేశ మత సామరస్యాన్ని దెబ్బతీయాలని చూసే ఎవరికైనా వ్యతిరేకంగా తాము పోరాడుతామని స్పష్టం చేశారు. బిఆర్‌ఎస్ పార్టీ భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తుందని, దాని విలువలను నిలబెట్టడానికి కృషి చేస్తుందని తెలిపారు.కెసిఆర్ పాలనలో మైనార్టీలు పరిపాలనలో కీలక భాగమయ్యారని, షాదీ ముబారక్, రంజాన్ తోఫా వంటి అనేక మైనార్టీ సంక్షేమ పథకాలను తాము రూపొందించి, అమలు చేశామని పేర్కొన్నారు. ఈ పథకాలు తమ ప్రభుత్వ హయాంలో మైనార్టీలకు ఎంతో లబ్ధి చేకూర్చాయని తెలిపారు.