పశ్చిమ బెంగాల్‌లో కళంకిత ముద్రతో సర్వీసుల నుంచి ఉద్వాసనకు గురైన ఉపాధ్యాయులకు తాత్కాలిక ఊరట దక్కింది. తదుపరి నియామకాల ప్రక్రియ ముగిసే వరకూ ఈ టీచర్లను విధి నిర్వహణలో కొనసాగింపచేయవచ్చునని, ఇందుకు తాము అనుమతిని ఇస్తున్నామని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. పశ్చిమ బెంగాల్‌లో టీచర్ల రిక్రూట్మెంట్ల వ్యవహారంలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. దీని ప్రభావం బాధ్యతల్లో ఉన్న వందలాది మంది టీచర్లపై పడింది. వీరిని ఉద్యోగాల నుంచి తీసివేశారు. 2016లో దాదాపుగా 25,753 మంది టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్‌ను ఉద్యోగాల నుంచి తీసివేస్తూ కలకత్తా హైకోర్టు వెలువరించిన తీర్పును సుప్రీం కోర్టు ఎప్రిల్ 5వ తేదీన సమర్థించింది. పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ ( డబ్లుబిఎస్‌ఎస్‌సి) ఆధ్వర్యంలో టీచర్ల రిక్రూట్మెంట్ జరిగింది. ఇందులో అధికార టిఎంసి నేతల ప్రమేయంతో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు నిర్థారణ అయ్యాయి.
తాజాగా టీచర్ల రిక్రూట్మెంట్ల కోసం ప్రకటనకు సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రిక్రూట్మెంట్ల ప్రక్రియ మార్చి 31 నాటికి పూర్తి కావాలని తెలిపింది. అక్రమ నియామకాలు చెల్లనేరవని, తాజాగా ఉపాధ్యాయుల భర్తీ జరగాల్సిందే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇప్పుడు వెలువరించిన తాజా ఉత్తర్వులలో పాత వారిని తదుపరి ఏర్పాట్లు , నియామకాలు జరిగే వరకూ కొనసాగించవచ్చునని పేర్కొనడం మమత ప్రభుత్వానికి ఉపశమనం కల్పించింది. ప్రధాన న్యాయమూర్తి సంజయ్ ఖన్నాతో కూడిన ధర్మాసనం సంబంధిత వ్యవహారంపై స్పందించింది. నూతన ఎంపిక ప్రక్రియను సవాలు చేస్తూ పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. దీనిపై స్పందించిన ధర్మాసనం దిద్దుబాటు చర్యలను డిసెంబర్ 31 లోగా పూర్తి చేయాల్సి ఉందని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మే 31 నాటికి తాజా నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం ప్రక్రియను ఈ ఏడాది చివరి తేదీ నాటికి ముగించాలని తెలిపింది.
మే 31 నాటికి తాజా రిక్రూట్మెంట్ల ప్రకటన వెలువరించకపోతే తాము తదుపరి ఆదేశాలను వెలువరిస్తామని, జరిమానా కూడా విధిస్తామని ధర్మాసనం హెచ్చరించింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాల్సి ఉంటుంది. అప్పటి రిక్రూట్మెంట్‌లో ఆరోపణలకు అంటే లంచాలు ఇవ్వకుండా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులను ముందుగా గుర్తిస్తారు. వీరిని విధులలో కొనసాగిస్తారు. ఇక అనారోగ్య కారణాలతో ఉన్న వారిని కూడా తీసివేయరాదని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.