ఆయనను శాశ్వతంగా గుర్తుంచుకునేలా త్వరలో సముచిత నిర్ణయం
సిద్ధాంతపరమైన రాజకీయాలే శ్వాసగా జీవిస్తున్న వారికి సురవరం మరణం తీరని లోటు
సిఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు
మఖ్దూం భవన్లో కమ్యూనిస్టు నేతకు నివాళి
తరలివచ్చిన వివిధ పార్టీల నేతలు, ప్రముఖులు
మన తెలంగాణ/హైదరాబాద్: నమ్మిన సిద్ధాంతా ల కోసం జీవితాంతం విలువలతో కూడిన రాజకీయాలతో అత్యున్నత స్థాయికి ఎదిగిన సురవరం సుధాకర్‌రెడ్డి జ్ఞాపకార్థం ప్రభుత్వం ఏదైనా మంచి కార్యక్రమం చేపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆయనను శాశ్వతంగా గుర్తుంచుకునే విధంగా మంత్రివర్గంలో చర్చించి సముచితమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సురవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం మఖ్దూం భవన్లో నివాళులర్పించారు. సిఎంతో పాటు ఎంపి సిఎం చంద్రబాబునాయుడు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, వామపక్ష పార్టీల నేతలు, కాంగ్రెస్ నేతలు పార్టీలకతీతకంగా ఎంఎల్ఎలు, ఎంపీలు, రాజకీయ ప్రముఖులు, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. సురవరం సమాజానికి చేసిన సేవలను కొనియాడారు. సురవరం సుధాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభు త్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. సిపిఐ నేతలు డి.రాజా, కె.నారాయణ, కూనంనేని సాంబశివరావు, అజీజ్ పాషాతో పాటు అనేకమంది నాయకులతో సురవరం సేవలను స్మరించుకున్నారు.
విలువలతో కూడిన సిద్ధాంత నిబద్ధత కలిగిన నాయకుల విషయంలో ప్రభుత్వానికి సంపూర్ణంగా సానుభూతి ఉందని, అందుకే కొండా లక్ష్మణ్ బాపూజీ గౌరవార్థం ఇనిస్టిట్యూట్ ఆఫ్ హాండ్లూమ్ టెక్నాలజీకి ఆయన పేరును పెట్టుకున్నామని, మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరును, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జైపాల్ రెడ్డి పేరు, ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరును చిరస్థాయిగా గుర్తుంచుకునేలా అనేక విధాలుగా గౌరవించుకున్నామని ముఖ్యమంత్రి అన్నారు. సురవరం సుధాకర్ రెడ్డి మరణం నిరుపేదలకు, బహుజనులకు, సిద్ధాంతపరమైన రాజకీయాలను శ్వాసగా నడుస్తున్న ప్రతి ఒక్కరికీ తీరని లోటని ముఖ్యమంత్రి అన్నారు. ఎఐఎస్ఎఫ్ నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినా, ఏనాడూ అహంకారం, అహంభావం తన దరిదాపుల్లోకి రానీయలేదని. పాలమూరు బిడ్డగా బూర్గుల రామకృష్ణ రావు, జైపాల్ రెడ్డి కోవలో సురవరం జిల్లాకు ఎంతో వన్నె తెచ్చారని కొనియాడారు.
హైదరాబాద్ రాష్ట్ర విముక్తి పోరాటంలో పత్రికా సంపాదకుడిగా ఎనలేని సేవలందించిన సురవరం ప్రతాప రెడ్డి పేరును తెలుగు విశ్వవిద్యాలయానికి పెట్టాలని శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావుతో లేఖ పింపితే ఏమా త్రం ఆలస్యం చేయకుండా ఆయన సూచన మేర కు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప రెడ్డి పేరు పెట్టినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడిని వ్యక్తిగతంగా కలిసి మాట్లాడుతానని ఆరోజు చెప్పానని, అయితే ఈ రకంగా కలుసుకోవలసి వస్తుందని ఊహించలేదని సిఎం అన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా, ప్రజాప్రతినిధిగా ఉన్నా లేకున్నా వారెప్పుడూ సిద్ధాంతాన్ని వదల్లేదన్నారు. కాంగ్రెస్ సమావేశంలోనూ ఆయ న సేవలను స్మరించుకుని ఘనంగా నివాళులర్పించినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే సంతాప సందేశాన్ని పంపించారని, ప్రభుత్వ పక్షాన సురవరం కుటుంబానికి అన్ని రకాలుగా అండగా నిలుస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.
ప్రజాస్వామ్య పరిరక్షణకు సురవరం పోరాడారు : ఎపి సిఎం చంద్రబాబు
ప్రజాస్వామ్య పరిరక్షణకు సిపిఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి పోరాడారని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సురవరం దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. మఖ్దూం భవన్లో సుధాకర్‌రెడ్డి పార్థివ దేహానికి చంద్రబాబు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డితో ఉన్న రాజకీయ సంబంధాలను గురించి నేతలతో పంచుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. సుధాకర్ రెడ్డితో కలిసి ఎన్నో రాజకీయ పోరాటాలు చేశామ ని, ఎంఎల్ఎగా, ఎంపీగా ప్రజలకు సేవలందించారని కొనియాడారు. సుధాకర్ రెడ్డి చనిపోయినా పోరాట వారసత్వాన్ని మనకు ఇచ్చిపోయారని, సుధాకర్ రెడ్డి మరణం సిపిఐతో పాటు, తెలుగు వారికి తీరని లోటని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని అన్నారు.
సువరం యువతకు ఆదర్శం: భట్టి
సిపిఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేశానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నివాళులర్పించారు. ఆదివారం మధ్యాహ్నం మఖ్దూంభవన్‌కు వెళ్లిన భట్టి విక్రమార్క సుధాకర్ రెడ్డికు టుంబ సభ్యులను పరామర్శించారు. ప్రజల కోసం సుధాకర్ రెడ్డి చేసిన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. మనం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయామన్నారు. సురవరం జీవితం నేటి యువతకు ఆదర్శమని ఆయన చెప్పారు. సురవరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెలంగాణ సిపిఐ మద్దతులో సురవరం పాత్ర : కెటిఆర్
సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక కాయానికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం మఖ్దూంభవన్‌కు బిఆర్ఎ స్ నేతలు తలసాని శ్రీనివాస్ రావు, వినోద్ కుమా ర్, బడుగు లింగయ్య, రాజేశ్వర్ రెడ్గి లతో కలిసి విచ్చిన కెటిఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుకు సిపిఐ మద్దతు విషయంలో సురవరం పాత్ర కీలకమని కొనియాడారు.
సురవరం భౌతిక కాయానికి సందర్శించి నివాళులర్పించిన వారిలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయడు, మాజీ సిజెఐ జస్టిస్ రమణ, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి సీతక్క, పొన్నం ప్రభాకర్, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా, కార్యదర్శి నారాయణ, అజీజ్ పాషా, ఎంఎల్‌సి నెల్లికంటి సత్యం, జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, కె.శ్రీనివాస్‌రెడ్డి, సిపిఎం జాతీ య ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, టిజెఎస్ అధ్యక్షులు ప్రొ.కోదండరాం, కాం గ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్, టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ నేత కెవిపి రాంచందర్‌రావు, ఎంఎల్ఎ మల్రెడ్డి రంగారెడ్డి, సిపిఎం నేత మధు, మాజీ ఎంఎల్‌సి నాగేశ్వర్ రావు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, కెఎ పాల్, సినీనటుడు ఆర్. నారాయణ మూర్తి, తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
గాంఢీ మెడికల్ కాలేజీకి భౌతికకాయం అప్పగింత
కమ్యూనిస్టు దిగ్గజం, మాజీ ఎంపి సురవరం సు ధాకర్ రెడ్డి అంతిమ యాత్ర ఆదివారం ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ముగిసింది. పార్టీలకతీతంగా రాజకీయ ప్రముఖులు, వేలాది మంది కా ర్యకర్తలు ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్ నుంచి పోలీసు బ్యాండ్ వాయిద్యాల నడుమ సాగిన అంతిమ యాత్ర గాంధీ మెడికల్ కాలేజీకి చేరుకుంది. అనంతరం సురవరం భౌతికకాయా న్ని గాంధీ మెడికల్ కళాశాలకు ఆయన కుటుంబ సభ్యులు అప్పగించి ఆదర్శంగా నిలిచారు. సికిందరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రివద్దకు అంతిమ యాత్ర చేరుకున్నాక పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి గన్ సెల్యూట్ సమర్పించారు. అనంతరం రెండు నిముషాలు మౌనం పాటించి గౌరవ వం దనం సమర్పించారు. అంతిమ యాత్ర పొడవునా కామ్రేడ్ సురవం సుధాకర్ రెడ్డి అమర్ రహే, అం టూ సిపిఐ కార్యకర్తలు, నాయకులు నినాదాలు చేశారు. పూలతో అలంకరించిన వాహనంపై ఉంచి న ఆయన పార్థివదేహానికి లాల్ సలాంచెబుతూ నివాళులర్పించారు.
భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు, అభిమానులు, సిపిఐ కార్యకర్తలు, నాయకులు దారి పొడవునా అశ్రునయనాల మధ్య అం తిమ యాత్ర కొనసాగింది. యాత్రలో సిపిఐ జాతీ య ప్రధాన కార్యదర్శి డి.రాజా, జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. రెడ్ ఆర్మీతో ఘనంగా వీడ్కోలు పలికారు. ఎర్రజెండాల కవాతు నిర్వహించారు. గత కొంత కాలంగా అనారోగ్యంగో బాధపడుతున్న సురవరం సుధాకర్ రెడ్డి శుక్రవారం రాత్రి గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన భౌతిక కాయాన్ని ఆదివారం ఉదయం 9 గం.లకు ప్రజల సందర్శనార్థం మఖ్తూంభవన్కు తరలించారు. మధ్యాహ్నం 3 గం.ల వరకు మఖ్దూం భవన్లో పార్టీ శ్రేణులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రముఖులు నివాళులర్పించారు.