Sunday, August 24, 2025

అధికార లాంఛనాలతో సురవరం అంతిమ యాత్ర

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదారాబాద్: కమ్యూనిస్టు దిగ్గజం, మాజీ ఎంపి సురవరం సుధాకర్ రెడ్డి అంతిమ యాత్ర ఆదివారం ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ముగిసింది. పార్టీలకతీతంగా రాజకీయ ప్రముఖులు, వేలాది మంది కార్యకర్తలు ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్ నుంచి పోలీసు బ్యాండ్ వాయిద్యాల నడుమ సాగిన అంతిమ యాత్ర గాంధీ మెడికల్ కాలేజీకి చేరుకుంది. అనంతరం సురవరం భౌతికకాయాన్ని గాంధీ మెడికల్ కళాశాలకు ఆయన కుటుంబ సభ్యులు అప్పగించి ఆదర్శంగా నిలిచారు.

సికిందరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రివద్దకు అంతిమ యాత్ర చేరుకున్నాక పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి గన్ సెల్యూట్ సమర్పించారు. అనంతరం రెండు నిముషాలు మౌనం పాటించి గౌరవ వందనం సమర్పించారు. అంతిమ యాత్ర పొడవునా కామ్రేడ్ సురవం సుధాకర్ రెడ్డి అమర్ రహే, అంటూ సిపిఐ కార్యకర్తలు, నాయకులు నినాదాలు చేశారు. పూలతో అలంకరించిన వాహనంపై ఉంచిన ఆయన పార్థివదేహానికి లాల్ సలాంచెబుతూ నివాళులర్పించారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు, అభిమానులు, సిపిఐ కార్యకర్తలు, నాయకులు దారి పొడవునా అశ్రునయనాల మధ్య అంతిమ యాత్ర కొనసాగింది.

యాత్రలో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. రెడ్ ఆర్మీతో ఘనంగా వీడ్కోలు పలికారు. ఎర్రజెండాల కవాతు నిర్వహించారు. గత కొంత కాలంగా అనారోగ్యంగో బాధపడుతున్న సురవరం సుధాకర్ రెడ్డి శుక్రవారం రాత్రి గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన భౌతిక కాయాన్ని ఆదివారం ఉదయం 9 గం.లకు ప్రజల సందర్శనార్థం మఖ్తూంభవన్‌కు తరలించారు. మధ్యాహ్నం 3 గం.ల వరకు మఖ్దూం భవన్‌లో పార్టీ శ్రేణులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రముఖులు నివాళులర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News