ఢిల్లీ: తెలంగాణలో పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. పిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై గురువారం(జూలై 31న) సుప్రీం కోర్టు తీర్పు వెలువరిస్తూ.. మూడు నెలల్లో ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ఆదేశించింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ గవాయ్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అనర్హతపై సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసిన తర్వాత.. ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారని చెప్పింది. ఏళ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్లను.. పెండింగ్‌లో ఉంచడం సరికాదని పేర్కొంది. విచారణను పొడిగించడానికి ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తే.. స్పీకర్ ప్రతికూల నిర్ణయం తీసుకోవచ్చని సూచించింది. పార్టీ ఫిరాయింపులపై పార్లమెంట్‌లో చట్టం చేయాలని ధర్మాసనం అభిప్రాయపడింది.
కాగా, బిఆర్‌ఎస్ నుంచి గెలుపొందిన గూడెం మహిపాల్ రెడ్డి, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, సంజయ్ కుమార్, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరిలు కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని సుప్రీం కోర్టులో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ను ఆదేశిస్తూ ధర్మాసనం తీర్పు వెల్లడించింది. ఈ వ్యవహారంలో మొదట, బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కెవి వివేకానంద తమ పార్టీ తరఫున ఎన్నికై.. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందిగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు గత ఏడాది నవంబర్ 22న తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాల్సిందిగా స్పీకర్‌కు సూచించింది.