భారతదేశంలో వీధి కుక్కల సమస్య ఒక పాత కథ. కానీ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు ఈ సమస్యపై ఒక కొత్త చర్చకు తెరలేపాయి. ఢిల్లీ వీధుల్లో ఒక్క కుక్క కూడా కనిపించకూడదు అని ఢిల్లీ ప్రభుత్వం, మున్సిపాలిటీలకు సుప్రీంకోర్టు విధించిన ఎనిమిది వారాల గడువు ఈ సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందో స్పష్టం చేసింది. పెరుగుతున్న రేబిస్ వ్యాప్తి, కుక్క కాటు కేసులు ఈ కఠిన నిర్ణయానికి కారణమయ్యాయి. ఈ సంక్షోభానికి మూలాలను, రేబిస్ మరణాలను, దీనిని పరిష్కరించడానికి శాస్త్రీయ మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉంది. వీధి కుక్కల సమస్య ఒక సంక్లిష్టమైన, సున్నితమైన అంశం. ఒకవైపు పెరుగుతున్న కుక్క కాటు కేసులు, రేబిస్ మరణాలు ప్రజల్లో భయాందోళనలను పెంచుతుంటే, మరోవైపు జంతు ప్రేమికులు వీధి కుక్కల సంరక్షణ కోసం పోరాడుతున్నారు.
ఈ నేపథ్యంలో కుక్కలను చంపకుండా రేబిస్ను పారదోలే మార్గాన్ని చూడాలి. మనుషుల భద్రత, జంతువుల హక్కులను కాపాడుతూ, రేబిస్ను పూర్తిగా నిర్మూలించడమే మన ముందున్న అసలైన లక్ష్యం కావాలి. వీధి కుక్కల బెడద కేవలం ఢిల్లీ సమస్య కాదు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వీధి కుక్కల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. ఇది కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితం కాలేదు. గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో), వివిధ రాష్ట్ర ప్రభుత్వాల గణాంకాల ప్రకారం చాలా ఆందోళనకరంగా ఉంది. ఒడిశాలో ప్రతి 1,000 మంది జనాభాకు దాదాపు 40 వీధి కుక్కలు ఉన్నా యి.
దీనివల్ల ఆ రాష్ట్రంలో సుమారు 1.8 మిలియన్ల కుక్కలు ఉన్నాయని అంచనా. ఇక్కడ ఏటా 1,000కి పైగా రేబిస్ మరణాలు సంభవిస్తున్నాయి. అలాగే ఉత్తరప్రదేశ్లో ప్రతి 1,000 మందికి 20కి పైగా కుక్కలు ఉండడంతో మొత్తం సంఖ్య సుమారు 4 మిలియన్లకు చేరుకుంది. ఆ రాష్ట్రంలో ఏటా సుమారు 4,300 రేబిస్ మరణాలు సంభవిస్తున్నాయి. హర్యానాలో 0.8 మిలియన్లు, రాజస్థాన్ లో 1.2 మిలియన్ల కుక్కలు ఉన్నాయి. బీహార్లో ప్రతి 1,000 మంది జనాభాకు 18 కుక్కలు ఉండగా, సుమారు 2.1 మిలియన్ల కుక్కలు ఉన్నాయి. ఇక్కడ ఏటా 800కి పైగా మంది చనిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి 1,000 మందికి 15 కుక్కలు ఉండగా, మొత్తం వాటి సంఖ్య 1.6 మిలియన్లు ఉంది. ఇక్కడ సగటున 600కి పైగా రేబిస్ మరణాలు సంభవిస్తున్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో కూడా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. తెలంగాణ, ఢిల్లీ ఎన్ సీఆర్ ప్రాంతాల్లో కూడా వీధి కుక్కల సమస్య తీవ్రంగా ఉంది. తెలంగాణలో ప్రతి 1,000 మందికి 10-12 కుక్కలు ఉండగా, సుమారు 1 మిలియన్ కుక్కలు ఉన్నాయని అంచనా. ఇక్కడ ఏటా 100-150 రేబిస్ మరణాలు నమోదవుతున్నాయి. ఢిల్లీ ఎన్ సీఆర్ లో ప్రతి 1,000 మందికి సుమారు 8 కుక్కలు ఉండగా, అంచనా సంఖ్య 0.8-1 మిలియన్లు. ఇక్కడ ఏటా 50-100 రేబిస్ మరణాలు సంభవిస్తున్నాయి.
ఇతర రాష్ట్రాల్లో కూడా వీధి కుక్కల బెడద అధికంగా ఉంది. అనేక రాష్ట్రాల్లో కుక్కకాటు కేసులు విపరీతంగా పెరిగి, ప్రజల భద్రతకు పెను సవాలుగా మారింది. రేబిస్ వ్యాధి ఒక నిశ్శబ్ద హంతకిలా దేశంలో మరణాలకు కారణమవుతోంది. డబ్ల్యూహెచ్‌వో అంచనాల ప్రకారం భారతదేశంలో ప్రతి సంవత్సరం 18,000 నుంచి 20,000 మంది రేబిస్ కారణంగా చనిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే రేబిస్ మరణాల్లో 36 శాతం భారతదేశంలోనే సంభవిస్తున్నాయి. ప్రభుత్వం అధికారికంగా నమోదు చేసే మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉన్నప్పటికీ, నిపుణుల ప్రకారం ఇది వాస్తవానికి చాలా ఎక్కువగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో సరైన వైద్యం అందక మరణిస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంది. ఇటీవల ఒడిశాలోని గంజాం జిల్లాలో కేవలం రెండు నెలల్లో 15 మంది, ఉత్తరప్రదేశ్లోని ఒక గ్రామంలో ఐదుగురు పిల్లలు రేబిస్ బారినపడి మరణించడం ఈ సమస్య తీవ్రతకు ప్రత్యక్ష నిదర్శనం. ఇలాంటి విషాదాలు దేశంలో చాలా చోట్ల నిత్యం జరుగుతున్నాయి. రేబిస్ వ్యాధి బారిన పడితే మరణం దాదాపు ఖాయం. దీనికి చికిత్స లేదు. అందువల్ల నివారణ ఒక్కటే మార్గం.
ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఎనిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) కార్యక్రమాలు నగరాలకే పరిమితమై, గ్రామీణ ప్రాంతాల్లో సరైన అమలు లేకపోవడం వల్ల కుక్కల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. డబ్ల్యూహెచ్ వో సిఫార్సు చేసిన 70 శాతం కుక్కలకు టీకాలు వేసే లక్ష్యం ఇంకా చాలా దూరంలో ఉంది. దీనివల్ల హర్డ్ ఇమ్యూనిటీ సాధించలేకపోతున్నాం. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో చెత్త నిర్వహణ సరిగా లేకపోవడంతో, కుక్కలకు ఆహారం సులభంగా లభించి వాటి జనాభా మరింత పెరుగుతోంది. గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో రేబిస్ టీకాలు అందుబాటులో లేకపోవడం వల్ల కుక్క కాటుకు గురైన వారికి సకాలంలో వైద్యం అందడం లేదు.
వీధి కుక్కలను చంపడం ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు. దీనికి బదులుగా శాస్త్రీయ, వ్యవస్థీకృత, సుస్థిరమైన విధానాలను అనుసరించాలి.
ఇందుకు తక్షణ, మధ్యకాలిక, దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాలి. తక్షణ చర్యలుగా రాష్ట్రాలవ్యాప్తంగా వీధి కుక్కల సంఖ్యను కచ్చితంగా అంచనా వేసేందుకు పూర్తి స్థాయిలో సర్వే చేయాలి. ప్రతి జిల్లాలోనూ 24/7 కుక్క కాటు, రేబిస్ కేసులు నివేదించడానికి హెల్ప్లైన్ను ఏర్పాటు చేయాలి. కుక్క కాటుకు గురైన వారికి 24 గంటల్లోగా టీకా అందించేలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ (పీఈపీ) సదుపాయాలు కల్పించాలి. మధ్యకాలిక చర్యలుగా క్యాచ్-న్యూటర్-వ్యాక్సినేట్-రిటర్న్ (సీఎన్ వీఆర్) విధానాన్ని తీసుకురావాలి. ఈ విధానం వీధి కుక్కల జనాభాను నియంత్రిస్తుంది. వాటికి టీకాలు వేసి రేబిస్ను అరికడుతుంది. ముంబై, జైపూర్ వంటి నగరాల్లో ఇది విజయవంతమైంది. గోవాలో ‘మిషన్ రేబిస్‘ సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. డబ్ల్యూహెచ్ వో ప్రమాణాల ప్రకారం కనీసం 70 శాతం కుక్కలకు టీకాలు వేయడం ద్వారా హర్డ్ ఇమ్యూనిటీ సాధించవచ్చు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృతమైన డ్రైవ్లు నిర్వహించాలి. గార్బేజ్ మేనేజ్మెంట్ నిర్వహించాలి. వీధి కుక్కలకు ఆహార వనరులు లభించకుండా చెత్తను సక్రమంగా నిర్వహించడం ద్వారా వాటి జనాభా పెరుగుదలను అరికట్టవచ్చు.
హైదరాబాద్లోని జీహెచ్ ఎంసీ ఈ విషయంలో మంచి ఫలితాలు సాధించింది. దీర్ఘకాలిక చర్యలుగా ప్రజా అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేయాలి. పాఠశాలలు, గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు రేబిస్, కుక్కల ప్రవర్తన గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రభుత్వం ప్రతి మున్సిపాలిటీకి స్టెరిలైజేషన్, షెల్టర్ నిర్వహణ, వ్యాక్సినేషన్ కార్యక్రమాల కోసం స్థిరమైన నిధులను కేటాయించాలి. ఏబీసీ రూల్స్-2023 ను పటిష్టంగా అమలు చేయాలి. వీధి కుక్కల సమస్యకు చంపడం ఒక శాశ్వత పరిష్కారం కాదు. మానవ భద్రతను కాపాడుతూ, అదే సమయంలో జంతు హక్కులను రక్షించడం ఈ సమస్యకు సమతౌల్య పరిష్కారంగా ఉంటుంది. సుప్రీంకోర్టు ఆదేశాలు కేవలం ఒక హెచ్చరిక మాత్రమే. దీనిని అనుసరించి శాస్త్రీయమైన, వ్యవస్థీకృత విధానాలను అమలు చేయడం ద్వారానే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు కలిసికట్టుగా పనిచేస్తేనే ఈ సంక్షోభాన్ని అధిగమించగలం.
మేకల ఎల్లయ్య, సీనియర్ జర్నలిస్ట్,
99121 78129