Saturday, August 30, 2025

సురవరం సేవలు చిరస్మరణీయం

- Advertisement -
- Advertisement -

‘భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్దది. దేశానికి, దేశ ప్రజలకు అంబేద్కర్ ఇచ్చిన విలువైన బహుమతి ఇది. మతం, కులం, భాషలతో సంబంధం లేకుండా, ప్రజలందరికీ లౌకిక తత్వం, ప్రజాస్వామ్యం, సమానత్వాలను ప్రసాదించింది. ఒక సవరణ ద్వారా సోషలిజం అనే భావాన్ని చేర్చి రాజ్యాంగానికి పరిపూర్తిని అందించారు. మన రాజ్యాంగం భావస్వేచ్ఛ, జీవించే హక్కులతోపాటు అంటరానితనాన్ని రద్దు చేసింది. ఆ విధంగా మనిషికి ఒక సంపూర్ణ స్వేచ్ఛను రాజ్యాంగం అందించింది’ అంటూ 2017, ఫిబ్రవరిలో భారత భారత కమ్యూనిస్టు పార్టీ ఒకనాటి సుప్రీం సురవరం సుధాకర్ రెడ్డి రాజ్యాంగం ఔన్నత్యాన్ని కొనియాడారు. అంటే దాదాపు 8 సంవత్సరాల క్రితమే ఆయన రాజ్యాంగం రక్షణ గురించిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

అదే వ్యాసాన్ని ముగిస్తూ ‘సంఘ్ పరివార్ శక్తులు భారత రాజ్యాంగాన్ని లక్షంగా చేసుకొని పని చేస్తున్నాయి. దాని స్థానంలో మనుధర్మాన్ని నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నాయి. అయితే. భారత రాజ్యాంగాన్ని ప్రజలు సృష్టించుకున్నారు. ప్రజలే దానిని పరిరక్షించుకోవాలి. దానికి కమ్యూనిస్టులుగా మనం సర్వశక్తులు ఒడ్డి పోరాడాలి” అంటూ కర్తవ్య బోధ చేశారు. సురవరం సుధాకర్‌రెడ్డి 82 సంవత్సరాలు సంపూర్ణంగా జీవించి, గత వారం రోజుల క్రితం భౌతికంగా మన నుంచి దూరమయ్యారు. ఆయన జీవితాన్ని ప్రజలకే అంకితం చేసిన సురవరం తన భౌతిక కాయాన్ని అగ్నికో, భూమికో వృథాగా అర్పించకుండా, పరిశోధనల నిమిత్తం వైద్యశాలకు అప్పగించి, అందులో కూడా ఒక ప్రయోజనాన్ని మనందరికీ చూపించారు.

సురవరం సుధాకర్ రెడ్డి ఒక అరుదైన కమ్యూనిస్టు నేత. ఒక సాధారణ విద్యార్థి కార్యకర్తనుంచి పార్టీ అత్యున్నత పదవి ప్రధాన కార్యదర్శి దాకా అన్ని పదవులను సమర్థవంతంగా నిర్వహించిన ఘనత దక్కించుకున్నవారు. ఇది కొందరికి మాత్రమే సాధ్యం. అటువంటి ఒక అరుదైన వ్యక్తి సురవరం. విద్యార్థి, యువజన, రైతు, కార్మిక నాయకుడుగా, పౌరహక్కుల కార్యకర్తగా ఎన్నోబాధ్యతలను మోసినవాడు. అంచెలంచెలుగా ఒక మెట్టు పైనుంచి మరొక మెట్టుకు సమర్థవంతంగా పయనించినవాడు. లోక్‌సభకు 1998, 2004 సంవత్సరాల్లో రెండు సార్లు ఎన్నికై అక్కడ కూడా తన ముద్రను బలంగా వేసినవాడు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ ప్రాంతంలోని కొండ్రావుపల్లిలో 1942, మార్చి 25వ తేదీన జన్మించిన సురవరం బాల్యం నుంచే ఉద్యమ భావాలను అందిపుచ్చుకున్నారు.

అతని తండ్రి వెంకట్రామిరెడ్డి నిజాం వ్యతిరేక పోరాటంలో, తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు.ఆ వారసత్వాన్ని ఆయన తన నరనరాన జీర్ణించుకున్నారు. హైస్కూల్‌లో ఆయన ఆరంభించిన ఉద్యమ ప్రస్థానం చివరి శ్వాస వరకు కొనసాగింది. ఇది కూడా సురవరం ఉద్యమ జీవితానికి లభించిన అరుదైన గౌరవం. 1942లో జన్మించిన సురవరం తెలంగాణలోని అన్ని రకాల ప్రజాఉద్యమాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వామి అయ్యారు. తెలంగాణ సాయుధ పోరాటం సమయంలో పసివాడుగా ఉన్నప్పటికీ ఆ ఛాయలు ఆయన మనసులో ముద్ర వేసుకున్నాయి. దానికి నాటి ఆయన చదువు. ఉస్మానియాలో న్యాయశాస్త్ర విద్యను చదవడం యాదృచ్ఛికం కాదు. రాజకీయ జీవితాన్ని తన ఆశయంగా ఎంచుకున్న వాళ్లందరూ న్యాయశాస్త్ర విద్యను ఎంచుకోవడం ఆనాడు ఒక అనుభవం.

ఆ తర్వాత ఆయన తన భవిష్యత్ ప్రయాణాన్ని నిర్ణయించుకొని వెనుకడుగు వేయకుండా, పెడదారిలోకి వెళ్లకుండా ఒక ఆదర్శవంతమైన కమ్యూనిస్టుగా బతికారు. అదే సమయంలో ఆయన రాజకీయ, ఆర్థిక, సామాజిక విషయాల్లో ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను చాలా శక్తివంతంగా వెల్లడించారు. ముఖ్యంగా రాజకీయ పార్టీల స్వభావాన్ని నిర్మొహమాటంగా బయటపెట్టారు. ఒకవైపు భారతీయ జనతా పార్టీ సైద్ధాంతిక తిరోగమన విధానాలను ఎండగడుతూనే, రెండో వైపు కాంగ్రెస్ చేసిన, చేస్తున్న తప్పులను కూడా అదే స్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ విధానాలు ఏ విధంగా భారతీయ జనతా పార్టీ బలం పెంచుకోవడానికి ఉపయోగపడుతాయని ముందు హెచ్చరించిన రాజనీతిజ్ఞుడు. 2013లో ఢిల్లీలో జరిగిన ఎన్నికల అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పరిస్థితికి అద్దం పట్టాయి.

‘కాంగ్రెస్‌లో ఒక చిన్న గ్రూపు ప్రభుత్వ విధానాలను, కాంగ్రెస్ పార్టీని శాసిస్తున్నది. కాంగ్రెస్ నాయకత్వం ప్రజలనుండి దూరం కావడం జరిగింది. ఇలాంటి పెద్ద తప్పులను గుర్తించడంలో కాంగ్రెస్ అధినాయకత్వం విఫలమవుతున్నది. ఇది నరేంద్ర మోడీ బలపడడానికి ఉపయోగపడుతున్నది’ అంటూ 2013 డిసెంబర్ 22వ తేదీన సురవరం చేసిన హెచ్చరిక. అంతేకాకుండా ఆయన రాజనీతికి కూడా నిదర్శనం. ఆయన లోక్‌సభ సభ్యుడిగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. సిపిఎం పార్టీ తెలంగాణ ఉద్యమానికి దూరంగా ఉంటున్న సమయంలో సిపిఐ పార్టీ తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నిలబెట్టడం మాత్రమే కాకుండా, ఒక ఉద్యమ నిర్మాణానికి తన నాయకత్వం అందించిన వాడు సురవరం.అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు జులై 24, 2013 న ఒక లేఖ రాస్తూ, ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇంకా వాయిదా వేయకూడదు. ఇప్పటికి కాంగ్రెస్ పార్టీ ఉద్దేశాల పట్ల ప్రజలకు అనుమానాలున్నాయి.

ఈసారి ప్రజలకు ద్రోహం చేస్తే మీపట్ల విశ్వాసం పోయింది. అలా జరిగితే ఉద్యమం మరింత సమర శీలంగాముందుకొస్తుంది. దానిని అణచడం కష్టం. కాబట్టి దయచేసి వేగంగా సానుకూల నిర్ణయం తీసుకోండి’ అంటూ హెచ్చరించారు. అంతేకాకుండా ఒకవేళ తెలంగాణ ఇస్తే ఎటువంటి తెలంగాణ ఇవ్వాలనే చర్చలు కూడా ఆ సమయంలో జరుగుతున్నాయి. దానికి ఆయన చాలా స్పష్టంగా, తెలంగాణ ఉద్యమ ఆలోచనలను, ప్రజల అభిప్రాయాలను ఈ లేఖలో బలంగా వినిపించారు.‘ఇప్పటికే కొన్ని గందరగోళ ప్రతిపాదనలున్నాయి. ఈ అంశాలపై స్పష్టత ఇవ్వాలి. హైదరాబాద్ నగరం రాజధానిగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలి. హైదరాబాద్ లేకుండా తెలంగాణ రాష్ట్ర ప్రసక్తే లేదు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలనే ఆలోచనను విరమించుకోవాలి.

అదే విధంగా, రాయల తెలంగాణ ప్రతిపాదనకు అవకాశమివ్వకండి’ అంటూ చాలా నిస్సంకోచంగా ప్రజల గొంతుకగా వినిపించారు సురవరం. ఇట్లా ఎన్నో విషయాలను ప్రస్తావించవచ్చు. ఆయన ఆ అంశం వచ్చిన ప్రతిచోట కమ్యూనిస్టుల ఐక్యత అనే అంశాన్ని చాలా బలంగా ప్రతిపాదించారు. దానిని చాలా స్పష్టంగా ప్రకటించారు. కమ్యూనిస్టు పార్టీల ఐక్యతను బలంగా కాంక్షించిన వాళ్లలో సురవరం ఒకరు. ‘ప్రజల ఆకాంక్ష అయిన కమ్యూనిస్టుల ఐక్యత న్యాయమైనది. పార్టీ చీలికకు కారణాలు వెతకడం అప్రస్తుతం. పార్టీ కార్యక్రమాల్లో, ఎత్తుగడలలో కొన్ని తారతమ్యాలున్న మాట వాస్తవం. వాటిని పరిష్కరించవచ్చు. ఈ సందర్భంలో కమ్యూనిస్టులు స్పందించకపోతే చరిత్ర క్షమించదు.

ఉద్యమాలలో, పోరాటాలలో వామపక్ష ఐక్యత కమ్యూనిస్టు ఉద్యమ పునరేకీకరణకు మార్గం సుగమమవుతుంది. సిపిఐ ఈ అంశాన్ని దృఢంగా విశ్వసిస్తోంది’ అంటూ తన వ్యక్తిగత అభిప్రాయాన్ని, పార్టీ నిర్ణయాన్ని బలంగా వినిపించారు. భారత కమ్యూనిస్టు పార్టీ తొంభై వసంతాల సందర్భంగా డిసెంబర్, 25, 2016లో రాసిన వ్యాసంలోని అంశం ఇది. అట్లా అనేక సార్లు సురవరం ఈ ప్రతిపాదన చేశారు. అదే విధంగా సురవరంలో ఉన్న మరొక ప్రజాస్వామిక స్వభావం వ్యక్తిగా నన్ను ఎంతో ప్రభావితం చేసింది. ఇక్కడ క్లుప్తంగా మరో సంఘటనను వివరించి ముగిస్తారు. బాబా సాహెబ్ అంబేద్కర్ పట్ల రాతల్లో కాకుండా చేతల్లో కూడా ఆయన గౌరవాన్ని చాటుకున్న వ్యక్తి సురవరం. బాబాసాహెబ్ అరుదైన ఫోటోలతో ఒక పుస్తకం ముంబైలో అచ్చయింది. అది నా దృష్టికి వచ్చినప్పుడు, ఒక సందర్భంలో ఈ విషయాన్ని ప్రస్తావించి దీనిని తెలుగులో తీసుకొస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను.

దానికి వెంటనే స్పందించి అతిపెద్ద పుస్తకాన్ని తెలుగులో విశాలాంధ్ర పబ్లికేషన్‌గా తీసుకు రావడంలో ఆయన చొరవను మరువలేం. అదే విధంగా ఆయన లోక్‌సభ సభ్యునిగా ఉన్న సమయంలో హెచ్‌ఎంటివి శాటిలైట్ పర్మిషన్ కోసం ఆయన చేసిన కృషిని మరువలేం. ఆ సమయంలోనే ఆయన టేబుల్ మీద ‘రి బిల్డింగ్ ది లెఫ్ట్’ అనే పుస్తకాన్ని చూశాను. దాని రచయిత మార్త్తా హర్నెకర్ ఆమె లాటిన్ అమెరికాలోని ఒక గొప్ప మార్కిస్టు తత్వవేత్త. దానిని తీసుకొని చదివాను. అది నన్ను ఎంతో ప్రభావితం చేసింది. దానిని తెలుగులో అనువదించి ప్రచురించాం కూడా. ఆ తర్వాత హర్నెకర్‌ను రెండు సార్లు హైదరాబాద్ పిలిచాం. ముఖ్యంగా ఇంకొక విషయాన్ని చెప్పాలి. చలపతి, విజయ వర్ధన్ అనే ఇద్దరు దళిత యువకులకు చిలుకలూరిపేట బస్సు దహనం కేసులో ఉరిశిక్ష పడింది.

వాళ్లకు ఉరిశిక్ష రద్దు చేయాలని ఉద్యమం కొనసాగింది. చివరకు ఉద్యమం వల్ల, ఇతర రకరకాల ప్రయత్నాల వల్ల వాళ్లకు ఉరిశిక్ష రద్దయి, యావజ్జీవ శిక్ష ఖరారు అయింది. ఆ ఉద్యమంలో నేను ఒక భాగస్వామిని. అయితే అప్పుడు ఇంద్రజిత్ గుప్తా హోం శాఖ మంత్రి. ఇంద్రజిత్ గుప్తా సిపిఐ అగ్రనాయకుడు. ఆ ఉరిశిక్ష రద్దు రాష్ట్రపతి పరిధిలోని అంశమైనప్పటికీ దానిని హోం మంత్రిత్వ శాఖ అభిప్రాయం తప్పనిసరి. దానితోపాటు మంత్రిమండలి ఆమోదం కూడా కావాలి. అందుకు గాను నేను స్వయంగా సురవరం సుధాకర్ రెడ్డిని కలిసి, దీనికి తన సాయం కావాలని అడిగాను. దానికి ఆయన స్పందించి, పార్టీలో చర్చించి, ఇంద్రజిత్ గుప్తాను ఈ విషయమై ఒప్పించారు. అట్లా రెండు ప్రాణాలను నిలబెట్టిన సంఘటనలో అత్యంత కీలకమైన వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి. ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో అనుభవాలు, అన్నింటికీ మించి ఆయన చిరునవ్వు నన్ను, ఆయన నుంచి దూరం కానివ్వడం లేదు.

Also Read : నేటి నుంచి అసెంబ్లీ

  • మల్లేపల్లి లక్ష్మయ్య (దర్పణం)
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News