Thursday, September 18, 2025

వారిని జైలుకు పంపండి.. పంట వ్యర్థాల దహనంపై సుప్రీం సీరియస్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఏటా శీతాకాలంలో ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరుతోన్న విషయం తెలిసిందే. అదే సమయంలో పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగులబెట్టడం దీనికి ఓ కారణమనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పంట వ్యర్థాల దహనంపై దాఖలైన పిటిషన్లపై తాజాగా మరోసారి విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీనికి పాల్పడుతున్న కొంతమందిని జైలుకు పంపితేనే మిగతా వారికి గట్టి సందేశం ఇచ్చినట్టు అవుతుందని వ్యాఖ్యానించింది. ఈ అంశంపై అమికస్ క్యూరీ అపరాజిత సింగ్ మాట్లాడుతూ పంట వ్యర్థాలను తగలబెట్టకుండా ఉండేందుకు రైతులకు సబ్సిడీలు, వివిధ పరికరాలు అందిస్తున్నట్టు తెలిపారు. అయినప్పటికీ ఉపగ్రహాలు ఆయా ప్రాంతాల మీదుగా వెళ్లే సమయంలో కాకుండా మిగిలిన సమయాల్లో పంట వ్యర్థాలను కాల్చుకోవచ్చని అధికారులు తమకు చెప్పారనే కథనే రైతులు మళ్లీమళ్లీ చెప్తున్నారని న్యాయస్థానానికి వెల్లడించారు. దీనిపై ఎన్నిసార్లు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ఫలితం లేదని పేర్కొన్నారు.

ఈ సమస్యను పరిష్కరించడానికి అధికారులు రైతులకు శిక్ష, జరిమానా విధించాలనే కోణంలో ఎందుకు ఆలోచించట్లేదని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. రైతులు మనకు అన్నం పెడుతున్నారు కాబట్టి వారు ప్రత్యేకమైనవారని, అలా అని పర్యావరణాన్ని పాడు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేం కదా అని ప్రశ్నించింది. కొంతమందిని జైలుకు పంపితేనే మిగతా వారికి గట్టి సందేశం ఇచ్చినట్టు అవుతుందని తెలిపింది. పర్యావరణాన్ని కాపాడాలనే నిజమైన ఉద్దేశం మీకు ఉంటే ఇటువంటి చర్యలకు ఎందుకు దూరంగా ఉంటారని అధికారులను ప్రశ్నించింది. కొన్ని రాష్ట్రాల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డుల్లో ఖాళీలు ఉండటంపై న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో శీతాకాలంలో గాలి నాణ్యత దారుణంగా పడిపోతుంది. దీనికి పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాల్లో పంట వ్యర్థాల దహనమే ప్రధాన కారణంగా మారుతోంది. దీనిపై కొంతకాలంగా సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News