తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో అసెంబ్లీ సీట్లు పెంచేందుకు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ నిర్వహించేలా కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించాలని దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు శుక్రవారంనాడు తిరస్కరించింది. జస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్ తో పోలిస్తే, రాష్ట్రాలలో డీలిమిటేషన్ కు సంబంధించిన నిబంధనలు భిన్నంగా ఉన్నాయనే వాదనను కూడా ధర్మాసనం తిరస్కరించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26ను అమలు చేసేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కె. పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈ తీర్పు ప్రకటించింది. ఈ సందర్భంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పాలన విషయంలో గల తేడాను కూడా ధర్మాసనం ప్రస్తావించింది.జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం జమ్మూ కశ్మీర్ ను కేంద్రపాలిత ప్రాంతంగా తిరిగి ఏర్పాటు చేయడం వల్ల రాజ్యాంగంలోని 7వ భాగంలోని 3వ అధ్యాయంలోని
నిబంధనలు వర్తించబోవని జస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో మాత్రమే డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను మినహాయించడం రాజ్యాంగ విరుద్ధమన్న వాదనను కూడా కోర్టు తిరస్కరించింది. రాజ్యాంగం ఆర్టికల్ 170(3) ప్రకారం డీలిమిటేషన్ కోసం వచ్చిన పిటిషన్ ను స్వీకరించడానికి వీలు లేదని కోర్టు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ చట్టం లోని సెక్షన్ 25 డీలిమిటేషన్ కు సంబంధించిన రాజ్యాంగం ఆర్టికల్ 170కి లోబడి ఉందని, దీని ప్రకారం 2026 లో చేపట్టనున్న జనాభా లెక్కల షెడ్యూల్ గణాంకాలను ప్రచురించిన తర్వాత మాత్రమే డీలిమిటేషన్ నిర్వహించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.అంతకు ముందు విచారణ సందర్భంగా పిటిషనర్ తరుపు న్యాయవాది తన వాదనలను వినిపిస్తూ, ఏపీ, తెలంగాణాలను మినహాయించి, కొత్తగా ఏర్పడిన జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోనే అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజకవర్గాల డీలిమిటేషన్ చేపట్టడం అసమంజసం, రాజ్యంగ విరుద్ధమని పేర్కొన్నారు.
జమ్మూ కశ్మీర్ కోసం చేపట్టిన డీలిమిటేషన్ ప్రక్రియను ప్రస్తావిస్తూ, ఆంధ్రప్రదేశ్ పునరవ్యవస్థీకరణ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత నియమింపబడిన ఏకైక కమిషన్ ఈ డీలిమిటేషన్ కమి,షన్ అని పిటిషనర్ తరుపు న్యాయవాది వాదించారు. ఈ సందర్భంలో సుప్రీంకోర్టు జస్టిస్ జోక్యం చేసుకుంటూ, కేంద్రం ఎప్పుడు డీలిమిటేషన్ చట్టం చేసినా అది అన్ని రాష్ట్రాలకు ఒకే విధంగా వర్తింపజేయాలన్నది మీ ఉద్దేశ్యమా అని న్యాయవాదిని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తరుపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ కె.ఎం. నటరాజ్ తన వాదనలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26ను ఎత్తిచూపారు. ఈ రాష్ట్రాలు డీలిమిటేషన్ ప్రక్రియకోసం 2026 జనాభా లెక్కలవరకూ వేచి ఉండవలసిందేనని పేర్కొన్నారు. డీలిమిటేషన్ అనేది పెద్దఎత్తున చేపట్టవలసిన కసరత్తు అనీ, రాత్రికి రాత్రే దీనిని చేపట్టలేమని నాగరాజ్ వాదించారు.