రాజ్యాంగబద్ధ సంస్థ నిబంధనలు పాటించిందనే భావిస్తున్నాం
7న తుది వాదనలు వింటాం, ఆ తర్వాత తీర్పు
దేశ వ్యాప్తంగా నిలుపదల చేయలేం
బీహార్ ఓటరు జాబితా సమగ్ర సవరణపై సుప్రీం వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : బీహార్ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు ఎన్నికల కమిషన్ అనుసరించిన పద్ధతిలో ఏదైనా చట్టవిరుద్ధంగా కనిపిస్తే మొత్తం ‘ఎస్‌ఐఆర్’ను రద్దు చేస్తామని సుప్రీం కోర్టు ఎన్నికల కమిషన్‌ను సోమవారం హెచ్చరించింది. అయితే రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణలో సరైన నిబంధనలను పాటించిందని భావిస్తున్నట్టు పేర్కొంది. బీహార్‌లో ఈసీ చేపట్టిన ఓటరు జాబితా సర్వేకు వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యాన్ని విచారించిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్‌జోయ్ మాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
ప్రస్తుతం ఈ విషయంపై తాము అసంపూర్తి అభిప్రాయాలు వెల్లడించలేమని, అక్టోబర్ 7న తుది వాదనలు విన్న తరువాత తీర్పును వెలువరిస్తామని, బీహార్ ఎస్‌ఐఆర్‌పై తమ తీర్పు పాన్‌ఇండియా ఎస్‌ఐఆర్‌కు వర్తిస్తుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దేశం మొత్తం మీద నిర్వహించే ఇలాంటి కసరత్తును తాము ఆపబోమని కోర్టు స్పష్టం చేసింది. సెప్టెంబర్ 30 న ప్రచురించిన ఓటర్ల తుది జాబితాకు ఈ కేసు విచారణకు ఎటువంటి తేడా ఉండదని వివరించింది. తేడా ఏమిటంటే అందులో ఏవైనా అక్రమాలు జరిగాయని తాము సంతృప్తి చెందితే ఈ ప్రక్రియను పక్కన పెడతామని పేర్కొంది. బీహార్ ఎస్‌ఐఆర్ ప్రక్రియలో 12వ గుర్తింపు పత్రంగా ఆధార్‌ను చేర్చాలంటూ సెప్టెంబర్ 8న ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన ఉత్తర్వులను సవరించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.
ఈసీ, వివిధ రాజకీయ పార్టీల తరపున వాదనలు…
ఎలక్షన్ కమిషన్ తరుఫున విచారణకు హాజరైన సీనియర్ అడ్వకేట్ రాకేష్ ద్వివేది ఎస్‌ఐఆర్ ప్రక్రియ తుది సమీక్ష పూర్తయ్యేవరకు విచారణను వాయిదా వేయాలని కోర్టును అభ్యర్థించారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్ (ఎడిఆర్) అనే ఎన్‌జివొ తరఫున హాజరైన సీనియర్ అడ్వకేట్ గోపాల్ శంకర్‌నారాయణన్ ఇతర రాష్ట్రాల్లోనూ ఎస్‌ఐఆర్ నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ సన్నాహాలు చేస్తోందని, ఈ ప్రక్రియ లోని చట్టపరమైన అంశాన్ని కోర్టు దృష్టికి తెస్తున్నామని, రాజ్యాంగ పథకం యొక్క వక్రీకరణ కనిపిస్తే ఇది కొనసాగకూడదని తాము ఒత్తిడి తెస్తామని పేర్కొన్నారు. ఉన్న ఫలంగా అమలు లోకి వచ్చిన ఈ నిర్ణయం ఇతర రాష్ట్రాల్లో కొనసాగకూడదన్నారు. దీనికి ధర్మాసనం ఎన్నికల కమిషన్ ఎస్‌ఐఆర్ ప్రక్రియ నిర్వహణను తాము ఆపలేమని స్పష్టం చేసింది. కాంగ్రెస్ సహా వివిధ రాజకీయ పార్టీల తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వీ వాదన వినిపించారు. దేశం మొత్తం మీద ఎస్‌సిఆర్ నిర్వహిస్తామని ఎన్నికల కమిషన్ ప్రకటించినందున వీలైనంత త్వరలో ఈ విచారణ చేపట్టాని అభ్యర్థించారు.
అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ వాదన వినిపిస్తూ నిబంధనలను ఈసీ ఉల్లంఘిస్తోందని, తన మాన్యువల్ కూడా పాటించడం లేదని ఆరోపించారు. కమిషన్ 30 శాతం అభ్యంతరాలను, చేర్పులకు అభ్యర్థనలను మాత్రమే అప్‌లోడ్ చేసిందని, నిబంధనలను పాటించకుండా కోర్టు ఉత్తర్వులను మాత్రమే అనుసరిస్తోందన్నారు. అడ్వకేట్ అశ్వినీ ఉపాధ్యాయ్ సెప్టెంబర్ 8 నాటి ఉత్తర్వును గుర్తు చేస్తూ ఇంటర్‌లాక్యుటరీ దరఖాస్తును సమర్పించానని కోర్టుకు విన్నవించారు. బీహార్ సమగ్ర ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్)లో ఆధార్‌ను కూడా కచ్చితంగా గుర్తింపు కార్డుగా పరిగణించాలని ఇటీవల సుప్రీం కోర్టు ఎన్నికల కమిషన్‌కు మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ముందస్తు సూచనలు ఉన్నప్పటికీ ఎన్నికల అధికారులు ఆధార్‌ను గుర్తింపు కార్డుగా అంగీకరించడానికి నిరాకరిస్తున్నారని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో న్యాయస్థానం ఎన్నికల కమిషన్ చూపిస్తున్న అభ్యంతరాలను తోసిపుచ్చింది.
Also Read: అంతా నివ్వెరపోయేలా భారత్ ఆర్థిక వృద్ధి: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్